నాగశౌర్యకు టైమ్ కలిసి రావడం లేదు. గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్న నాగశౌర్య ‘రంగబలి’ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొడతాననే ధీమాతో వచ్చిన నాగశౌర్య.. బాక్సాఫీస్ వద్ద ఊహించని రిజల్ట్ చూడాల్సి వచ్చింది. అవేవీ పట్టించుకోకుండా చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగశౌర్య, మూవీ దర్శక నిర్మాతలు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎదురైన ప్రశ్నలు నాగశౌర్యను ఇబ్బంది పెట్టాయి. దీంతో నాగశౌర్య అసహనంగా సక్సెస్ మీట్ మధ్య నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 


సినిమాలోని లాజిక్స్ గురించి విలేకరుల గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో దర్శకుడు పవన్ బాసంశెట్టి,, నాగశౌర్య అసౌకర్యానికి గురయ్యారు. అన్ని డిటైల్డ్‌గా చూపించాలంటే.. సినిమా సుమారు 16 గంటలు పడుతుందని నాగశౌర్య వెల్లడించాడు. ఆ తర్వాత సడన్‌గా సక్సెస్‌మీట్ నుంచి బయటకు వెళ్లారు. అయితే, ఈ మూవీలో ఫస్ట్ ఆఫ్ బాగుందని, సెకండాఫ్ మరీ లాగ్ ఎక్కువగా ఉందని రివ్యూలు వచ్చాయి. దీనిపై దర్శకుడు స్పందిస్తూ.. సినిమాలో ఫస్ట్ బాగా ఫన్నీగా చూపించడం వల్లే.. సెకండాఫ్‌లో అలా అనిపించి ఉంటుందని అన్నారు. 


మీడియా పెద్దలకు క్షమాపణలు చెప్పిన నాగశౌర్య


'రంగబలి' సినిమా ప్రమోషనల్స్ లో భాగంగా కమెడియన్ సత్యతో ఓ స్పూఫ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు మీడియా వ్యక్తులను ఇమిటేట్ చేస్తూ నాగశౌర్యతో సత్య చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సమయంలో ఈ ఇంటర్వ్యూ వల్ల కొందరు విలేకరులు హార్ట్ అయ్యారనే టాక్ వినిపించింది. ఇదే విషయాన్ని శౌర్య వద్ద ప్రస్తావించగా.. తాము ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదని అనుకోలేదని అన్నారు. స్పూఫ్ ఇంటర్వూ ఎవరి క్యారెక్టర్లతో అయితే చేశామో, వారంతా బానే వున్నారని, మిగిలిన వారే వాళ్లేదో ఫీలయ్యారని ప్రచారం చేసి, ఆ ఇంటర్వూను వైరల్ చేశారన్నారు. 


ఇక 'రంగబలి' సినిమాను శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీకి పవన్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చగా.. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. ఆమెతో పాటు ఈ సినిమాలో. షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరిలు కీలక పాత్రలు చేశారు.


‘‘మీడియా మేమూ ఒకటే ఫ్యామిలీ. మేమైతే అలానే అనుకుంటున్నాం. అదే మీడియా వాళ్లు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ డూప్‌ లను పెట్టి వీడియోలు చేస్తారు. మేము మా సినిమా ప్రమోషన్స్‌ కోసం ఎవరినీ హర్ట్ చేయకుండా, అందరికీ తెలిసిన వ్యక్తులను ఎంపిక చేసుకొని.. ఒక హీరోను వాళ్లు ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? అని సరదాగా చేశాం. ఇందులో ఎవరినీ ఎగతాళి చేయలేదు.. అసలు చేయాలని అనుకోలేదు. ఒకవేళ మా వీడియో వల్ల ఎవరైనా బాధపడితే, నిజంగా నన్ను క్షమించండి. సారీ చెప్పడానికి నాకు ప్రాబ్లమ్ ఏమీ లేదు. అది అనుకుని చేయలేదు.. అనుకోకుండా అయిపోయింది. నన్ను క్షమించండి'' అని నాగశౌర్య అన్నారు.


Read Also : ఈ విషయంలో నాన్న మనసు మారాలని యాదాద్రిలో మొక్కుకున్నా: మంచు లక్ష్మి



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial