దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ (Joint Entrance Examination) అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను  అక్టోబర్‌ 3వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పూర్తి స్థాయిలో పాటిస్తూ.. పరీక్ష నిర్వహిస్తామని ఆయన ట్వీట్ చేశారు. గతంలో నిర్ణయించిన తేదీ ప్రకారం ఈ పరీక్ష జూలై 3వ తేదీన జరగాల్సి ఉంది.






అయితే కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పరీక్షను వాయిదా వేశారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిర్వహించనుంది. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా రెండున్నర లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తుంది. జేఈఈ పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం  www.nta.ac.in, jeemain.nta.nic.in వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు.
మారిన జేఈఈ మెయిన్‌ చివరి విడత తేదీలు..  
జేఈఈ మెయిన్‌ పరీక్ష చివరి విడత తేదీలు ఇటీవల మారాయి. మూడో విడత పరీక్షలను జూలై 20 నుంచి 25 వరకు, చివరి విడత పరీక్షలను జూలై 27 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు నిర్వహిస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే మూడో విడత పూర్తయిన వెంటనే ఒక రోజు గ్యాప్‌తో చివరి విడత పరీక్షలు నిర్వహించడంపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత వచ్చింది. పరీక్షల మధ్య కొంత వ్యవధి ఇవ్వాలని విద్యార్థులు కోరడంతో చివరి విడత పరీక్ష తేదీలను మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. చివరి విడత పరీక్షలను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్‌ 1,2 తేదీల్లో నిర్వహిస్తామని ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవల వెల్లడించారు. 
జేఈఈ మెయిన్స్ లో మహారాష్ట్ర అభ్యర్థులకు ఊరట.. 
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షలు రాయనున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జేఈఈ మెయిన్ మూడో విడత పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని కొల్హాపూర్, పాల్ఘర్, రత్నగిరి, రాయ్‌గఢ్, సింధుదుర్గ్, సంగ్లి & సతారా ప్రాంతాల్లోని అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. 






ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలని ధర్మేంద్ర ప్రధాన్‌ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కు సూచించారు. దీనికి సంబంధించిన తేదీలను ఎన్‌టీఏ త్వరలోనే ప్రకటిస్తుందని తెలుపుతూ.. మంత్రి ట్వీట్ చేశారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన మరింత సమాచారం కోసం 011-40759000 నంబరు లేదా jeemain@nta.ac.in ఈమెయిల్‌ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించారు.