Telangana Assembly :  తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 3వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు జులై 31న మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్‌ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో వరదలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు సుమారు 50 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.


వరద బాధితులకు సాయాన్ని కేబినెట్‌లో ఖరారు చేసే అవకాశం             


భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనున్నది. రాష్ట్రంలో  వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.  రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినెట్ చర్చించనున్నది. అదే సందర్భంలో..ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. 


అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరి సమావేశాలు కావడంతో  ప్రత్యేక వ్యూహం అమలు చేయనున్న కేసీఆర్          


అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇవే చివరి అసెంబ్లీ సమవేశాలు అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరుగుతాయి. మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో కలిపి నిర్వహించాల్సి రావడంతో  డిసెంబర్ మొదటి వారానికల్లా పూర్తి చేస్తారు. జనవరి వరకూ అసెంబ్లీ గడువు ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని..ప్రజల ముందు ఉంచేందుకు.. కేసీఆర్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ ప్రగతికి..  విపక్షాలు ఎలా అడ్డుపడుతున్నాయో అసెంబ్లీ వేదికగా చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. 


తెలంగాణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ తీరును ఎండగట్టే అవకాశం                     


ముఖ్యంగా ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను.. అసెంబ్లీ వేదికగా ప్రస్తావించి కాంగ్రెస్ తీరును ఎండగట్టనున్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలను చాలా పకడ్బందీ వ్యూహంతో నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు కూడా గట్టి నమ్మకంతో ఉన్నాయి.