కులమతాల పట్టింపు లేదు. బీదాగొప్పా అన్న బేధం లేదు. వయసుతో సంబంధం లేదు... రాఖీ వచ్చిందంటే చాలు, దేశమంతా సోదరమయంగా మారిపోతుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సోదరుడు వర్థిల్లాలని సోదరి రాఖీ కడితే.. ఎల్లవేళలా నీకు అండగా నేనున్నా అని సోదరుడు భరోసా ఇస్తాడు. ఇది కూడా పాశ్చాత్య ప్రభావంతో వచ్చిందనుకుంటే పొరపాటే.... భాగవతం, భవిష్యపురాణం లాంటి గ్రంధాల్లోనూ రాఖీ ప్రస్తావన ఉంటుంది.


రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే:-


పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు  తన పరివారాన్ని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి.... దేవేంద్రుడు యుద్ధంలో పాల్గొనేలా ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొవచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. యద్ధంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం..రాఖీ పండుగగా ఆచరిస్తున్నామని పురణాలు చెబుతున్నాయి.


ద్రౌపది - శ్రీకృష్ణుని బంధం:


భారతంలో శ్రీకృష్ణుడు, శిశుపాలుడని వధించాలని అనుకుంటాడు. అందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా... సుదర్శన చక్రాన్ని వదిలే క్షణంలో చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసినవెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా తన చీరకొంగును చించి శ్రీకృష్ణుని వేలుకి రక్షగా చుట్టింది. అన్నగా భావించి ఆదుకున్నందుకు అండగా ఉంటానని చెప్పిన కృష్ణుడు.. ఎలాంటి ప్రమాదం వచ్చినా తలుచుకో  అని అభయమిచ్చాడు. ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని చెబుతారు. ఇచ్చిన మాట ప్రకారం... కురు సభలో అవమానానికి గురైన ద్రౌపదిని ఆదుకున్నాడు శ్రీకృష్ణుడు.


సంతోషిమాత ఆవిర్భావం: 


శ్రావణ పౌర్ణమి రోజున వినాయకుడు తన సోదరి అయిన నాగదేవతతో 'రక్ష' కట్టించుకోవడం చూసి, తమకి కూడా సోదరి కావలిసినదేనంటూ ఆయన కుమారులు పట్టుబట్టారట.అప్పుడు వినాయకుడి సంకల్పంతో ఆయన  కళ్లనుంచి 'సంతోషిమాత' ఆవిర్భవించినదని చెబుతారు. ఈ రోజున రాఖీ పండుగ జరుపుకునే వారిపై సంతోషిమాత దీవెనలు ఉంటాయంటారు.


శ్రీ మహాలక్ష్మి-బలిచక్రవర్తి:


రాక్షస రాజు బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి, తానెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు




చరిత్రలోనూ రాఖీ పండుగ:


పురాణాలు, ప్రాచీన గ్రంథాల్లోనే కాదు.... రాఖీ సంప్రదాయం మన చరిత్రలోనూ కనిపిస్తుంది. అలగ్జాండర్ మన దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు పురుషోత్తముడనే రాజు నిలువరించాడు. పురుషోత్తముని చేతిలో తన భర్త హతం అవుతాడనే భయంతో, అలగ్జాండర్ భార్య పురుషోత్తముని పతిభిక్ష పెట్టమని వేడుకుంటూ రాఖీని పంపిందట. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెట్టాడని చెబుతారు. మొఘల్ పాలనలో చిత్తోడ్ రాజ్యాన్ని ఏలుతున్న కర్నావటి అనే రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయున్ కి రాఖీ పంపిందని చరిత్ర చెబుతోంది. ఇక రవీంద్రనాథ్ టాగూర్ సైతం స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలందరినీ ఒకటిగా ఉంచేందుకు, రక్షాబంధనాన్ని ప్రోత్సహించారట.


రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా అంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. తన సోదరుడు అన్నింటా విజయం సాధించాలి, ఆరోగ్యంగా ఉండాలని భావించి సోదరి రాఖీ కడితే...ఎల్లవేళగా అండగా ఉంటానని సోదరుడు భరోసా ఇస్తాడు...


Also Raed:రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే


Also Raed:ఒంటరితనం పోగొట్టుకోవాలంటే ఒంటరిగానే ఉండాలి: గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్


Also Raed: ఈ చోటి కర్మ ఈ చోటే...ఈనాటి కర్మ మరునాడే అంటాం....మరి కర్మల నుంచి తప్పించుకోవాలంటే గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు


Also Raed:కామవాంఛతో పురుషులు…ధర్మం విడిచిన స్త్రీలు… కలియుగంలో మనుషుల ప్రవర్తనపై శివపురాణం ఏం చెప్పిందంటే…


Also Raed: ఈ ఏడుగురికి మరణం లేదు....ఎవరు-ఎందుకు?