శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |


సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||


రామ రావణ యుద్ధం ముగిసింది. రావణ సంహారం జరిగింది. భర్త మరణ వార్తను విన్న మండోదరి యుద్ధభూమికి పరుగుతీసింది.రావణుడు చనిపోవడం..మానవుడు అయిన రాముడు గెలవడం ఆమె నమ్మలేని కఠోరనిజం.ఎందుకంటే ముల్లోకాలను గెలిచిన తన భర్తని అల్పుడైన మానవుడు చంపడం ఎలా సంభవం..ఇది నిజం అని తెలిసినా జీర్ణించుకోలేని స్థితిలో ఉంది మండోదరి. విడిన కొప్పుముడితో సరైన వస్త్రధారణ కూడా లేకుండా యుద్ధభూమికి పరుగుతీసింది. మనసులో రాముడిపై కోపం, రాముడిని నిందించాలనే ఆత్రుత ఎందుకంటే ఆమె అంతకుముందెప్పుడూ రాముడిని చూడలేదు, రాముడి గురించి వినలేదు. అందుకే అంత ఆక్రోశం, ఆక్రోశంతో కూడిన ఆవేదన.  


Also Read:  వాస్తు ప్రకారం ఇంట్లో రాగిసూర్యుడిని ఉంచితే ఎన్ని ప్రయోజనాలో!


యుద్ధభూమిలో


రావణ వధ జరిగింది. ఇరువైపులా మిగిలిన సైన్యం యుద్ధం చాలించి ఎక్కడివారక్కడ నిల్చుని ఉండిపోయారు.  రాముడు కూడా ఒక బండ రాయిపై కూర్చున్నాడు. సూర్యకిరణాలు పడడం వల్ల తన నీడ దూరంగా కనిపిస్తోంది. అదే సమయంలో దూరం నుంచి వస్తోన్న మరో నీడ కనిపించింది. ఆహార్యం చూస్తే అది స్త్రీమూర్తి నీడ అని శ్రీరామచంద్రుడికి అర్థమైంది. ఆ నీడ దగ్గరపడుతోందని గమనించి ఠక్కున లేచి పక్కకు తప్పుకున్నాడు రాముడు. అంత బాధలో ఉన్న మండోదరి ఆ సన్నివేశాన్ని చూసి రాముడి వ్యక్తిత్వం ఎంత విలువైనదో అర్థం చేసుకుంది.  తన నీడ కూడా పరాయి స్త్రీ పై పడకూడదని ప్రక్కకు తొలగిన రాముని అంతరంగ సౌందర్యాన్ని అర్థం చేసుకుంది...ఆ ఒక్క ఘటనతో రాముడిపై నిండిన కోపం, క్రోధం ఒక్కసారిగా మాయమైపోయింది. 


అధమాః ధనమిచ్ఛంతి,
ధనం మానంచ మధ్యమాః
ఉత్తామాః మానమిచ్ఛంతి
మానోహి మహాతాం ధనం!


ధనం కోసం ఏమయినా చేసేందుకు వెనుకాడని వారు, ధనం మానం రెంటికై , యత్నించే వారు, మానం కోసమే జీవించే వారు ఈ మూడు రకాలయిన వ్యక్తులు సమాజంలో మనకు కనిపిస్తారు. మొదటి రకం అధములు, రెండవ రకం మధ్యములు మూడవ రకం ఉత్తములు  అని అర్థం.


Also Read: శని ఉందని ఎలా తెలుస్తుంది, చీమలకుఆహారం వేస్తే శని బాధల నుంచి ఎందుకు విముక్తి కలుగుతుంది


జయం అపజయం ఎప్పటికీ ఎవ్వరికీ శాశ్వతం కావు. విజయాన్ని నిర్వచించేందుకు కావలసింది వ్యక్తిత్వ వికాసం మాత్రమే. డబ్బు, హోదా, పలుకుబడి, అధికారం ఇవన్నీ మత్తు నిచ్చేవే. మానవతతో కూడిన అంతరంగ వికాసం మాత్రమే నిజమైన విజయం అంటుంది రామాయణం. అందుకే రాముడు ఎప్పటికీ ఆదర్శనీయుడే. 


శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం


సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం


ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం


రామం నిశాచర వినాశకరం నమామి


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.