Chandrababu Tour Plans : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ట్రాక్ మార్చారు. గత మూడు రోజులుగా వరుసగా ప్రభుత్వం సాగునీటి రంగంలో విఫలమైన విధానాన్ని.. రాష్ట్ర ప్రజల రాత మార్చే ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టేసిన వైనాన్ని వివరించారు. ఈ విషయంలో వైఎస్ఆర్‌సీపీ ఎదురుదాడి చేయలేకపోయింది. మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయాలతో.. టీడీపీ కన్నా తక్కువే ఖర్చు పెట్టామని అంగీకరించినట్లయింది. అయితే అంకెల్లో చెప్పడంతో పాటు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రాజెక్టుల పరిస్థితిని చంద్రబాబు ప్రజలకు చూపించాలనుకుంటున్నారు. జరిగిన నష్టాన్ని దాని వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్ని వివరించాలని అనుకుంటున్నరు. అందుకే ఒకటో తేదీ నుంచి ప్రాజెక్టుల టూర్ పెట్టుకున్నారు.
ఆగస్టు ఒకటో తేదీ నుంచి సీమలో చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన
ఆగస్టు 1వ తేదీ నుంచి రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన ఉంటుంది. ఆగస్టు ఒకటిన బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ సందర్శిస్తారు. నందికొట్కూరులో చంద్రబాబు బహిరంగ సభ ఉంటుంది. అనంతరం మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సందర్శిస్తారు. ఆగస్టు 2న మాల్యాల ఎత్తిపోతల పథకం సందర్శన ఉంటుంది. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిశీలిస్తారు. నందికొట్కూరు గోరకల్లు రిజర్వాయర్ సందర్శించిన తర్వాత పాణ్యం, బనగానపల్లి, కోవెలకుంట్లలో పర్యటిస్తారు. జమ్మలమడుగులో చంద్రబాబు రాత్రి బస చేస్తారు. ఆగస్టు 3న గండికోట రిజర్వాయరు సందర్శిస్తారు. పైడిపాలెం రిజర్వాయర్ పరిశీలిస్తారు. ఆగస్టు 4న అమిద్యాలలో నిలిచిపోయిన బిందు సేద్యం ప్రాజెక్టు పరిశీలన చేస్తారు. తర్వాత ఒంటిమెట్ట వద్ద నిలిచిపోయిన జీడిపల్లి-బీటీపీ కాలువ పరిశీలన జరిపి.. ఆత్మకూరు సమీపంలో ఆగిపోయిన జీడిపల్లి-పేరూరు కాలువ పనులు చూస్తారు. ఆగస్టు 4న కళ్యాణదుర్గంలో బైరవానితిప్ప ప్రాజెక్టు, పేరూర్‌లో ఇతర ప్రాజెక్టులు పరిశీలిస్తారు. ఇలా ఇటీవల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వైసీసీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయిన ప్రాజెక్టులన్నింటినీ పరిశీలిస్తారు. చంద్రబాబు ప్రాడెక్టుల పర్యటన తర్వాత కోస్తా ప్రాజెక్టులు.. ఆ తర్వాత పోలవరం వద్దకూ వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల పరిశీలనను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
జరిగిన నష్టాన్ని ప్రజలకు నేరుగా తెలియచెప్పే ప్రయత్నం
మామూలుగా అయితే ఎన్నికలకు సన్నాహకంగా.. చేసే పర్యటనలు.. బహిరంగసభలు లేదా రోడ్ షోలతో పూర్తి చేస్తారు. కానీ చంద్రబాబు స్టైల్ మార్చారు. రోడ్ షోలు, బహిరంగసభల కన్నా అసలు ప్రజలకు వైసీపీ పాలన వల్ల ఎంత నష్టం జరిగిందో వివరించాలనుకుంటున్నారు. టీడీపీ ఉన్నప్పుడు ఆయా ప్రాజెక్టుల్లో పనులు నిరంతరాయంగా జరుగుతూ ఉండేవి. గత నాలుగేళ్లుగా పనులు జరగడం లేదు. ఈ విషయాన్ని ప్రజలకు గుర్తు చేయడం కీలకమని అనుకుంటున్నారు. టీడీపీ ఉన్నట్లయితే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవని ఆ ప్రాంత వాసుల రాత మారిపోయేదని గుర్తు చేయనున్నారు. మళ్లీ టీడీపీ వస్తేనే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని జగన్ వల్ల కాదని ఓటర్ల మనసులోకి బలంగా పంపేందుకు ఈ టూర్లను ఉపయోగించుకుంటున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఒక్క ప్రాజెక్టులే కాదు.. తర్వాత పరిశ్రమలు..ఇతర రంగాలపై ప్రజెంటేషన్లు .. పర్యటనలు కూడా !
చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా వెళ్తున్నారని భావిస్తున్నారు. ఓ వైపు నారా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. మరో వైపు చంద్రబాబునాయుడు వివిద అంశాలు ప్రధానంగా .. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని ప్రత్యక్షంగా వివరించేందుకు రంగంలోకి దిగుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై పర్యటనలు పూర్తయిన తర్వాత ఆయన పారిశ్రామిక రంగంపై ప్రజెంటేషన్లు ఇచ్చి.. పర్యటనలు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు . ఆ తర్వాత రోడ్లు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం వంటివాటిపైనా చంద్రబాబు ప్రజల ముందు వాస్తవాల్ని పెడతారని చెబుతున్నారు.
ఈ వ్యూహం వినూత్నంగా ఉందని.. చంద్రబాబు పాలనకు.. వైసీపీ పాలనకు మధ్య తేడా ప్రజలకు అర్థమవుతుందని.. అప్పుడు ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోగలరని అంటున్నారు.