pegasus Spyware: రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్.. పెగాసస్ లిస్ట్ పెద్దదే..

ABP Desam Updated at: 20 Jul 2021 12:33 PM (IST)

పెగాసస్ స్పైవేర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా సహా పలువురు పెగాసస్ బాధితుల జాబితాలో ఉన్నారు.

Rahul,_Prashanth

NEXT PREV

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న పెగాసస్ స్పైవేర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2016 నుంచి పెగాసస్ నిఘా కొనసాగుతోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీక్ అయిన జాబితాలో ఎక్కువ నంబర్లను 2018 - 2019 మధ్య కాలంలో హ్యాక్ చేసినట్లుగా తెలిసింది. ప్రముఖ వార్తా సంస్థ ది వైర్ ప్రచురించిన కథనాల ప్రకారం దేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా సహా ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న ప్రహ్లాద్ పటేల్, అశ్వినీ వైష్ణవ్‌ల ఫోన్లు హ్యాక్ అయ్యాయి. 


తృణమూల్ పార్టీ ఎంపీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్యమంత్రి మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మమత వ్యక్తిగత కార్యదర్శి కూడా పెగాసస్ జాబితాలో ఉన్నారు. మాజీ సీజేఐ రంజన్ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ ఫోనుతో పాటు ఆమె సమీప బంధువులకు చెందిన 11 నంబర్లు సైతం ఈ జాబితాలో ఉండటం సంచలనంగా మారింది.   


తెలుగు రాష్ట్రాల్లోనూ స్పైవేర్ బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. విరసం (విప్లవ రచయితల సంఘం) నేత వరవరరావు కుమార్తె పవన పేరు కూడా ఈ జాబితాలో ఉందని ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. తన ఫోన్ లో స్పైవేర్ ఉందనే విషయం 2019 అక్టోబరులో వాట్సాప్‌ సంస్థ ద్వారా తనకు తెలిసిందని పవన చెప్పినట్లుగా కథనంలో పేర్కొంది. 


పొటెన్షియల్ స్పైవేర్ టార్గెట్ గా రాహుల్.. 
రాహుల్ గాంధీకి చెందిన రెండు ఫోన్లతో పాటు అతని స్నేహితులకు చెందిన 5 ఫోన్లు హ్యాక్ కు గురయ్యాయని ది వైర్ పేర్కొంది. ఈ ఐదుగురు రాజకీయాల్లో కానీ ప్రజా వ్యవహారాల్లో కానీ లేరని తెలిపింది. రాహుల్ గాంధీ సన్నిహితులైన అలంకార్ సవాయి, సచిన్ రావు ఫోన్లు కూడా లీకైన డేటాబేస్‌లో ఉన్నాయి. రాహుల్ గాంధీని పొటెన్షియల్ స్పైవేర్ టార్గెట్ గా ఎంచుకున్నట్లు తెలిపింది. రాహుల్ స్నేహితులైన ఐదుగురు వ్యక్తులను ది వైర్ సంప్రదించగా.. ముగ్గురు స్పందించారు. వీరిలో ఇద్దరు 2019లో ఉపయోగించిన ఫోన్లు ఇప్పుడు వాడటం లేదని చెప్పారు. ఇక మూడో వ్యక్తి మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్‌కు వెళ్లడం కంటే ఫోన్‌ను మార్చడానికే మొగ్గు చూపుతానని తెలిపారు. 



గతంలో నాకు వాట్సాప్ లో అనుమానాస్పద సందేశాలు వచ్చాయి. వాటిలో ఒకటి స్పైవేర్ అయి ఉండే అవకాశం ఉంది. అయితే హ్యాకర్ల బారిన పడకుండా నేను తరచూ ఫోన్ నంబర్లు మార్చాను. పెగాసస్ రూపంలో వ్యక్తుల గోప్యతపై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది చట్టవిరుద్ధం. దేశ ప్రజాస్వామ్య పునాదులపై దాడి జరగడం వంటిదే. - రాహుల్ గాంధీ


భారత్ సహా వివిధ దేశాల్లో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకుల వంటి వారిపై పెగాసస్ ద్వారా నిఘా పెట్టారనే విషయాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. నిఘా సాంకేతిక పరిజ్ఞానాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వినియోగించడం సరైనది కాదు. ఇది మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తారు. వాళ్లు కనుక మౌనం వహిస్తే మనమంతా బాధపడాల్సి ఉంటుంది. ఈ స్పైవేర్ ను రూపొందించిన ఎన్ఎస్‌వో గ్రూప్ దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.  - ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ మిచెల్ బాచిలెట్


 

Published at: 20 Jul 2021 12:28 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.