Tirumala Latest News:  తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా జూలై 9వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. దీంతో జూలై 9 , జూలై 16న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు జూలై 8 , జూలై 15 తేదీల్లో సిఫార్సు చేసిన లేఖలు స్వీకరించేదిలేదని  టీడీపీ అధికారులు స్పష్టం చేశారు..


సాలకట్ల ఆణివార ఆస్థానం అంటే!


తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం జరుగుతుంది. సౌరమానం ప్రకారం ఏటా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని అంటారు.  అప్పట్లో మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజున  ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నిర్వహించేవారు.  టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ఈ రోజునే ప్రారంభమయ్యేవి. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలు వార్షిక బడ్జెట్ ను మార్చి - ఏప్రిల్ నెలకు మార్చారు.  


Also Read: ఆషాఢ గుప్త నవరాత్రులు - వారాహీ దేవిని ఎవరు పూజించాలి..ఎవరు పూజించకూడదు!


సాలకట్ల ఆణివార ఆస్థానం రోజు ఏం చేస్తారు!


సాలకట్ల ఆణివార ఆస్థానం రోజున ఉదయం బంగారువాకిలి ముందున్న మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామి  గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేస్తారు.  మరో పీఠంపై  శ్రీ మహావిష్ణువుకి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడు దక్షిణాభిముఖంగా వేంచేస్తారు. శివగణాలకు గణపతి వినాయకుడు అధిపతి అయితే..విష్ణు గణాలకు విష్వక్సేనుడు అధిపతి. ఉత్సవమూర్తులతో పాటూ ఆనందనిలయంలో మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా జీయ్యర్...పెద్ద వెండితట్టలో పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలనడుమ ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పిస్తారు. ఆ ఆరు వస్త్రాల్లో నాలుగింటిని మూలవిరాట్టుకి... మిగిలిన రెండింటిలో ఓదానిని మలయప్పస్వామికి మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.   ఆణివార ఆస్థానం నిర్వహించిన రోజు సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి  అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకీపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. 


Also Read: వారాహీ నవరాత్రులు ఇవాల్టి నుంచి ప్రారంభం - విశిష్టత, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి !


ఈ సేవలు రద్దు 


జూలై 16  ఆణివార ఆస్థానం కారణంగా వ‌ర్చువ‌ల్ సేవ‌లైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దుచేసింది. జూలై 9న  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా ఆ ముందు రోజు వచ్చే బ్రేక్ దర్శనాల లేఖలు, జూలై 16 ఆణివారఆస్థానం సందర్భంగా ఆ ముందు రోజు వచ్చే బ్రేక్ దర్శన లేఖలు స్వీకరించేది లేదని స్పష్టం చేశారు టీటీడీ అధికారులు.  






Also Read: పవన్ కళ్యాణ్ సూర్యారాధన - ఇది మామూలు సాధన కాదు మనలో శక్తిని తట్టి లేపే అద్భుత ప్రక్రియ!