సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి తన లేఖ పంపారు. గత 26 సంవత్సరాలుగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయనకు 6 సంవత్సరాల సర్వీస్ ఉంది. అయినా వదులుకోవాలని డిసైడయ్యారు. అయితే ఆయన భవిష్యత్ ప్రణాళిక ఏమిటో స్పష్టంగా రాలేదు కానీ.. రాజకీయంపై ఆలోచన ఉందని మాత్రం.. తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసిన లేఖ చివరి వాక్యాలు చూస్తే అర్థమైపోతుంది.
కొత్త పార్టీతోనా... కారుతోనా?
ఆర్,.ఎస్. ప్రవీణ్ కుమార్ కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నానని ఆయన సన్నిహితులకు చెబుతున్నారు. జైభీమ్ పార్టీ పెడతారని.. ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయనను టీఆర్ఎస్ ప్రభుత్వమే వ్యూహాత్మకంగా ముందస్తుగా పదవీ విరమణ చేయిస్తోందని.. హుజూరాబాద్ నుంచి ఆయనను టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందని మరోవైపు ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన ఆలంపూర్‌కు చెందిన వారు. హుజూరాబాద్‌కు నాన్ లోకల్ అవుతారు. అయితే.. స్వేరో ఉద్యమంతో ఆయన అన్ని చోట్లా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .. ఐపీఎస్ అయినప్పటికీ.. చాలా కాలంగా... ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో పోలీసు శాఖకు సంబంధం లేని ఉద్యోగం చేస్తున్నారు. ఆయన క్యాడర్ అదనపు డీజీపీ. అయితే ఆయన తొమ్మిదేళ్లుగా గురుకుల పాఠశాలల వ్యవహారాలను చూస్తు్న్నారు. గురుకులాల విషయంలో ఆయన సంస్కరణలు తీసుకు వచ్చారు. స్వేరో పేరుతో.. ఓ రకమైన సమాంతర వ్యవస్థను నెలకొల్పారు. ఈ వ్యవస్ధ ద్వారా దైవదూషణకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వీడియో కూడా కలకలకానికి కారణం అయింది. ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. సర్వీస్ నుంచి వైదొలగాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే ... ఆ దైవదూషణతో తనకు సంబంధం లేదని సమర్థించుకున్నారు.
రావడం మాత్రం పక్కా
ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా తెలంగాణ సర్కార్ మాత్రం పెద్దగా స్పందించలేదు. ఆయనపై ఎలాంటి వ్యతిరేక చర్యలు కానీ.. వ్యాఖ్యలు కానీ చేయలేదు. కనీసం పోస్టింగ్ కూడా మార్చలేదు. ఇప్పుడు నేరుగా ఆయనే సర్వీస్ నుంచి వైదొలిగారు. త్వరలో పార్టీ పెడతారో.. లేకపోతే టీఆర్ఎస్‌లో చేరుతారో కానీ... రెండింటిలో ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఆయన రాజకీయ ఆకాంక్షలతోనే సర్వీసు వదులుకుంటున్నారని చెప్పక తప్పదు. ప్రస్తుతం హూజూరాబాద్ ఎన్నికలు జరుగుతూండటంతో.. ఆయన పేరు ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది.
హిస్టరీ చెబుతున్నదే వేరు!
అయితే సివిల్ సర్వీస్ అధికారులు రాజకీయాల్లో సక్సెస్ కావడం అనేది చాలా స్వల్పంగా ఉంది. రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి.. గెలుపొందడం.. లేదా ఓడిపోవడం వంటి సివిల్ సర్వీసు అధికారుల గురించి పక్కన పెడితే.. విధి నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. రాజకీయం వైపు అడుగులేసిన వారు పెద్దగా ఎక్కడా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. జయప్రకాష్ నారాయణ చాలా కాలం పాటు లోక్ సత్తా ఉద్యమాన్ని నడిపి.. రాజకీయ పార్టీగా మార్చారు. చివరికి ఆయన అవమానభారంతో మళ్లీ లోక్ సత్తాను ఉద్యమ సంస్థగా మార్చేశారు. ఇప్పుడు ఆ పార్టీ లేదు. ఇక సీబీఐ జేడీగా ప్రత్యేక గుర్తింపు పొందిన వీవీ లక్ష్మి నారాయణ కూడా.. రాజకీయంగా సక్సెస్ కాలేకపోయారు. ఆయన ఇప్పుడు మళ్లీ తన స్వచ్చంద సేవ వైపు వెళ్లారు. ఇప్పుడు.. స్వేరో ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ కుమార్.. రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారో.. ఎలాంటి ఫలితాలు వస్తాయో.. ఆసక్తికరమే.