Ramayana: రామాయణ కథ మొదలయ్యేదే దశరథుడికి ముగ్గురు భార్యలు కౌశల్య,సుమిత్ర, కైకేయి..వాళ్లకి నలుగురు సంతానం రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని. కానీ ఏ ఆలయంలోనూ రాముడితో పాటూ లక్ష్మణుడు మినహా మిగిలినవారి విగ్రహాలుకనిపించవు. అయితే కేవలం రాముడికి మాత్రమే కాదు నలుగురు అన్నదమ్ములకు విడివిడిగా ఆలయాలున్నాయి.
నలుగురు అన్నదమ్ముల దర్శనం నాలాంబళం
శ్రీరామ నామం దివ్యమైనది. యుగాలు గడుస్తున్నా ఆదర్శనీయుడైన వ్యక్తిగా శ్రీరామచంద్రుడిని కీర్తిస్తున్నాం. ఆదర్శనీయమైన ప్రభువు, ఆదర్శనీయమైన తనయుడు, ఆదర్శవంతమైన భర్త, ఆదర్శవంతమైన సోదరుడు. ఇలా అన్నీ మంచి లక్షణాలే అందుకే శ్రీరాముడిని సకలగుణాభిరాముడు అంటారు. పితృవాక్య పరిపాలకుడిగా రాజ్యాన్ని వదిలి అరణ్యవాసానికి వెళ్లిన రాముడిని.. సీతాదేవి, లక్ష్మణుడు అనుసరించారు. అన్నయ్య అడవులకు వెళ్లిన సంగతి తెలుసుకున్న భరతుడు స్వయంగా వెళ్లి రాజ్యానికి తిరిగి రమ్మని ప్రార్థించినా తండ్రి మాట జవదాటనని చెప్పాడు రాముడు. అందుకు ప్రతిగా ఆ సింహాసనంపై శ్రీరాముడి పాదుకలను ఉంచి మరో సోదరుడు శత్రుఘ్నుడి సహాయంతో పరిపాలించాడు కానీ తాను మహారాజుగా సింహాసనం అధిష్టించలేదు భరతుడు. అయితే ఏ రామాలయంలోనూ భరతుడి, శత్రుఘ్నుడి విగ్రహాలు పెద్దగా కనిపించవు. కానీ కేరళ వెళితే నలుగురి సోదరులను తనివితీరా దర్శించుకోవచ్చు. ఎర్నాకుళం జిల్లాలో ఉన్న ఈ ప్రదేశాలనే నాలాంబళం యాత్రగా పేర్కొంటారు.
Also Read: శ్రీరాముని ఈ 10 పేర్లు, వాటి అర్థాల గురించి మీకు తెలుసా?
జూలై-ఆగష్టులో నాలాంబళం యాత్ర
మళయాళంలో అంబళం అంటే దేవాలయం. నాల్ అంటే నాలుగు. శ్రీరామునితో పాటు లక్ష్మణ,భరత, శత్రఘ్నుడు కొలివైన ఆలయాలను ఒకే రోజులో దర్శించుకోవడాన్ని నాలాంబళ యాత్ర అని అంటారు. మళయాళ క్యాలండర్ ప్రకారం కర్కాటకం నెలలో అంటే తెలుగువారి లెక్క ప్రకారం జూలై - ఆగష్టులో ఈ యాత్ర ఉంటుంది. ఒకే రోజులో యాత్రను పూర్తిచేస్తే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణభగవానుడు ఈ నాలుగు విగ్రహాలను పూజించాడని స్థలపురాణం చెబుతోంది. ద్వాపరయుగం చివర్లో ప్రళయం వచ్చి ద్వారప నీట మునిగి తర్వాత ఈ విగ్రహాలు సముద్రంలో కొట్టుకొచ్చి కేరళ తీరంలోని చీటువ ప్రాంతంలో తేలాయని చెబుతారు. వక్కయిల్ కైమల్ అనే స్థానికమంత్రి కలలో స్వామివారు కనిపించి విగ్రహాలు గురించి చెప్పడంతో ఆ మర్నాటు వాటిని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించారని స్థలపురాణం.
Also Read : శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా!
నాలాంబలం చరిత్ర
పురాణాల ప్రకారం, రాముడు లంకకు వెళ్లే మార్గంలో ఎర్నాకులం జిల్లాలో ఉన్న రామపురం సమీపంలో విశ్రాంతి తీసుకున్నాడు. అందమైన పర్వతాలు, అడవులు, పచ్చదనంతో కూడిన ఈ ప్రదేశానికి రాముడు చేరుకున్నప్పుడు, అది తన ధ్యానానికి అనువైన ప్రదేశంగా భావించాడని పురాణాలు చెబుతున్నాయి. అన్నను వెతుక్కుంటూ అదే మార్గంలో నడిచి వెళ్లారు భరతుడు, శత్రుఘ్నుడు. రాముడిని భరతుడు కలసిన ప్రదేశం కూడా ఇదే అని అందుకే రామాపురం సమీపంలోనే నలుగురి సోదరలకు ఆలయాలు నిర్మించారని కథనం.
నాలాంబళం యాత్ర ఇలా సాగుతుంది
ఈ యాత్రలో మొదటగా త్రిస్సూర్ జిల్లాలోని త్రిప్రయార్ ఆలయంలోని శ్రీరాముని దర్శనంతో ప్రారంభమవుతుంది. తిరుఓనం రోజున ఆలయంలో సేతుబంధన మహోత్సవం నిర్వహిస్తారు. రాముడిని దర్శించుకున్న అనంతరం ఇరింజల్‌కుడలోని కూడల్‌మాణిక్యం ఆలయానికి చేరుకోవాలి. ఇక్కడే భరతుని ఆలయం ఉంది. ఎర్నాకుళం జిల్లాలోని అంగమాలి ప్రాంతంలోని మూళికులంలో లక్ష్మణుడి ఆలయం, ఆ తర్వాత శత్రఘ్నుడి ఆలయం సందర్శనంతో నాలాంబళ యాత్ర ముగుస్తుంది. ఈ నాలుగు ఆలయాలకు సమీపంలోనే హనుమంతుడు కలువయ్యాడు. నలుగురు సోదరులతో పాటూ ఆంజనేయుడిని దర్శించుకోవడంతో యాత్ర పూర్తవుతుంది. ఈ యాత్ర పూర్తిచేస్తే సలక శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.