Saptapadi Meaning: హిందూ సంప్రదాయంలో పాటించే వివాహ ఆచారాలు ప్రపంచంలోనే అత్యంత అరుదైనవి, పవిత్రమైనవి. వివాహం స్వచ్ఛతకు చిహ్నం. హిందూ ధర్మంలో 16 ఆచారాలు ఉన్నాయి, వాటిలో ఒకటి వివాహం. ఒక వ్యక్తి జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలలో వివాహం ఒకటి. పసుపు కొట్టడం, మెహందీ సహా అనేక ఇతర ఆచారాలను హిందూ వివాహాలలో పాటిస్తారు. ఇందులో ‘సప్తపది’ పరమ పవిత్రమైనది. వధూవరులు హోమ గుండం చుట్టూ 7 ప్రదక్షిణలు చేయడం ద్వారా ఒకరికొకరు బాధ్యత వహిస్తారు. సప్తపదిలో వధూవరులు తీసుకునే 7 బాధ్యతలు లేదా ప్రమాణాలు ఏమిటో తెలుసుకుందాం.
మొదటి అడుగు
తాను ఇప్పటి నుంచి చేసే ఏ కర్మలోనైనా భార్యను భాగస్వామిని చేస్తానని మొదటి ప్రదక్షిణలో పెళ్లికొడుకు ప్రమాణం చేస్తాడు. ప్రతి పూజా-హవనంలో ఆమెను అర్థాంగిగా చేసుకుని, తాను ఏదైనా పుణ్యకార్యానికి వెళితే, తనతో తీసుకెళ్లడానికి అంగీకరించాలని వధువును కోరతాడు. ఏ రకమైన ధర్మబద్ధమైన పనిలోనైనా, నేను మీ ఎడమ పక్కనే ఉంటూ, నా బాధ్యతలను పూర్తి భక్తితో, శ్రద్ధతో నిర్వహిస్తానని వధువు వరుడికి మొదటి ప్రమాణం చేస్తుంది.
రెండవ అడుగు
రెండవ అడుగులో, మీరు మీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తారో, ఈ రోజు నుంచి నా తల్లిదండ్రులను కూడా అదే విధంగా గౌరవించాలి, కుటుంబ గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని వరుడు వధువును కోరతాడు. దీనికి అంగీకరిస్తే, తనతో తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతాడు. మీ కుటుంబాన్ని నేను చూసుకుంటానని వధువు వరుడికి మరో ప్రమాణం చేస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ గౌరవం ఇస్తానని ఆమె హామీ ఇస్తుంది.
మూడవ అడుగు
ఒక వ్యక్తి జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మూడు దశలు ఉన్నాయని, ఈ మూడు దశలలో నాతో ఉంటూ, అన్ని వేళల్లో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, నేను 3 వ అడుగు వేస్తానని వరుడు వధువుకు చెబుతాడు. దానికి ప్రతిగా, నా జీవితాంతం నీకు సేవ చేస్తానని, నీకు నచ్చిన ఆహారాన్ని తయారు చేసి అందించడం నా కర్తవ్యం అని వధువు ప్రమాణం చేస్తుంది.
నాలుగో అడుగు
పెళ్లి తర్వాత మా కుటుంబ బాధ్యతలన్నీ మీపైనే ఉంటాయి. మా ఇంటి బాధ్యతల నిర్వహణలో మీరు ఎల్లప్పుడూ నాతో ఉండటానికి సిద్ధంగా ఉంటే, నేను ఖచ్చితంగా నాలుగో అడుగు వేస్తాను అని వరుడు వధువకు ప్రమాణం చేస్తాడు. వధువు 16 ఆభరణాలను ధరించి, పూర్తి అంగీకారంతో వరుడికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ నాలుగో ప్రదక్షిణ చేస్తుంది. మీ మనస్సుతో, మాటతో, కర్మతో చేసే అన్ని కార్యక్రమాల్లో నేను మీకు మద్దతు ఇస్తాను అని వరుడికి ప్రమాణం చేస్తుంది.
ఐదవ అడుగు
మీరు చేసే వ్యాపారంలో, మీరు చేసే ప్రతి ఖర్చులో మీ భాగస్వామిగా నన్ను చేసుకోండి.. అంటే డబ్బుకు సంబంధించిన ఏ కార్యకలాపమైనా నేను మీకు అండగా ఉంటానని వరుడు వధువుకు ప్రమాణం చేస్తాడు. తన ప్రతిపాదనకు అభ్యంతరం లేకపోతే మీతో ఐదవ అడుగు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అడుగుతాడు. అందుకు ప్రతిగా.. మీ జీవితంలో ఎలాంటి సంతోషం, విచారం జరిగినా, నేను ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తానని వధువు హామీ ఇస్తుంది. నేను మీకు దుఃఖంలో శాంతిని, ఆనందంలో నవ్వును ఇస్తానని ఐదవ ప్రదక్షిణలో చెబుతుంది. మరో మనిషి ముందు ఎప్పుడూ చిన్నచూపు చూడనని ప్రమాణం చేస్తుంది.
ఆరవ అడుగు
ఆరవ అడుగులో వేరెవరి ముందు నన్ను అవమానపరచకూడదు. పెళ్లయిన తర్వాత ఎలాంటి మత్తు పదార్థాలు, జూదం ఆడకూడదు. దీనికి మీరు అంగీకరిస్తే తదుపరి అడుగు మీతోనే వేస్తానని వధువుకు వరుడు ప్రమాణం చేస్తాడు. జీవితాంతం నీ తల్లిదండ్రులకు సేవ చేస్తాను. మీ ఇంటికి వచ్చిన అతిథులందరినీ నేను గౌరవిస్తాను. వారికి సేవ చేయడంలో ఎలాంటి లోపం జరగనివ్వను. నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటానని వధువు వరుడికి ప్రమాణం చేస్తుంది.
Also Read : పెళ్లిలో సుముహూర్తం అంటే ఏంటి - జీలకర్ర బెల్లమే ఎందుకు పెడతారు!
ఏడవ అడుగు
ఇది వివాహానికి సంబంధించిన ఏడవది, చివరి ప్రమాణం. ఈ వివాహం తర్వాత మీరు ప్రపంచంలోని ఇతర పురుషులందరినీ తండ్రిగా, సోదరులుగా చూడాలని వధువును కోరతాడు. అంటే నా స్థానంలో నువ్వు నన్ను తప్ప మరే మనిషిని చూడకూడదు. మన మధ్య బంధంలో మరెవరికీ భాగస్వామ్యం ఉండకూడదు. మీరు దీనికి అంగీకరిస్తేనే మీతో ఈ చివరి అడుగు వేస్తానని వరుడు వధువుకు చెబుతాడు. ఈ సందర్భంగా వధువు తాను ఎల్లప్పుడూ మీతో ఉంటానని ధర్మం, అర్థ, కర్మ విషయాలలో మీ ఆదేశాలను పాటిస్తానని వరుడికి ప్రమాణం చేస్తుంది. ఇక్కడ అగ్ని సాక్షిగా మీ తల్లిదండ్రులు, బంధువులందరి సమక్షంలో, నిన్ను నా భర్తగా అంగీకరించి, నా శరీరం, మనస్సు, సంపదను మీకు సమర్పిస్తున్నానని చెబుతుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Also Read : మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!