Ramayana: దశరథుని మరణం తరువాత మంత్రులు, ఇతర రాజులు భరతుడిని అయోధ్యకు రాజుగా పట్టాభిషేకం చేయాలని ప్రతిపాదించారు. కానీ భరతుడు ఆ ప్రతిపాదనను నిరాకరించాడు, రాముడిని తిరిగి తీసుకువచ్చి రాజుగా పట్టాభిషేకం చేస్తానని చెప్పాడు. రాముడిని తిరిగి తీసుకురావడానికి భరతుడు తన తల్లి కైకేయి, వశిష్ఠుడు వంటి ఋషులు, మంత్రులతో కలిసి సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్లాడు.
రాముడిని కలవాలనే ఆతృతతో భరతుడు మిగిలిన వారికంటే వేగంగా అడవిలోకి అడుగు పెట్టాడు. భరతుడు రాముడిని చూడగానే ఆయన పాదాలపై పడి గౌరవంగా నమస్కరించాడు. దశరథుడు మరణించాడని రామ, లక్ష్మణులకు చెప్పాడు. ఆ వార్త విని రాముడు, లక్ష్మణుడు, సీత చాలా బాధపడ్డారు. ఋషులతోపాటు సోదరులతో కలిసి రాముడు గంగానదిలో తండ్రికి తర్పణం వదిలాడు. ఆ తర్వాత భరతుడు రాముడిని తిరిగి అయోధ్యకు తీసుకెళ్లాడా..?
Also Read : శ్రీరాముని ఈ 10 పేర్లు, వాటి అర్థాల గురించి మీకు తెలుసా?
1.రాముడిని ఒప్పించేందుకు భరతుని ప్రయత్నం
మరుసటి రోజు, ప్రభాత ప్రార్థన తర్వాత భరతుడు, “సోదరా! నీ వనవాసానికి నా తల్లి కారణం. ఆమె స్వార్థపూరిత ప్రవర్తనకు నేను మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. మన తండ్రి దశరథుడు కూడా భార్యపై ప్రేమతో తప్పుడు నిర్ణయం తీసుకుని నిన్ను వనవాసానికి పంపించారని తండ్రిపై తన కోపాన్ని వెళ్లగక్కాడు. దయచేసి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకానికి అంగీకరించమని రాముడిని వేడుకున్నాడు.
అప్పుడు రాముడు ‘‘భరతా..! మన తండ్రి తెలివితక్కువవాడు కాదు, భార్య ప్రేమలో పడి స్పృహ కోల్పోయే గుడ్డివాడు కాదు. సత్యానికి భయపడి నన్ను అడవికి పంపాడు. సత్యానికి మించిన భయం లేదు. తండ్రి నీకు రాజ్యాన్ని, నాకు అరణ్యాన్ని ఇచ్చారు. నాన్న చనిపోయిన తర్వాత నేను సింహాసనాన్ని స్వీకరిస్తే ఆయనను మోసం చేసినట్టే. నేను అయోధ్యకు తిరిగి రాలేను" అని భరతుడితో చెప్పాడు.
2. రాముడిని క్షమాపణ కోరిన కైకేయి
కైకేయి రాముని వద్దకు వచ్చి, “రామా, నన్ను క్షమించు. నేను స్వార్థంతో నిన్ను అరణ్యవాసానికి పంపాను. ఇప్పుడు నేను నా తప్పును గ్రహించాను, దయచేసి అయోధ్యకు తిరిగి వచ్చి మీ తండ్రిలా రాజ్యాన్ని పాలించు" అని వేడుకుంది. రాముడు, ‘‘అమ్మా, నీ పట్ల నాకు ఎలాంటి అగౌరవం, రాజ్యంపై ఆశ లేదు. నేను 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత మాత్రమే అయోధ్యకు తిరిగి వస్తాను. భరతుడికి గానీ, నాకు గానీ రాజ్యం పట్ల ఆసక్తి లేదు. మేమిద్దరం మా తండ్రి మాటకు కట్టుబడి ఉన్నామని" చెప్పాడు.
3. రాముని పాదుకలు మోసిన భరతుడు
రాముడి మాటలు విని భరతుడు చాలా నిరుత్సాహపడి, “సోదరా, నువ్వు లేకుండా నేను అయోధ్యకు తిరిగి వెళ్లలేను. నేనూ ఇక మీదట మీతో పాటు అడవిలో ఉంటాను. లేకుంటే ఆమరణ నిరాహారదీక్ష చేస్తాను అని" పట్టుబట్టాడు. భరతుడిని అయోధ్యకు వెళ్లేందుకు ఒప్పించమని రాముడు వశిష్ఠుడిని కోరాడు. అప్పుడు వశిష్ఠుడు భరతునితో ఇలా అంటాడు.. “దయచేసి నీ సోదరుడు రాముని మాట విను. అయోధ్యకు తిరిగి వచ్చి అతని ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించు. అలా చేయడం వల్ల నువ్వుగానీ, నీ అన్నగానీ ధర్మం తప్పినట్టు కాదు".
భరతుడు అందుకు అంగీకరించి తిరిగి వచ్చి రాముని సేవకునిగా రాజ్యాన్ని పాలించాలని నిర్ణయించుకున్నాడు. తన సోదరులు రామ, లక్ష్మణుల తరహా లోనే, అతను కూడా నార వస్త్రాలను ధరించాలని నిర్ణయించుకున్నాడు. రాముని పాదుకలను తలపై మోస్తూ అయోధ్యకు తిరిగి వచ్చాడు. రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి దేశాన్ని అత్యంత చిత్తశుద్ధితో పాలించాడు.
Also Read : రామ రావణ యుద్ధం తర్వాత యుద్ధభూమిలో జరిగిన సంఘటన ఇది
రామాయణంలో ఈ ఘట్టాన్ని చూస్తే, భరతుడు లేదా రాముడు రాజ్యంపై, అధికారంపై ఎలాంటి దురాశ కలిగి లేరని స్పష్టమవుతుంది. అంతేకాకుండా రాముని పట్ల భరతుడికి ఉన్న గౌరవం, ప్రేమను తెలుసుకోవచ్చు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.