Raksha Bandhan 2023 : శ్రావణమాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి రక్షా బంధన్. సోదర, సోదరీ బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను కులాలకు మతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఈ పండుగ హిందువులకు మరింత ప్రత్యేకం. ఎక్కడున్నా ఆ రోజు సోదరుల చేతికి రాఖీ ఉండాల్సిందే అని భావిస్తారు సోదరీ మణులు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కుదిరితే వెళ్లి రక్షాబంధన్ కడతారు లేదంటే పోస్టు ద్వారా పంపిస్తారు. ఘనంగా జరుపుకునే ఈ పండుగను కొన్ని గ్రామాల్లో అస్సలు జరుపుకోరు. మరికొందరేమో సోదరులకు కాకుండా కర్రలకు రాఖీలు కడతారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఒక్కో గ్రామంవారు ఒక్కో కథ చెబుతారు. 


రాఖీ కట్టించుకుంటే బికారులైపోతాం అనే భయం


ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలో బైనిపూర్ చాక్ గ్రామంలో రాఖీ పండుగ అస్సలు జరుపుకోరు. గతంలో ఎప్పుడూ జరుపుకోలేదా అంటే 300 ఏళ్ల క్రితం జరుపుకున్నారట కానీ ఆ తర్వాత రాఖీకి రాం రాం అనేసి వదిలేశారు. దీని వెనుక ఓ కారణం కూడా చెబుతారు. ఆ గ్రామంలో ఓ జమిందార్ ఉండేవాడట. ఆయనకు కొడుకులు తప్ప కుమార్తెలు లేరు. ఓ ఏడాది రాఖీ పండుగ రోజు ఆ గ్రామంలో ఉన్న పేదింటి ఆడపిల్లల్ని తీసుకొచ్చి రాఖీ కట్టించుకుని ఏం కావాలో కోరుకోమన్నారట. ఆ పేద అమ్మాయిలు ఏకంగా జమిందార్ ఆస్తి కావాలని అడిగడంతో ముందుగా మాటిచ్చిన జమిందార్ కుమారులు మాట తప్పకుండా మొత్తం వారిపేరుమీద రాసిచ్చేశారు. ఆ తర్వాత వాళ్లు ఊరు వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ స్థానికులు రాఖీ పండుగ జరుపుకోవడం మానేశారట.


Also Read: రాఖీ కుడిచేతికే ఎందుకు కడతారో తెలుసా!


ప్రాణాలు తీసిన రక్షా బంధన్ పండుగ


ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా గున్నార్ ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో కూడా రాఖీ పండగ జరుపుకోరు. దాదాపు 20 ఏళ్ల క్రితం ఓ యువతి తన సోదరుడికి రాఖీ కట్టింది. రాఖీ కట్టిన కొన్ని గంటలకే ఆమె సోదరుడు చనిపోయాడు. రాఖీ పండుగ వల్లే ఈ ఘోరం జరిగిందని నమ్మి ఈనాటికీ రాఖీ చేసుకోవటం లేదు. ఇదంతా మూఢనమ్మకం అని కొట్టిపడేసి కొంతకాలానికి మళ్లీ రాఖీ జరుపుకున్నారు. అదే రోజు రకరకాల ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి రాఖీ పండుగను శాపంగా భావించిన గ్రామస్తులు జరుపుకోవడం మానేశారు. గోండా జిల్లాలోని బికంపూర్ జగత్ పూర్వా అనే గ్రామంతో పాటు ఉత్తరప్రదేశ్ లోని చాలా గ్రామాల్లో రాఖీ పండుగ జరుపుకోరు.


Also Read: ఆగష్టు 30 or 31 రక్షాబంధన్ ఎప్పుడు, రాఖీ పండుగ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు!


కర్రలకు రాఖీ కట్టే ఆచారం


ఉత్తరప్రదేశ్ లోని హార్పూర్ జిల్లా లో దాదాపు 60 గ్రామాల్లో ప్రజలు రాఖీని సోదరుల చేతికి కాకుండా కర్రలకు కడతారు. వందల ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. దీంతో ఈ 60 గ్రామాల్లో మగవారి చేతులకు రాఖీలు కనిపించవు గానీ ఈ రోజు ఊరంతా కర్రలకు మాత్రం రాఖీలు కనిపిస్తాయి. ఈ 60 గ్రామాల ప్రజలు 17వ తరానికి చెందిన హిందూ రాజపుత్రుల రాజు మహారాణా ప్రతాప్ కాలం నాటి సంప్రదాయాల్ని ఈనాటికి పాటిస్తున్నారు. అప్పట్లో యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లే సైనికులకు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు భార్య, లేదా సోదరి, లేదా తల్లి ఎవరోకరు ‘రక్షా బంధన్’కట్టి వీర తిలకం దిద్ది పంపించటం జరుగుతుంటుంది. కానీ హల్దీఘాటీ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు మహిళలు ఎవరు రక్షా బంధన్ కట్టలేదు. సైనికుల కర్రలకు రక్షా బంధన్ కట్టారు..అప్పటి నుంచీ ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. 


Also Read: రాఖీ పండుగ రోజు మాత్రమే తెరిచి ఉండే ఆలయం ఇది!


ఈ గ్రామస్థులకు రాఖీ పండుగ శాపం


ఉత్తరప్రదేశ్ మీరట్ లో సురానా అనే గ్రామంలో కూడా రక్షా బంధన్ జరుపుకోరు. 12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజున మహ్మద్ ఘోరీ ఆ గ్రామంపై దండెత్తాడు. ఆ గ్రామంలో అందరిని చంపేశాడట. కేవలం ఒకే ఒక్క మహిళ ఆమె ఇద్దరు మగ పిల్లలు బతికి బయటపడ్డారట..వాళ్లు ఆ రోజు గ్రామంలో లేకపోవడం వల్లే బతికారు.  ఆ తర్వాత కొన్నాళ్లకి రాఖీ పండుగ రోజు ఆ ఇద్దరి పిల్లల్లో ఒకరు దివ్యాంగుడిగా మారిపోయాడట. అప్పటి నుంచీ రాఖీ తమకు కలసి రాదనే భయంతో ఆ ఊసెత్తడం మానేశారు. ఆరోజు ఘోరీ దండయాత్ర నుంచి తప్పించుకున్న కుటుంబం వృద్ది చెందింది.


గమనిక:  సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.