ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయి. భారతదేశ మంత్రులు, విపక్ష నేతలు, ప్రముఖ మీడియా సంస్థల అధినేతల పోన్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మీడియాలలో వస్తోన్న కథనాలతో పెగాసస్ స్పైవేర్ పేరు మారుమోగిపోతోంది. రెండేళ్ల క్రితం ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ వేదికగా గళం విప్పారు. ఫేస్‌బుక్ సంస్థ కూడా గతంలో దీనిపై ఆరోపణలు చేసింది. అసలేంటీ పెగాసస్ స్పైవేర్..? ఈ ఇజ్రాయెల్ సాఫ్ట్‌వేర్‌తో పోన్లపై నిఘా నిజమేనా?
నిఘా కార్యకలాపాల కోసం..
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ (NSO) అనే నిఘా కంపెనీ ఈ పెగాసస్ స్పైవేర్ టూల్‌ను అభివృద్ధి చేసింది. నేరస్థులు, ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఉపయోగపడేలా దీనిని రూపొందించింది. కిడ్నాప్‌నకు గురైన వారిని గుర్తించడానికి, కూలిపోయిన భవనాల కింద చిక్కుకున్న వారికి కాపాడటానికి, సెక్స్, మాదక ద్రవ్యాల మాఫియాలను కనిపెట్టడానికి దీనిని ఉపయోగిస్తుంటామని ఎన్‌ఎస్‌ఓ సంస్థ తెలిపింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను ప్రభుత్వ సంస్థలకు విక్రయిస్తుంటుంది.
అంతర్జాతీయ మీడియా కథనాలతో..
పెగాసస్ వినియోగానికి సంబంధించి ఇటీవల ది గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, ది వైర్ సహా పలు అంతర్జాతీయ మీడియాలలో కథనాలు వెల్లువెత్తాయి. పెగాసస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారనేది ఈ కథనాల్లో ప్రధాన అంశంగా ఉంది. ఈ కథనాల ప్రకారం.. భారతదేశంలోనూ 300 మంది ప్రముఖుల ఫోన్ నంబర్లు హ్యాక్ అయ్యాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు అంటే 2018-19 మధ్య ఇది జరిగిందని పేర్కొన్నాయి.
ఈ జాబితాలో కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, న్యాయ నిపుణులు, ప్రముఖ మీడియా సంస్థల అధినేతలు ఉన్నారు. భారతదేశంతో పాటు బహ్రెయిన్, మెక్సికో, సౌదీ అరేబియా, హంగేరి వంటి ఇతర దేశాల ప్రముఖులు పేర్లు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 వేల మంది ఫోన్ నంబర్లపై పెగాసస్ ద్వారా ఎన్‌ఎస్‌ఓ నిఘా పెట్టిందని మీడియా కథనాలు వెల్లడించాయి.
రెండేళ్ల క్రితమే ఆరోపణలు..
సరిగ్గా రెండేళ్ల క్రితం తమ యూజర్ల గోపత్యకు పెగాసస్ వల్ల భంగం వాటిల్లుతోందని ఫేస్‌బుక్ సంస్థ ఆరోపించింది. దీనికి సంబంధించి ఎన్‌ఎస్‌ఓ కంపెనీపై కేసు కూడా నమోదు వేసింది. పెగాసస్ స్పైవేర్ ద్వారా ఎన్‌ఎస్‌ఓ యూజర్ల డేటాను దొంగలిస్తుందనే ఆరోపణలు చేసింది. అదే ఏడాది కొందరు కేంద్ర మంత్రులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయన్న వార్తలు వెల్లువెత్తాయి. 2019లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అధికార ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేయిస్తోందని ఆరోపించారు.
గుర్తించే లోపే అయిపోతుంది..
యూజర్లకు ఏ మాత్రం అనుమానం రాకుండా ఫోన్లను హ్యాక్ చేయడమే పెగాసస్ ప్రత్యేకత. మొదట హ్యాక్ చేయాలనుకున్న వ్యక్తి ఫోనుకు ఓ మిస్డ్ కాల్ వస్తుంది. దానిని లిఫ్ట్ చేసినా.. చేయకపోయినా పర్వాలేదు. మిస్ట్ కాల్ వచ్చిందంటే సదరు వ్యక్తి ఫోనులో పెగాసస్ వచ్చి చేరినట్లే. గేమ్స్, సినిమా యాప్స్, వైఫైల ద్వారా కూడా ఇది ఫోన్లలోకి చొరబడుతుంది.
గతంలో మెసేజ్‌లు, మెయిల్స్ ద్వారా లింకులను పంపేది. వీటిని క్లిక్ చేసిన వ్యక్తి ఫోన్‌లో పెగాసస్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. దీనిని నిరోధించే పద్ధతులను ఫోన్ల కంపెనీలు కనిపెట్టగలగడంతో ఒక అడుగు ముందుకేసి ఈ మిస్డ్ కాల్ టెక్నిక్‌ను వాడుతోంది. స్పైవేర్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మిస్డ్ కాల్‌ను కూడా ఇది డిలీట్ చేస్తుంది. దీంతో యూజర్లు కూడా దీనిని కనిపెట్టలేరు.
తర్వాత ఏం అవుతుంది?
ఒక్కసారి పెగాసస్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన తర్వాత యూజర్ల కాల్స్, మెసేజ్‌లతో పాటు ఫోన్‌ను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకుంటుంది. యూజర్లకు తెలియకుండా కాల్స్ రికార్డ్ చేయడం, లొకేషన్ తెలుసుకోవడం, మెసేజ్‌లు, ఈమెయిల్స్ చదవడం, డివైస్ సెట్టింగ్స్, మైక్రోఫోన్‌ను ఆన్ చేయడం వంటివి చేస్తుంది.
ఇప్పుడెలా బయటపడింది..
అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ (Amnesty International’s technical lab) పరిశీలన ద్వారా ఫోన్లు హ్యాక్ అయ్యాయనే సంగతి బయటపడింది. అనుమానం వచ్చిన ఫోన్లను ల్యాబ్‌లో అధునాతన పద్ధతిలో పరిశీలిస్తే అవి హ్యాక్ అయ్యాయనే సంగతి నిర్ధారణ అయింది.
రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్..
పెగాసస్ స్పైవేర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2016 నుంచి పెగాసస్ నిఘా కొనసాగుతోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీక్ అయిన జాబితాలో ఎక్కువ నంబర్లను 2018 - 2019 మధ్య కాలంలో హ్యాక్ చేసినట్లు తేలింది. ప్రముఖ వార్తా సంస్థ ది వైర్ ప్రచురించిన కథనాల ప్రకారం దేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా సహా ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న ప్రహ్లాద్ పటేల్, అశ్వినీ వైష్ణవ్‌ల ఫోన్లు హ్యాక్ అయ్యాయి.
ప్రభుత్వంపై ఆరోపణల వెల్లువ..
ఎన్ఎస్‌వో గ్రూప్ ఈ స్పైవేర్‌ను నిఘా కార్యకలాపాల కోసం విక్రయిస్తుండటంతో ఈ హ్యాకింగ్‌లో ప్రభుత్వ పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హ్యాకింగ్ అంశంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. 'ఆయన ఏమి చదువుతున్నాడో మాకు తెలుసు- మన ఫోన్‌లోని ప్రతిదీ!' అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి సైతం ట్వీట్ చేశారు. 'మోదీ క్యాబినెట్‌లోని మంత్రులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, జర్నలిస్టులపై పెగాసస్‌తో నిఘా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
హ్యాకింగ్ గురించి తమపై వస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇందులో తమ జోక్యం ఏమీ లేదని స్పష్టత ఇచ్చింది. ఇక పెగానస్ స్పైవేర్ టూల్‌ను రూపొందించిన ఎన్‌ఎస్‌ఓ సైతం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇవన్నీ అవాస్తవాలని తెలిపింది. దీనిపై కోర్టులో పరువునష్టం దావా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపింది.