కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసిందని తెలిసినప్పుడు మన ఆనందం అంతా ఇంతా కాదు. అయితే అదే కరోనాలో వివిధ రకాల వేరియంట్లు వస్తున్నాయని తెలిసినప్పుడు మన బాధ కూడా వర్ణనాతీతం. ఎందుకంటే ఈ కరోనా వ్యాక్సిన్ లు వేరియంట్లపై ఎంత సమర్థంగా పనిచేస్తాయన్న సందేహాలే ఇందుకు కారణం. అసలు వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కొంతమందికి కరోనా ఎందుకు వచ్చింది.
డెల్టా వేరియంట్..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చినప్పటికీ కొత్తగా వెలుగు చూస్తున్న వేరియంట్లు వైరస్ కట్టడికి మరో సవాలుగా మారుతున్నాయి. అంతేకాకుండా కరోనా నుంచి కోలుకున్న వారిలోనూ రీ-ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతున్నాయి. ఈ సమయంలో భారత్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపిన డెల్టా వేరియంట్ (B.1.617.2)ను తటస్థీకరించడంలో కొవిడ్ వల్ల లేదా వ్యాక్సిన్‌ల వల్ల వృద్ధిచెందే యాంటీబాడీలు కాస్త తక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వుహాన్ రకంతో పోలిస్తే డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోవడంలో యాంటీబాడీల సామర్థ్యం తక్కువగానే ఉన్నట్లు భారత్‌లో జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
అధ్యయనంలో భాగంగా వ్యాక్సిన్ పొందిన తర్వాత వైరస్ సోకిన 100 మంది ఆరోగ్య కార్యకర్తల (HCW) సమాచారాన్ని భారత పరిశోధకులు విశ్లేషించారు. ఇందులో డెల్టా వేరియంట్ సోకినవారిలోనే ఎక్కువ వైరల్ లోడ్ ఉండగా.. ఇతర రకాలు సోకిన వారిలో ఇన్‌ఫెక్షన్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వైరస్ సంక్రమణ సామర్థ్యం డెల్టా వేరియంట్ వారిలోనే ఎక్కువగానే ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌లో స్పైక్ ప్రొటీన్‌లు ఎక్కువగా ఉన్నందున అవి ఊపిరితిత్తుల కణాలకు తేలికగా అతుక్కుపోతున్నట్లు వెల్లడించారు. తద్వారా వుహాన్ స్ట్రెయిన్‌తో పోలిస్తే చాలా ఎక్కువ మందికి ఇన్‌ఫెక్షన్ సోకడానికి డెల్టా వేరియంట్ కారణమని నిపుణులు మరోసారి స్పష్టంచేశారు.
వ్యాక్సిన్ తీసుకున్నా.. జాగ్రత్త గురూ..!
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లన్నీ వుహాన్‌లో వెలుగు చూసిన కరోనా రకాన్ని పరిగణలోకి తీసుకొనే రూపొందించారు. అయినప్పటికీ కొత్తగా వెలుగు చూస్తున్న కరోనా వేరియంట్లను ప్రస్తుత టీకాలు బాగానే ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ అధ్యయనాల్లో వెల్లడవుతోంది. కానీ, వుహాన్ రకంతో పోలిస్తే డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోవడంలో మాత్రం వ్యాక్సిన్‌లు కాస్త తక్కువ సామర్థ్యాన్ని కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వ్యాక్సిన్ తీసుకున్నా కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలపై నిర్లక్ష్యం చేస్తే వైరస్ మ్యుటేషన్లకు మరింత అవకాశం ఇచ్చినట్లేనని సర్ గంగారాం ఆస్పత్రిలోని పరిశోధకులు డాక్టర్ చాంద్ వాట్టల్ హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌లో ముందున్న బ్రిటన్ వంటి దేశాల్లో మరోసారి కరోనా ఉద్ధృతికి డెల్టా వేరియంట్ కారణమవుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఈ డెల్టా రకం (B.1.617.2) కరోనా వైరస్‌ను 'ఆందోళనకర వేరియంట్'గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ రకానికి వైరస్ సంక్రమణ సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో పాటు కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి యాంటీబాడీల నుంచి తప్పించుకోవడంతో భారత్‌లో ఈ వైరస్ ఆధిపత్యం కొనసాగిందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. తాజాగా దిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రితో పాటు మరో రెండు కేంద్రాల్లో జరిపిన అధ్యయనంలోనూ ఇదే విధమైన ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా వేగంగా వ్యాప్తి చెందే ప్రభావం, రీ-ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా ఈ వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.