CM Chandrababu Visit Flood Affected Areas In Vijayawada: గత ప్రభుత్వ పాపాన్ని ఈ రోజు కరెక్ట్ చేశామని.. ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా గాలికొదిలేసిన పాపం నేడు మనకు శాపంగా మారిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆవేదన వ్యక్తం చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ఆయన ఏడో రోజు పర్యటించారు. అనంతరం విజయవాడ (Vijayawada) కలెక్టరేట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాపాలు.. రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారాయని మండిపడ్డారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినా, పులిచింతల, గుండ్లకమ్మ గేట్ కొట్టుకుపోయినా ఎన్నడూ పట్టించుకోలేదని అన్నారు. బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. 










'డిమాండ్ చేసి తీసుకోండి'


వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకుల కిట్ అందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఎవరికైనా అందకుంటే డిమాండ్ చేసి తీసుకోవాలని కోరారు. 'వరద ప్రాంతాల్లో ఇంకా 4 అడుగుల మేర నీరు నిలిచి ఉంది. విజయవాడలో మళ్లీ వర్షం పెరిగి సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు ఆహారం, తాగునీరు, పండ్లు, పాలు పంపిణీ చేస్తున్నాం. శనివారం రాయితీ ధరపై 64 టన్నుల కూరగాయలు విక్రయించారు. వరద ప్రాంతాల్లో 78 శాతం రోడ్లను సిబ్బంది శుభ్రం చేశారు. ఇంకా వరద తగ్గని ప్రాంతాలకు మినహా అన్ని ఏరియాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. సెల్ టవర్ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. 1.40 లక్షల ఇళ్లల్లో సామగ్రి పాడైపోయింది. చాలామంది ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. కొన్ని కంపెనీలతో మాట్లాడి ఉపాధి కల్పిస్తాం. కేంద్రాన్ని తొలి విడతగా రూ.6,880 కోట్లు అడిగాం.' అని సీఎం వివరించారు.


మరోవైపు, ప్రకాశం బ్యారేజీలో వరద ఉద్ధృతికి కొట్టుకొచ్చి గేట్లను ఢీకొన్న 4 బోట్లపై విచారణ జరుగుతోందని.. దీని వెనుక కుట్ర ఏంటో.. చేసిన దుర్మార్గం ఏంటో అన్నీ బయటకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక విష పత్రికను పెట్టుకుని, రోజుకి ఒక విషపు రాతలు రాస్తూ, నీచ రాజకీయానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాడు రాజకీయాల్లో ఉండటానికి కూడా అనర్హుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.






వర్షంలోనే సీఎం పర్యటన


మరోవైపు, సీఎం చంద్రబాబు భారీ వర్షంలోనే శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. భవానీపురం, సితార సెంటర్, చిట్టినగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ ప్రాంతాల్లో దాదాపు 3 గంటల పాటు ఆయన పర్యటన సాగింది. సింగ్ నగర్‌లో వరద తగ్గకపోవడంతో జేసీబీ ఎక్కి మారుమూల ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో మాట్లాడి సహాయక చర్యలు అందుతున్నాయో లేదో అని ఆరా తీశారు. సహాయం అందుతున్నా వరదలతో తాము తీవ్రంగా నష్టపోయామని మహిళలు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.


Also Read: AP Floods: ఏపీలో వరద నష్టంపై ప్రాథమిక నివేదిక సిద్ధం - శాఖల వారీగా నష్టం వివరాలివే!