Raksha Bandhan 2024 Date Shubh Muhurat : ఆగష్టు 19 సోమవారం సూర్యోదయ సమయానికి పౌర్ణమి తిథి ఉంది..ఆ రోజు రాత్రి  12 గంటల 45 నిముషాల వరకూ ఉంది. అందుకే ఇక   రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలని అనే సందేహమే అవసరం లేదు. ఇక ముహూర్తం విషయానికొస్తే వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం లేని సమయం చూసి రాఖీ కడతారు...


వర్జ్యం: మధ్యాహ్నం 12.53 నుంచి 2.33 వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.29 నుంచి 1.20 వరకు...తిరిగి...మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.51 వరకు


ఈ సమయాలు తప్పించి మిగిలిన ఏ టైమ్ లో అయినా రాఖీ కట్టొచ్చు...


రక్షా బంధన్ వేడుక ఎన్నో పురాణ కథలున్నాయి..


ఇంద్రుడికి రాఖీ కట్టిన భార్య 


దేవతలకు, రాక్షసులకు మధ్య దాదాపు పన్నెండేళ్ల పాటూ యుద్ధం జరుగింది..ఆ యుద్ధంలో ఓడి తన పరివారాన్ని తీసుకుని పారిపోయిన ఇంద్రుడు అమరావతిలో తలదాచుకుంటాడు. నిస్సహాయుడైన తన భర్తను చూసి శచీదేవి తనలో తిరిగి ఉత్సాహాన్ని నింపుతుంది. శివపార్వతులను, లక్ష్మీనారాయణులను పూజించి ఓ రక్షను తీసుకొచ్చి ఇంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలంతా కూడా రక్షలు తీసుకొచ్చి దేవేంద్రుడికి కడతారు. అప్పుడు వెళ్లి యుద్ధంలో విజయం సాధించి తిరిగి త్రిలోకాధిపత్యం పొందుతాడు. అలా శచీదేవి ప్రారంభించిన ఈ వేడుకను ఇప్పటికీ ఆచరిస్తున్నామని చెబుతారు. 
 
సోదరుడికి రక్ష కట్టిన ద్రౌపది


మరో కథనం ప్రకారం...మహాభారతంలో శ్రీకృష్ణుడు, శిశుపాలుడిని వధించే సమయంలో సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు. ఆ క్షణంలో చేతికి గాయం కావడంతో అక్కడే ఉన్న ద్రౌపది తన చీర చెంగు చించి కట్టు కడుతుంది. సంతోషించిన శ్రీ కృష్ణుడు నీకు కష్టకాలంలో అడంగా ఉంటానని హామీ ఇస్తాడు. ఈ సంఘటనే రాఖీ పండుగకు మూలకారణం అంటారు. ఆ తర్వాత కృష్ణుడు ఇచ్చిన హామీ మేరకు...కురుసభలో అవమానపడిన ద్రౌపదికి చీరలిచ్చి సోదరుడిగా అభయం ఇచ్చాడు. 


బలికి రాఖీ కట్టిన శ్రీ మహాలక్ష్మి


రాక్షస రాజు బలిచక్రవర్తి గర్వాన్ని అణిచివేసేందుకు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వామనుడిగా దిగొచ్చాడు. ఎన్నాళ్లైనా శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి రాకపోవడంతో..శ్రీ మహాలక్ష్మి నేరుగా బలిచక్రవర్తి వద్దకు వెళుతుంది. రక్షను కట్టి..తన భర్తను తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. తానెవరో కూడా చెబుతుంది. ఆ తర్వాత బలిని మూడు అడుగుల నేల అడిగి పాతాళానికి తొక్కేసిన వామనుడు..ఆ తర్వాత తన కార్యం పూర్తికావడంతో వైకుంఠానికి చేరుకున్నాడు. 
 
సంతోషి మాత ఆవిర్భావం
 
రాఖీ పౌర్ణమి రోజు వినాయకుడు తన సోదరి నాగదేవతతో 'రక్ష' కట్టించుకోవడం చూసిన ఆయన కుమారులు..తమకి కూడా సోదరి కావాలని కోరారు. అప్పుడు విఘ్నేశ్వరుడు తన కళ్లనుంచి ఓ శక్తిని సృష్టించాడట. ఆమె సంతోషి మాత అని చెబుతారు. పిలల్లు లేని దంపతులు సంతోషిమాతను పూజిస్తే సంతోషానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయంటారు. పైగా శ్రావణపూర్ణిమ రోజు రాఖీ కట్టించుకునేవారిపై సంతోషిమాత ఆశీస్సులు ఉంటాయని విశ్వసిస్తారు. 
 
చరిత్రలోనూ రక్షా బంధన్


పురాణాల్లో మాత్రమే కాదు చరిత్రలోనూ రాఖీ పౌర్ణమి గురించి ఉంది. అలెగ్జాండర్ మన దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు పురుషోత్తముడు అడ్డుకున్నాడు. తన భర్త హతమవుతాడనే భయంతో అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడిని వేడుకుని రాఖీ కట్టిందట. దీంతో ఆ యుద్ధంలో పురుషోత్తముడు గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెట్టాడని చెబుతారు. మొఘల్ పాలనలో చిత్తోడ్ రాజ్యాన్ని ఏలుతున్న కర్నావటి అనే రాణి  అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయున్ కి రాఖీ పంపింది.  


రాఖీ, రక్షా బంధన్, రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అప్పట్లో  ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో ఈ పండుగను బాగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతటా వైభవంగా జరుపుకుంటున్నారు...