Tollywood Actor Brahmaji tweets on YS Jagans comment | విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితుల ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయని, ఏపీలో అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. వరదల కన్నా, కూటమి ప్రభుత్వం అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా జరిగిందని ఆరోపించారు. ఐదారు లక్షల మందిని చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోలేని స్థితిలో ఉందని సెటైర్లు వేశారు. మూడు రోజుల్లో 30 సెం.మీ. పైగా వర్షం పడటం అసాధారణం ఏమీ కాదు, కానీ ఈ విధంగా 50 మందికి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎప్పుడూ లేవని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు జగన్. వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్ పై టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ స్పందించారు. 


మీరు కరెక్ట్ సార్, వాళ్లు చెయ్యలేరు సార్.. ఇకనుంచి మనం చేద్దాం సార్ అని వైఎస్ జగన్ ట్వీట్ పై బ్రహ్మాజీ ఇలా స్పందించరారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందు మనం 1000 కోట్లు రిలీజ్ చేద్దాం, మన వైస్సార్సీపీ క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదామన్నారు. ఎందుకంటే మనకు ప్రభుత్వం, అధికారం ముఖ్యం కాదు, జనాలు ముఖ్యం సార్. మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్ అన్న అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్ పై భిన్నమైన రియాక్షన్స్ వస్తున్నాయి. ప్రజల కోసం ఆలోచించి మంచి సలహా ఇచ్చారని, వైసీపీకి తిక్క కుదిర్చారంటూ బ్రహ్మాజీ కామెంట్ పై టీడీపీ సహా కూటమి నేతలు స్పందిస్తున్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేయడం, దుష్ప్రచారం చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుందంటూ టీడీపీ, జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. 






బ్రహ్మాజీ ఓ జోకర్.. పళ్లు రాలతాయంటూ వైసీపీ ఫైర్


నటుడు బ్రహ్మాజీ మాజీ సీఎం జగన్ కు మద్దతు తెలుపుతున్నట్లు చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. వైసీపీని, జగన్ ను కించపరిచేందుకు బ్రహ్మాజీ ఆ ట్వీట్ చేశాడంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి చింత నటుడు బ్రహ్మాజీ కామెంట్ పై ఘాటుగా స్పందించారు. ‘ఒక విషయం గుర్తుపెట్టుకో బఫూన్‌ బ్రహ్మాజీ. కావాలంటే సినిమాల్లో కామెడీ చేయ్ - చిల్లర డబ్బులు రాలుతాయి. కానీ సీరియస్ మ్యాటర్‌లో కామెడీ చేయకు, మూతి పళ్లు రాలుతాయి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.


బుడమేరు మూడో గండిని సైతం ఏపీ ప్రభుత్వం శనివారం పూడ్చివేసింది. దాంతో విజయవాడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు రెండు రోజులు కంటి మీద కునుకు లేకుండా బుడమేరు గండ్లు పూడ్చే పనిని పర్యవేక్షించారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహకారంతో ఈ పని త్వరగా పూర్తిచేశానన్నారు మంత్రి రామానాయుడు. ప్రకాశం బ్యారేజీకి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన వెయిట్స్ అమర్చారు. మరోవైపు కొల్లేరు ముంపు ముప్పు మొదలవుతుందా అని టెన్షన్ నెలకొంది. ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో బుడమేరుతో పాటు ప్రధాన నదులు, వాగులు, కాలువల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 
Also Read: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం