Pitru Paksha 2022: అన్నం వల్ల ప్రాణికోణి జన్మిస్తుంది.  వర్షం వలన అన్నం లభిస్తుంది. యఙ్ఞం వల్ల వర్షం కురుస్తుంది. ఆ యఙ్ఞం కర్మ వలనే సాధ్యమవుతుంది. అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యఙ్ఞాల ద్వారా వారి వారి హవిస్సు(అన్నం) అందించాలి.

  


అన్నాద్భవంతి భూతాని  -  పర్జన్యాదన్న సంభవః
యఙ్ఞాద్భవతి పర్జన్యో  -  యఙ్ఞః కర్మ సముద్భవః
మరణించిన ప్రాణి ‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి భూమ్మీద జీవాత్మగా వస్తుంది. అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి...శుక్ల కణంగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది. మరణించిన పితృదేవతలకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకం లోకి రావాలి. అలా రావాలంటే వారికి  అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి  పితృఋణం తీరుతుంది. పుత్రులు రుణం తీర్చుకుంటేనే పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. ఈ రుణం తీర్చుకునేందుకు ఈ 15 రోజులు చాలా ప్రత్యేకమైనవి.


Also Read: బ్రహ్మాస్త్రం అంటే ఏంటి, ఇదెంత పవర్ ఫుల్, ఎవరెవరి దగ్గర ఉండేది
 
మాహలయ పక్షాలు



  • భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో , బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది.  పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని అంటారు.

  • ఈ పక్షం( 15 రోజులు) ముగిసే వరకు రోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలి

  • నిత్యం కుదరని వాళ్లు..తమ పితృదేవతలు ఏ తిథి రోజు మృతిచెందారో ఈ 15 రోజుల్లో ఆ తిథిరోజు శ్రాద్ధం నిర్వహించాలి

  • తండ్రి ఉండి తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమిరోజు తర్పణాలు విడవాలి

  • తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ 15 రోజులు తర్పణాలు విడవడం మంచిది

  • ఈ 15 రోజులూ చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య (సెప్టెంబరు 25 ఆదివారం) రోజైనా తర్పణాలు ఇస్తే మంచిదంటారు పెద్దలు.


కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన  పక్షం రోజులివే
దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి , దప్పిక కలిగాయి. ఇంతలో ఒక పండ్ల చెట్టు కనిపించింది. కోసుకుని తిందామనుకుంటే..అదేమో బంగారం ముద్దలా మారిపోయింది. నీళ్లు తాగుతాగమని దోసిట్లోకి నీళ్లు తీసుకుంటే ఆ నీరు బంగారపు ముద్దలా మారిపోయింది. స్వర్గానికి వెళ్లాక కూడా అదే పరిస్థితి అర్థమైంది. తాను చేసిన తప్పేంటి ఇలా ఎందుకు జరుగుతోందని కర్ణుడు వాపోతాడు. అప్పుడు స్పందించిన అశరీరవాణి... ‘‘కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం , వెండి , డబ్బు రూపేణా చేశావు గానీ , కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’ అంది


తండ్రి సూర్యుడి దగ్గరకు వెళ్లి ప్రాధేయపడతాడు కర్ణుడు. అప్పుడు ఓ అపురూపమైన అవకాశం ఇచ్చాడు సూర్యుడు. నువ్వు వెంటే భూలోకానికి వెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి , మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి రోజు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. తిరిగి అమావాస్య రోజు స్వర్గానికెళ్లాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది , ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి , తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.


Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?


ఏడాదికోసారి తద్దినాలు పెడుతున్నం కదా..మహాలయ పక్షాలు పెట్టాలా
మరణించిన తండ్రి, తల్లి తిథి రోజు తద్దినం పెట్టడం హిందూ సంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. మరి  పుత్రులు లేనివారి సంగతేంటి అనే సందేహం వచ్చిందా.. కేవలం తల్లిదండ్రులకు పిల్లలు మాత్రమే కాదు... కుటుంబాల్లో  ఏదో కారణంతో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. పెళ్లైనా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు, యుద్ధాల్లో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అలాంటి వారందరకీ కూడా  తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ చేస్తారు.