నాలుగు యుగాల్లో కలియుగం చివరిది. ఈ యుగంలో కలిపురుషుడి పుట్టుకే ఆశ్చర్యంగా ఉంటుంది.
క్రుద్దుడు అనే యువకుడు హింస అనే తోడబుట్టిన చెల్లెల్నే పెళ్లిచేసుకుంటాడు. వారికి కలిగిన కుమారుడే "కలిపురుషుడు". అంటే ఎంత వేద విరుద్దంగా అతడు జన్మించాడో అర్ధమవుతుంది.
"ధర్మమా"! అంటే ఏమిటి? అనేవాడే కలిపురుషుడు. అలాంటి వాడు పాలకుడైతే ఎంత అధర్మంగా బతుకుతామో చెప్పేదేముంది. అందుకే కలిపురుశుడిది పాపభూష్టమయిన జీవన విదానం. వేద విరుద్దమైన జీవితం.
అసలు ఏది ఈశ్వరుడు నిషిద్ద కర్మగా చెప్పాడో.. దానియందు అనురక్తి పొంది, మనుషుల బుద్ధిని మార్చడం కలిపురుషుడి పని. జీవితాలను ఎంత పతనస్థితికైనా తీసుకుపోగలడు.
కలియుగం లక్షణాలు
కలియుగం ఆరంభమైన వెంటనే మనుషుల్లో పవిత్రత నశిస్తుంది. నిజం మాట్లాడటమే మహాపాపం అన్నట్టు భావిస్తారు. సత్యం అంటే జరిగినది జరిగినట్లు చెప్పడమే కాదు త్రికాలాల్లోనూ నిలిచి ఉండే శాస్త్రవిషయం అని అర్థం. కలియుగంలో శాస్త్ర విషయాలపై ఆసక్తి చూపరు కాబట్టి.. వారి కాలక్షేపాలు ఎలా ఉంటాయంటే…
పరాపవాద నిరాః పరద్రవ్యాభిలాషిణః |
పరస్త్రీసక్త మనసః పరహింసా పరాయణాః ||
ఇక్కడ మొత్తం నాలుగు ’పర’లు ఉన్నాయి. పరులపై నిందలు చేస్తూ, ఆ నిందలే కాలక్షేపాలుగా వెళ్తూ ఉంటారు. పరద్రవ్యములమీద, పరస్త్రీలమీద అభిలాష కలిగి ఉంటారు. పరహింసా పరాయణులై ఉంటారు.
దేహాత్మ దృష్టయా మూఢా నాస్తికాః పశుబుద్ధయః !
మాతృపితృ కృత ద్వేషాః స్త్రీ దేవాః కామకింకరాః ||
సర్వపాపాలకూ మూలం దేహాత్మ దృష్టి. అంటే దేహమే నేను అనే ఆలోచన. దానిని తృప్తిపరచడానికి సర్వపాపాలూ చేస్తారు. దేహానికి అతీతమైనది ఒకటి ఉంది అని చెప్పినా చెవికి ఎక్కించుకోరు. దానితో మూఢత్వం ఏర్పడి నాస్తికులుగా మారతారు.
“నాస్తికో వేదనిందకః” అన్నట్టు…వేదనిందకులై శాస్త్రాలపై విశ్వాసం లేనివారై పశుబుద్ధులతో తల్లిదండ్రులపై ద్వేషబుద్ధి కలిగి ఉంటారు. కలియుగంలో స్త్రీలే దేవతలు. కామానికి తలొంచని పురుషుడు ఉండడు. ధనార్జనే ప్రధాన ధ్యేయంగా బతుకుతారు. వేదవిద్యలను, జ్ఞానాన్ని అమ్మకుంటారు. విద్యల ప్రయోజనం ధనమే అన్నట్టు ప్రవర్తిస్తారు. జీవిత పరమార్థాన్ని తెలియజెప్పే విద్యలనూ ధనార్జన దృష్టితోనే నేర్చుకుంటారు.
