Significance of Varahi Navaratri : ఆషాడ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజుల పాటూ వారాహీ నవరాత్రులు జరుపుకుంటారు. శరన్నరవాత్రులు, మాఘ గుప్త నవరాత్రుల్లో తొమ్మిదిరోజుల పాటూ అమ్మవారిని పూజించినట్టే ఆషాడమాసంలో వచ్చే వారాహీ నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిదిరోజుల పాటూ ప్రత్యేక పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు..ఉపవాసాలుంటారు, దీక్షలు చేపడతారు..
ఈ ఏడాది (2024) వారాహీ నవరాత్రుల తేదీలు - జూలై 6 నుంచి జూలై 15
వారాహీ నవరాత్రులు ఎలా చేసుకోవాలి
వారాహీ అమ్మవారి ఫొటో తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే..విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజలు చేయొచ్చు. పూజామందిరాన్ని శుభ్రంచేసి అమ్మవారి ఫొటో పెట్టండి. మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారో నవరాత్రులు పూర్తయ్యేవరకూ అక్కడే ఉంచాలి..మార్చకూడదు. అఖండ దీపం తొమ్మిదిరోజులపాటూ జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటే పెట్టండి లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది. కలశం పెట్టుకోవాలి వద్దు అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి..
Also Read: ఎనిమిది ఘట్టాలతో కూడిన ‘బోనాలు’ పండుగ..మొదలెక్కడ ముగింపేంటి!
వారాహీ అమ్మవారి పూజా విధానం
ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుడిని ప్రార్థించాలి. ఆ తర్వాత మళ్లీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని అమ్మవారి ఫొటోకి ప్రాణప్రతిష్ట చేయాలి. ఆ తర్వాత షోడసోపచారాలతో పూజ చేయాలి. ఆ తర్వాత అంగపూజ, వారాహి స్తుతి చదువుకోవాలి. ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వారాహీ అష్టోత్తరం, కవచం చదువుకుంటూ పూలు, కుంకుమతో పూజచేయండి. లలితా అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహీ అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాలు కూడా చదువుకోచ్చు.
షోడసోపచార పూజ అంటే ఇవే - మొత్తం 16 ఉపచారాలు
1. ఆవాహనం- దైవాన్ని ఆహ్వానించాలి
2. ఆసనం- ఆసనం చూపించాలి (అక్షతలు సమర్పిస్తారు)
3. పాద్యం- పాదాల ప్రక్షాళనకు నీళ్లు సమర్పిస్తారు
4. అర్ఘ్యం- చేతులు కడుక్కోవడానికి నీళ్లు చల్లుతారు
5. ఆచమనీయం- దాహం తీర్చుకునేందుకు నీళ్లివ్వాలి
6. స్నానం- అభిషేకం చేయాలి
7. వస్త్రం- దుస్తులు లేదా అక్షతలు, పూలు సమర్పించాలి
8. యజ్ఞోపవీతం- యజ్ఞోపవీతం లేదా అక్షతలు సమర్పిస్తారు
9. గంధం- గంధంతో అలంకరించాలి
10. పుష్పం- పూలతో అర్చించాలి
11. ధూపం- అగరొత్తులు వెలిగించాలి
12. దీపం- వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించాలి
13. నైవేద్యం- పండ్లు, పానకం, వంటలు నైవేద్యం పెట్టాలి
14. తాంబూలం- ఆకు, వక్క తాంబూలం ఇవ్వాలి
15. నమస్కారం- సాష్టాంగ నమస్కారం చేయాలి
16. ప్రదక్షిణ- ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి
Also Read: భాగ్యనగరంలో ఆషాఢ మాసం బోనాల జాతర సందడి..జగదాంబికకు జూలై 7న తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభం!
వారాహీ అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించండి. ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదువుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపుకుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వొచ్చు. పూజ అనంతరం ధూపం వేయడం అత్యంత ముఖ్యం.
దీక్షా నియమాలివే
వారాహీ అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి.. తొమ్మిది రోజుల పాటూ బ్రహ్మచర్యం పాటించాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకున్నవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది.
వారాహీ అమ్మవారిని పూజిస్తే ఏం ప్రయోజనం
- లలితా దేవి నుంచి ఉద్భవించిన వారాహీని పూజిస్తే అహంకారం తగ్గుతుంది
- కష్టాల్లో ఉన్నవారు , భూ సంబంధిత తగాదాలున్నవారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహీ అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది
- వారాహీ అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది
- అమ్మవారు సస్య దేవత..రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బావుంటుంది
- వారాహీ అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది
అయితే భగవంతుడి కరుణం కోసం పూజలు చేయాలి కానీ..కోరిన కోర్కెలు తీరాలని కాదు.. మీరు భక్తితో పూజిస్తే అమ్మవారికి తెలుసు ఏం ఇస్తే మీకు మంచి జరుగుతుందో.
Also Read: వందల ఏళ్లుగా జరుగుతున్న సంబురం.. ప్రకృతికి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించే బోనం!