సత్కర్మభిశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అచ్యుత్కట పుణ్య పాపానం
సత్యం పరాణి భవమిహం


ఈ చోటి కర్మ ఈ చోటే...ఈ నాటి కర్మ మరునాడే.....అనుభవించి తీరాలంతే... ఇవి ఓ పాటలోని లిరిక్స్. కానీ జీవితం మొత్తాన్ని కాచి వడపోసినట్టుంటాయి. హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ....భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ప్రతి మనిషి  పుట్టిన దగ్గర నుంచి చనిపోయేవరకు కర్మలు చేస్తూనే ఉంటాం! చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మఫలం అంటారు.




ఈ కర్మలు 3 రకాలు....


1.ఆగామి కర్మలు
2.సంచిత కర్మలు
3.ప్రారబ్ద కర్మలు


ఆగామి కర్మలు:  
ప్రస్తుతం మనం చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి. వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి. మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరు జన్మల్లో ఫలితాన్నిస్తాయి. అసలు కొన్ని ఏ ఫలితాలను కూడా ఇవ్వకపోవచ్చు.  కొన్ని మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటం కోసం కూడబెట్టుకుని ఉంటాయి. ఉదాహరణకు మనం భోజనం చేస్తాం.......ఆ కర్మ ద్వారా వెంటనే ఆకలి తీరుతుంది. దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం..వాటి ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితన్నివ్వలేక, తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటానికి కూడబెట్టి ఉంటాయి. ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ‘అగామికర్మలే’. 


సంచిత కర్మలు: 
సంచిత కర్మలంటే  పితృదేవతల ద్వారా ప్రాప్తించిన కర్మలు. తల్లి దండ్రులు చేసిన అప్పులు కొడుకు తీర్చడం లాంటిది. పూర్వ జన్మల్లో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించలేకపోతే అవి సంచితమవుతాయి. అంటే వాటిని ఒక జన్మ నుంచి మరొక జన్మకి, అక్కడి నుంచి వేరొక జన్మకు మనము తీసుకుని వెళ్తాము. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి వదలి పెట్టకుండా అతడితో వస్తుంటాయి. జీవుడు ఈ శరీరాన్ని వదలి వెళ్ళేటప్పుడు, ఆ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మఫలాలను మూటగట్టుకొని తగిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళతాడు. దీనికి కారణం ‘సంచిత కర్మలు’.


ప్రారబ్ధ కర్మలు:
ప్రారబ్ద కర్మలు అంటే పూర్వ జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాల వల్ల కలిగే కర్మలు. సంచితంలో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి. ఇలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు. మనం చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. ప్రారబ్ద కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్లి, ఆ శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు. అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ద కర్మఫలాలన్ని అనుభవించటం పూర్తయ్యేవరకు ఆ శరీరం ఉంటుంది. ఆ కర్మలను అలా వదిలించుకోవడానికి వచ్చి, చేసే, చేసిన కర్మలను వదిలించుకోకుండా మరల మరల అజ్ఞానముతో వాటికి మరికొన్ని కూడగట్టుకుంటున్నాం. ఇలా పోగు చేసుకోవడం వలనే మళ్లీ మళ్లీ ఈ జన్మలు, శరీరాలు వస్తున్నాయి. కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణులమైతే మరో జన్మే లేదు. 


ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే...ఎవరెవరు ఏ ఏ కర్మలు అనుభవించాలో, అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారు. అంతకు మించి , నిజానికి కూతురు, కొడుకు అనే బంధాలు లేవు. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన ,జన్యుపర సంబంధం లేని భార్యాభర్తలకు జన్మించటాన్ని మనం చూసాం!అలా వారు పుట్టటాన్ని వారి ప్రారబ్ధ కర్మ అని అంటారు. భార్యాభర్తలు కూడా అటువంటి ప్రారబ్ధ కర్మాన్నే ఆ శిశువు ద్వారా అనుభవించి తీరాల్సిందే. 




అసలు ఈ జన్మల పరంపరలు కొనసాగటానికి కారణాలు–అహంకారం వలన అజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం వలన అభిమానం కలుగుతుంది. అభిమానం వలన కామ,క్రోధ ,మోహాలు ఏర్పడతాయి. కామ, క్రోధ, మోహాలు ఏర్పడటం వలన కర్మలు చేయవలసి వస్తుంది. కర్మలు చేయటం వలన పునర్జన్మలు వస్తాయి. ప్రారబ్ధకర్మలను ఆనందంగా అనుభవిస్తూ, మరేయితర దుష్కర్మల జోలికి పోకుండా , కర్మ ఫలాలను ఆశించకుండా జీవిస్తే మోక్షం పొందటం సులభం అవుతుందేమో. 


కర్మల నుంచి విమోచనం ఎలా?
పూజలు, యజ్ఞ యాగాదులు, దైవ దర్శనం, మహాత్ముల సందర్శనం ఇత్యాదులతో ఆగామి కర్మల నుంచి విమోచనం పొందవచ్చు. పుష్కర స్నానాలు కూడా అందుకే. మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం. వెళ్ళే దారిలో చీమలు వంటి సూక్ష్మ జీవులను చంపడం లాంటివి. ఇలా తెలియకుండా చేసిన పాపాల నుండి విమోచన కోసమే, ఈ పూజలు, వ్రతాలు, పుష్కర స్నానాలు వగైరా...
పితృదేవతలకు తర్పణం ఆరాధన, యజ్ఞం, హోమంతో కొంతవరకు సంచిత కర్మల నుండి విమోచనం పొందవచ్చు .
ప్రారబ్ద కర్మలను మాత్రం అనుభవించాల్సిందే.


ఆగామి కర్మఫలం అంటకుండా ఉండాలంటే...
మనం ఇప్పుడు చేసేవన్నీ ఆగామి కర్మలే.  ఎలాంటి కర్మ చేసిన ఆ కర్మఫలం అనుభవించక తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం . అందువల్ల కర్మలు చేస్తూ కూడా ఆ కర్మఫలం మనకు అంటకుండా, బంధం కాకుండా తప్పించుకునే ఉపాయాలను భగవానుడు మనకు భగవద్గీతలో తెలియచేసాడు.


కర్మణ్యేవాధి కరస్తే మాఫలేషు కదాచన |
మకర్మఫలహేతుర్భు, మాతే సంగోస్త్వకర్మణి ||    (భగవద్గీత 2:47)


కర్మలను ఆచరించుట యందె నీకు అధికారము కలదు కానీ, వాటి ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణమూ కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదని అర్థం.


లోక కళ్యాణం కోసం కర్మలు చేయటం
ఈశ్వరార్పితంగా కర్మలు చేయుటం
ఈ విషయన్నే రమణ మహర్షి “ఉపదేశసారం” లో ఇలా తెలియచేసారు.


“ఈస్వరార్పితం నేచ్ఛయాకృతం | చిట్టా శోధకం, ముక్తి సాధకం |”


అంటే కర్త్రుత్వాభిమానం లేకుండా కర్తవ్యతాభావంతో, నిష్కామంగాను, ఫలాశాక్తి లేకుండా, లోకహితార్థంగాను, ఈశ్వరార్పితంగాను కర్మలు చేసే విధానమే కర్మయోగం అంటారు.


అంటే కర్మను కర్మగా గాక, కర్మయోగంగా చేయుట ద్వార మనం చేసే కర్మలు సంకుచితం కాకుండా, మనకు బంధాలు కాకుండా చేసుకోవాలి. కనుక మనంచేసే కర్మలను ఒకటికి రెండుసార్లు బుద్దితో యోచించి, శాస్త్రం ఎలా చెబుతుందో తెలుసుకుని, మన మనోబుద్దులు అందుకనుగుణంగా సవరించుకుని కర్మలు చేయాలి. ఎక్కుపెట్టిన బాణం వంటిది ఆగామి కర్మ. ఇది చేయటం మన చేతుల్లో వున్నది గనుక జాగ్రత్త పడాలి. బంధాల నుంచి తప్పించుకోవాలి. కనుక ఆగామి కర్మలను కర్మయోగం ద్వార చేసి బంధాలు కాకుండా చూసుకోవాలి.




ప్రారబ్ధ కర్మలకు బంధం కాకుండా ఉండాలంటే..
జీవుడు శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో అప్పటికి ఉన్న సంచిత కర్మలలోనుండి ఏవి పక్వానికి వస్తాయో ఆ కర్మలను ప్రారబ్ధ కర్మలు అంటారు.ఆ ప్రారబ్ధ కర్మలను అనుభవించటానికి తగిన శరీరాన్ని ధరించి జీవుడు ఈ లోకంలోనికి వచ్చిపడతాడు. ఆ ప్రారబ్ధ కర్మలన్నిటిని తప్పక అనుభవించాల్సిందే. అలా అనుభవిస్తేనే ఆ కర్మలు ఖర్చు అయ్యేది. అనుభవిస్తేనే ప్రారబ్ధ కర్మల నుండి విముక్తి. ప్రారబ్ధ కర్మలు అంటే ధనస్సు నుండి విడిచిన బాణం వంటివి. కనుక ప్రారబ్ధ కర్మ ఫలాలను భగవత్ స్మరణతో భక్తి యోగం ద్వార అనుభవించి ఖర్చుచేసుకోవాలి.


సంచిత కర్మలు బంధం కాకుండా ఉండాలంటే...
ఆగామి కర్మలు చేయటంలో మనకు స్వతంత్రం వుంది. కనుక కర్మయోగం అనే ఉపాయంతో ఈశ్వరార్పణంతో చేస్తాము. ప్రారబ్ద కర్మలను భగవత్ స్మరణతో భక్తి యోగం అనే ఉపాయంతో అనుభవిస్తాము. కానీ ఇవి ఎప్పుడో ఇంతకూ ముందు జన్మలవి , ఇప్పుడు ఖర్చు చేద్దాం అంటే పక్వానికి రాలేదు. కనుక వీటిని అన్నిటి నుంచి సంపూర్ణంగా తప్పించుకొని కర్మబంధనం లేకుండా వుండాలంటే , మళ్ళీ జన్మంటూ లేకుండా ముక్తి పొందాలంటే, మోక్షం పొందాలంటే, శాస్వతనందాన్ని పొందాలంటే , ఆ పరమాత్మునిలో ఐక్యం కావాలంటే ఈ సంచిత కర్మలన్నిటిని ఒక్కసారిగా దగ్దం చేయాలి ? ఎక్కడంటే.... జ్ఞానాగ్నిలో, “జ్ఞానాగ్ని దగ్ద కర్మాణాం” అని గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు. కనుక జ్ఞానమనే అగ్నిలో సర్వకర్మలు దగ్దం చేయుట ఒక్కటే మార్గం.