బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువు, ఈద్ అంటే పండుగ అని అర్థం. జంతువును ఖుర్బాని ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ ఖుర్బాని అని కూడా అంటారు. మహ్మదీయుల క్యాలెండర్ ప్రకారం జిల్ హజ్ నెలలో బక్రీద్ పండుగ వస్తుంది. జిల్ హజ్ నెల పదో రోజున ఈ పండుగ జరుపుకుంటారు.
ముస్లింలు సంవత్సరాన్ని హిజ్రీ అంటారు. హిజ్రీ అంటే వలసపోవడం. మహ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు తరలివెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం సూత్రాల్లో ఒకటి. త్యాగనిరతతోపాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలో ఆంతర్యం.
ఖురాన్ ప్రకారం భూమిపైకి అల్లాహ్ ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాసయోగ్యంగా తీర్చిదిద్దారు. అల్లాహ్ ప్రార్థనల కోసం కాబా అనే ప్రార్థన మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా నిలిచారు. ఇబ్రహీంకు లేకలేక కలిగిన సంతానం ఇస్మాయిల్. ఇబ్రహీమ్‌ను అల్లాహ్ పలు రకాలుగా పరీక్షిస్తాడు. అందులో భాగంగా ఒక రోజు కలలో తన కుమారుడు ఇస్మాయిల్ మెడపై కత్తితో కోస్తున్నట్లు కలొచ్చింది. అల్లాహ్ ఖుర్బానీ కోరుతున్నాడని ఒంటెను బలి ఇస్తాడు ఇబ్రహీం. మళ్లీ అదే కల రావడంతో....ఇస్మాయిల్‌ని అల్లాహ్ బలి కోరుతున్నాడని భావించిన ఇబ్రహీం తన కొడుకుని బలిఇవ్వబోతాడు. ఆ త్యాగాన్ని మెచ్చిన అల్లాహ్… ఇస్మాయిల్ స్థానంలో ఓ జీవాన్ని బలి ఇవ్వమని జిబ్రాయిల్ అనే దూత ద్వారా ఇబ్రహీంకు తెలియజేస్తాడు. అప్పటి నుంచి బక్రీద్ పండుగ రోజున జీవాల్ని బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
సహజంగా ఖుర్బానీ అంటే పేదలకు మాంసం దానం ఇవ్వడం అనుకుంటారు. దానినే త్యాగం అని పిలుస్తున్నారు. ఖుర్బానీ అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థాలున్నాయి. అంటే దైవ సాన్నిధ్యం పొందడం, దైవానికి సమర్పించడం, దైవం కోసం త్యాగం చేయడమని అర్థం. ఖుర్బానీ ద్వారా రక్త మాంసాల్ని సమర్పించడం కాదు. భక్తి రూపేణా హృదయంలో జనియించే త్యాగ భావం. భయ భక్తులే భగవంతుని చెంతకు చేరుస్తాయని ముస్లింల భావన. అంతే కాదు భగవంతుని కోసం ప్రాణ త్యాగం చేసేందుకు వెనుకాడబోమని తెలిపేదే ఖుర్బానీ సందేశం.
బక్రీద్ పర్వ దినంరోజు ముస్లింలు జీవాన్ని బలి ఇచ్చి ఆ మాంసంలో ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు ఇచ్చి మూడో భాగం కుటుంబ సభ్యులకోసం వినియోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ రోజున ఖుర్బానీ చేస్తారు. హజ్ యాత్ర చేయలేని వారు బక్రీద్ రోజు జీవాన్ని బలి ఇచ్చి ఖుర్బానీ చేయాలి. ఖుర్బానీ విషయంలో ఎన్నో నియమాలు పాటించాలి.
ఖుర్భానిగా సమర్పించే జంతువులు అవయవలోపం లేకుండా ఆరోగ్యకరంగా ఉండాలి. ఒంటె, మేక, గొర్రెను దైవమార్గంలో సమర్పించాలి. స్థోమత కలిగిన ప్రతి ముస్లిం దీనిని విధిగా ఆచరించాలి. ఖురాన్ నియమ నిబంధనల ప్రకారం కోడిని బలి ఇవ్వరాదు. ఐదేళ్ల వయసు పైబడిన ఒంటె, రెండేళ్ల పై బడిన ఎద్దు, కనీసం ఏడాది వయసున్న మేక, గొర్రెలను బలి ఇవ్వాలి.