Interesting Facts about Puri Jagannath Rath Yatra 2024 : ఈ ఏడాది తెలంగాణలో బోనాలు..ఒడిశాలో రథయాత్ర ఒకేరోజు ప్రారంభమవుతోంది. ఏటా ఆషాడంలో వచ్చే విదియ రోజు రథయాత్ర జరుగుతుంది. ఈ ఏడాది ఆషాడం జూలై 6 శనివారం ప్రారంభమవుతోంది..జూలై 7 విదియ రోజు రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్రకి సంబంధించి తెలుసుకోవాల్సిన చాలా విషయాలున్నాయి...
వేల ఏళ్ల క్రితం మొదలైన రథయాత్ర
ప్రపంచంలో అత్యంత పురాతమైన వేడుక ఈ రథయాత్ర. ఎన్ని వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైందో కూడా ఇప్పటికీ ఎక్కడా స్పష్టంగా లేదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కాందపురాణంలో కూడా జగన్నాథుడి రథయాత్రకు సంబంధించిన ప్రస్తావన ఉంటుంది
Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!
ఊరేగింపులో గర్భగుడి విగ్రహాలే
ఏ ఆలయంలో అయినా గర్భగుడిలో ప్రతిష్టించిన విగ్రహాన్ని మళ్లీ కదపరు. వేడుకలు, రథయాత్రల సమయంలో ఉత్సవ విగ్రహాలను మాత్రమే బయటకు తీసుకొస్తారు.. భక్తజనం మధ్య ఊరేగింపు అయిపోయిన తర్వాత తీసుకెళ్లి లోపల పెట్టేస్తారు. గర్భగుడిలో విగ్రహాన్ని అస్సలు కదపరు. కానీ పూరీ జగన్నాథుడి రథయాత్ర ప్రత్యేకత ఏంటంటే...ఏకంగా గర్భగుడిలో కొలువైన దేవుళ్లనే తీసుకొచ్చి రథయాత్ర నిర్వహిస్తారు.
ఏటా కొత్త రథాలు
ఆలయాల్లో సాధారణంగా రథాలు తయారుచేస్తే వాటినే ఏళ్లతరబడి వినియోగించడం చూస్తుంటాం. కానీ పూరీ జగన్నాథుడు మాత్రం ఏటా కొత్త రథాన్ని అధిరోహిస్తాడు. అక్షయ తృతీయ రోజు మొదలయ్యే ఈ రథాల తయారీకి నెలల సమయం పడుతుంది. జగన్నాథుడి రథాన్ని గరుడధ్వజం అని, బలరాముడి రథాన్ని తాళధ్వజం అని, సుభద్ర రథాన్ని దేవదాలన అని అంటారు.
Also Read: ఆషాఢ అమావాస్య రోజు ఈ ఒక్కటీ చేస్తే మీ కుటుంబానికి ఉన్న పితృదోషం తొలగిపోతుంది!
రథాల తయారీకి లెక్కలుంటాయ్
ఏదో అలా చెక్కేయడం కాదు..ప్రతి రథ తయారీకి కొన్ని లెక్కలు ఉంటాయి. ఎన్ని అడుగులు ఉండాలి, ఎంత ఎత్తుండాలి అనే విషయాలను పరిగణలోకి తీసుకుని తయారు చేస్తుంటారు. ఆయా రథాల తయారీకీ ఈ నియమాలు పాటించాల్సిందే. పైగా రథ తయారీకి ఎంత చెక్క వినియోగించాలో కూడా లెక్కే
పూరీకి రాజు జగన్నాథుడే
రాజుల జాబితా చెప్పుకుంటే పెద్ద చేంతాడంత లిస్ట్ వస్తుంది..కానీ పూరికి నాయకుజు మాత్రం జగన్నాథుడే. అందుకే పూరీ రాజు కూడా జగన్నాథుడి రథం ప్రారంభమయ్యే ముందు చీపురుతో ఊడ్చిన తర్వాతే రథం కదులుతుంది
Also Read: జూలై 7న పూరీ జగన్నాథుడి రథయాత్ర..ఐదు దశాబ్దాల తర్వాత ఒకేరోజు మూడు వేడుకలు!
మళ్లీ 9 రోజుల తర్వాత తిరుగు ప్రయాణం
సాధారణంగా ఏ రథయాత్ర అయినా తిరిగి చివరకు ఆలయానికి చేరుకుంటుంది..కానీ గర్భగుడిలోంచి బయటకు వచ్చిన జగన్నాథుడు మాత్రం తొమ్మిదిరోజుల తర్వాత మళ్లీ తిరిగి గర్భాలయానికి చేరుకుంటాడు. ఈ తొమ్మిది రోజుల పాటూ పూరీ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే గుండిచా అనే తన పిన్నిగారింట ఉంటాడట. తిరిగి ఆషాడంలో పదో రోజు ఆలయానికి చేరుకుంటాడు.
రథం కదలడం చాలా కష్టం
గర్భగుడి నుంచి బయటకు అడుగుపెట్టిన జగన్నాథుడికి అంత త్వరగా ఆలయం నుంచి కదలాలి అనిపించదేమో..అందుకే ఎంతో మంది గంటల పాటు కష్టపడితే కానీ అస్సలు రథం కదలదు. 9 రోజుల తర్వాత తిరిగి వచ్చే యాత్రని బహుదాయాత్ర అని పిలుస్తారు..ఈ మార్గంలో మౌసీ మా అనే ఆలయం దగ్గర ఆగి ప్రసాదాన్ని తీసుకుని బయలుదేరుతారు. జగన్నాథుడు ఆలయానికి చేరుకున్న తర్వాత జరిగే ఉత్సవాన్ని సునా బేషా అని పిలుస్తారు. అంటే విగ్రహాలను బంగారంతో ముంచెత్తుతారు. ఇందుకోసం దాదాపు 208 కిలోల బరువున్న నగలు ఉపయోగిస్తారు.
చిరుజల్లులు తప్పనిసరి
దైవ కార్యాలు జరిగినప్పుడు వరుణుడు హర్షించి వాన కురిపిస్తాడంటారు పండితులు. అందుకే సీతారాముల కళ్యాణ వేడుక రోజు తప్పనిసరిగా నాలుగు చినుకులు నేలరాలుతాయి..ప్రకృతి పులకరిస్తుంది. అలాగే పూరీ జగన్నాథుడి రథయాత్ర రోజు కూడా తప్పనిసరిగా చినుకులు పడతాయి.
Also Read: భాగ్యనగరంలో ఆషాఢ మాసం బోనాల జాతర సందడి..జగదాంబికకు జూలై 7న తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభం!