Rishi Panchami 2024 Date: సెప్టెంబరు 08 ఆదివారం రుషి పంచమి


భూమ్మీద మనిషిగా జన్మించినందుకు తీర్చుకోవాల్సిన పంచరుణాల్లో రుషి రుణం కూడా ఒకటి. మనం అనుసరించాల్సిన ధర్మాలు, పాటించాల్సిన ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ నేర్పించింది వీళ్లే..అందుకు కృతజ్ఞతగా రుషిపంచమి రోజు వారిని సంతుష్టులను చేస్తారు.  


కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మతాః!!


కశ్యపుడు, అత్రి, భారద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్టుడు, జమదగ్ని...ఈ ఏడుగురిని సప్త రుషులు అంటారు. వీరిని స్మరించుకునే రోజే రుషిపంచమి. రుషిపంచమి స్త్రీలకు సంబంధించిన పండుగ. ఏటా భాద్రపద శుద్ధ చవితి మర్నాడు వచ్చే పంచమి రోజు ఆచరించాలని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే రజస్వల సమయంలో ఏర్పడిన దోషాలు తొలగిపోతాయని, ఆ సమయంలో చేసే పాపాలు పరిహారం అవుతాయని స్వయంగా బ్రహ్మదేవుడు శితాశ్వుడనే మహారాజుకి చెప్పాడని పురాణాల్లో ఉంది. 


Also Read: అరుణాచలంలో నిత్యం గిరిప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఎవరు.. ఆమెను చూస్తే భక్తులకు ఎందుకంత పూనకం!
 
ప్రతి వంశానికి ఓ రుషిని మూల పురుషుడిగా చెబుతారు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి అంటారు. కొందరికి గోత్ర రూపంలో నిత్యం రుషులు స్మరణీయులే..మరికొందరికి పూర్వ రుషులు తెలియకపోయినా వారి వంశాలకు రుషులున్నారు. మొత్తం రుషులకు ప్రతినిథులుగా సప్తర్షులను పూజిస్తారు..


వ్యాస మహర్షి


వేదాలను, పురాణాలను, ఉపనిషత్తులను అందించిన వేదవ్యాసుడిని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు..


కశ్యపుడు
 
సప్తర్షుల్లో కశ్యప ప్రజాపతి... మరీచి  - కళ సంతానం.  దక్షప్రజాపతి కుమార్తెలలో 13 మందిని, వైశ్వానరుని కుమార్తెలలో ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. వారి ద్వారా అనూరుడు, గరుడుడు,  నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షి, విభండకుడు అనే బ్రహ్మర్షి,   దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షజాతులు, జంతు గణాలు, పక్షులు, గోగణాలు, పుత్రులుగా పొందాడు.


అత్రి 


సప్త మహర్షులలో ఒకరైన అత్రి మహర్షి.. బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. ఆయన భార్య అనసూయ.. తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను పుత్రులుగా పొందారు. ఐదుగురు పతివ్రతల్లో అనసూయ ఒకరు..


భారద్వాజుడు


ఉతథ్యు - మమతల కుమారుడు భారద్వాజుడు. పాండవులు, కౌరవులకు విలువిద్య నేర్పిన ద్రోణుడికి జన్మనిచ్చింది, అశ్వత్థామకి తాతగారు భారద్వాజుడే..


విశ్వామిత్రుడు


రాజర్షి అయిన విశ్వామిత్రుడు త్రిశంకుడిని స్వర్గానికి పంపించేందుకు కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రుడితో అబద్ధం చెప్పించేందుకు కొంత ఫలాన్ని దారపోశాడు. మేనక కారణంగా తపస్సునుంచి మనసు చలించి శకుంతలకు జన్మనిచ్చాడు. శకుంతల - దుష్యంతుల సంతానం అయిన భరతుడి వల్లే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. 


Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!


గౌతముడు


తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడిన సమయంలో తన తపోబలంతో మునులందరకీ భోజన వసతి కల్పించాడు గౌతముడు. అయితే ఇతర రుషుల ఈర్ష్య కారణంగా మాయా గోవును దర్భలతో అదిలించి బ్రహ్మహత్యాపాతకం అంటగట్టించుకున్నారు. ఆ దోష పరిహారం కోసమే గోదావరిని భూమిపైతి తీసుకొచ్చాడు. శిలగా మారమని అహల్యకు శాపమిచ్చిన భర్త గౌతముడే..


జమదగ్ని 
 
రుచికముని, సత్యవతుల కుమారుడు జమదగ్ని...ఈయన కుమారుడే పరశురాముడు. తన భార్య రేణుక మనసులో కలిగిన అన్యపరుష వ్యామోహం వల్ల ఆమె తల నరికివేయాల్సిందిగా తనయులను ఆజ్ఞాపిస్తాడు జమదగ్ని మహర్షి. తండ్రి మాట పాటించిన పరశురాముడు ఆ తర్వాత తండ్రి ద్వారానే తల్లిని బతికించుకుంటాడు.
 
వశిష్టుడు
 
సప్తర్షులతో ఏడో వ్యక్తి వశిష్టుడు. ఈయన భార్య అరుంధతి. బ్రహ్మ మానస పుత్రుల్లో వశిష్టుడు...శక్తి సహా వందమంది పుత్రులకు జన్మనిచ్చాడు.  


Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!


సకల జీవుల పుట్టుకకు మూలకారకులు అయిన సప్త రుషులను పూజించే రోజే రుషి పంచమి.  7 సముద్రాలు, 7 కుల పర్వతాలు, ఏడుగురు రుషులు, 7 ద్వీపాలు, 7 భువనాలను...బ్రహ్మముహూర్త కాలంలో స్మరించుకుంటే సకల శుభాలు కలుగుతాయంటారు. అందుకే భాద్రపద శుక్ల పంచమి రోజు సుమంగళి స్త్రీలు తమ దోషాల పరిహారార్థం రుషులను పూజించి దాన ధర్మాలు చేస్తే...  సకల సౌభాగ్యాలు కలుగుతాయని శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా వివరించాడట.


నిజానికీ పండుగ స్త్రీలకు సంబంధించింది. ఇంకా చెప్పాలంటే స్త్రీలు ఆచరించుకునే వ్రతం.   భాద్రపద మాసం శుద్ధపంచమిరోజు  ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే రజస్వల సమయంలో చేసిన దోషాలన్నీ పరిహారమవుతాయని బ్రహ్మ దేవుడు శితాశ్వుడనే రాజుకు చెప్పాడని  పురాణాల్లో ఉంది... 


రుషి పంచమి వ్రత విధానం


సూర్యోదయానికి ముందే స్నానమాచరించి...దేవుడి మందిరం శుభ్రం చేసుకోవాలి. పూజామందిరంలో  గణపతి, నవగ్రహాలు, షోడశ మాతల్ని ప్రతిష్టించుకోవాలి.. అవకాశం ఉంటే సప్త రుషులు ఫొటోను పూజలో ఉంచాలి. షోడసోపచార పూజ పూర్తిచేసిన తర్వాత వ్రత కథను చదువుకోవాలి.  


రుషి పంచమి వ్రతకథ


విదర్భదేశంలో ఉత్తమకుడనే బ్రాహ్మణుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం జరిగిన కొద్ది రోజులకే విధవరాలిగా మారడంతో తిరిగి తన ఇంటికి తీసుకొచ్చేశాడు ఆ ఉత్తమకుడు. ఓ రోజు ఆమె శరీరం నుంచి పురుగులు పడడం గమనించి..తనకున్న తపోబలంతో ఏం జరిగిందో తెలుసుకనే ప్రయత్నం చేస్తాడు. పూర్వజన్మలో రజస్వల సమయంలో .. అన్నం వండుతున్న పాత్రను తాకడం వల్ల ఇలా జరిగిందని తెలుసుకుంటాడు. వెంటనే ఆమెతో రుషి పంచమి వ్రతాన్ని చేయించి ఆ దోషం నుంచి విముక్తి కలిగేలా చేస్తాడు.  లాగే-


మరో కథ ప్రకారం...


విదర్భ నగరంలో శ్వేతజితుడనే రాజు...సుమిత్ర అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేవారు. సుమిత్ర రజస్వల సమయంలోనూ శ్వేతజితుడు ఆమెకు దూరంగా ఉండేవాడు కాదు. ఆ ఫలితంగా మరానంతరం సుమిత్ర కుక్కగానూ, శ్వేతజితుడు ఎద్దుగా జన్మించి... సమిత్ర తనయుడైన గంగాధరం ఇంటికే చేరుతారు. ఓ రోజు గంగాధరం ఆబ్దీకం నిర్వహిస్తున్న సమయంలో కుక్క రూపంలో ఉన్న సుమిత్ర నైవేద్యాన్ని ముట్టుకుంటుంది. అది చూసి గంగాధరం మొత్తం వదిలేసి మళ్లీ వంటచేయిస్తాడు. ఆ బాధను ఎద్దుతో చెప్పుకుని బాధపడుతుంది ఆ కుక్క.. ఈ మాటలు అర్థం చేసుకున్న గందాధరం కుక్కరూపంలో ఉన్నది తన తల్లియే అని తెలిసి.. ఆమె చేసిన పాపం తెలుసుకుని... రుషి పంచమి వ్రతం ఆచరించి ఆ ఫలితాన్ని దారపోసి ఆమె పాపానికి పరిహారం చేస్తాడు.  


ఓ రకంగా చెప్పాలంటే రజస్వల సమయంలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా చేసే వ్రతమే రుషిపంచమి. నేటి తరంలో వీటి గురించి పెద్దగా తెలియకపోయినా ఇప్పటికీ ఇలాంటి నోములు ఆచరించేవారున్నారు. వివాహితులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే భర్త ప్రేమను పొందుతారు.. అవివాహితులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తముడిని భర్తగా పొందుతారు. ఏడేళ్లపాటూ క్రమం తప్పకుండా ఈ వ్రతం ఆచరించి ఆ తర్వాత ఉద్యాపన చేసుకోవాలి..


నోట్: పురాణ గ్రంధాలలో సూచించిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది.. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...