త్యక్త స్వజాతి కర్మాణః ప్రాయశః పరవంచకాః |
త్రికాల సంధ్యయా హీనా బ్రహ్మబోధ వివర్జితాః ||
బ్రాహ్మణులు తాము చేయవలసిన కర్మలు విడిచిపెట్టి పరులను వంచిస్తూ తిరుగుతూంటారు. త్రికాలసంధ్యావందనాలు విడిచిపెట్టి బ్రహ్మజ్ఞానము లేకుండా ఉంటారు.
అదయాః పండితం మన్యాస్స్వాచార వ్రతలోపకాః |
కృష్యుద్యమరతాః క్రూర స్వభావా మలినాశయాః ||
దయలేనివారే పండితుల్లా చలామణి అవుతూ.. నిజమైన పండితులకి, వారి ఆచారాలకీ, వ్రతాలకీ లోపం కలిగిస్తూ ఉంటారు.
క్షత్రియాశ్చ తథా సర్వే స్వధర్మ త్యాగశీలినః |
అసత్సంగాః పాపరతా వ్యభిచార పరాయణాః ||
అశూరా అరణ ప్రీతాః పలాయన పరాయణాః |
కుచౌర వృత్తయశ్శూద్రాః కామకింకరచేత సః ||
క్షత్రియులు స్వధర్మాన్ని విడిచిపెట్టి చెడ్డవారితో స్నేహం చేస్తారు. వారిలో శూరత్వం ఉండదు. వారిలో శూరత్వం ఉండదు. యుద్ధం అనగానే వెనకడుగు వేస్తారు. ఇక్కత క్షత్రియులు అంటే పాలకులు అని భావించవచ్చు. దొంగలే పాలకులవుతారు….పాలకులు దొంగల్లా ప్రవర్తిస్తారు.
ఇంకా చెప్పాలంటే …..
గోవులను హింసిస్తారు. బ్రాహ్మణుల సంపదలపై ఆశపడతారు
దేవుడికి సంబంధించిన ఆస్తులు కాజేస్తారు, హింసాపరులవుతారు
ఎవరి వృత్తి ధర్మాన్ని వారు విడిచిపెట్టి ప్రవర్తిస్తారు
చెడు మార్గాల్లో ధనాన్ని సంపాదించేందుకే వ్యాపారాలు చేస్తారు
గురువుల పట్ల భక్తిలేనివారై ఉంటారు… బ్రాహ్మణులను దూషిస్తూ తిరుగుతారు
ధనవంతులు కుకర్మలు చేస్తారు. విద్యావంతులు వితండవాదం చేస్తారు
కలియుగంలో స్త్రీల లక్షణాలు
“స్త్రియశ్చ ప్రాయశో భ్రష్టా భర్త్రవజ్ఞాన కారికాః!”
స్త్రీలు ఎక్కువమంది చెడిపోవడమే కాదు…. భర్తను అవమానించడంలోనే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.
“శ్వశురద్రోహ కారిణ్యః”
అత్తింటికి ఎసరు పెట్టే లక్షణాలు కలిగి ఉంటారు
“నిర్భయా మలినాశనాః”
అధర్మానికి పాల్పడడంలో కలియుగంలో స్త్రీలకు తెగింపు ఎక్కువ. ఒకప్పుడు శుద్ధమైన అన్నం పుట్టింది అంటే స్త్రీవల్లనే. ఆ స్త్రీయే ధర్మాన్ని విడిచిపెట్టడం వల్ల మలినాన్ని తింటారు. అంటే ఇళ్లలో ఆచార రహితంగా వండిన అన్నం తింటారు.
“కు హావ భావ నిరతాః కుశీలాః స్వరవిహ్వలాః":
ఎక్కువ మంది స్త్రీలు చెడ్డ హావభావాలతో, శీలం లేనివారుగా ఉంటారు.