Onam Festival:  తెల్లని వస్త్రాలు,వాటికి బంగారు రంగు అంచులు, పూల మాలలు, సాంప్రదాయ వంటకాలు..ఆహా...పది రోజుల పాటూ ఓనం వైభవం చూడడానికి రెండు కళ్లు సరిపోవు. మొదటి రోజును అతమ్‌గా, చివరి రోజైన పదోరోజును తిరు ఓనమ్ అని అంటారు. పది రోజుల పండుగలో ఈ రెండు రోజులూ చాలా ముఖ్యమని భావిస్తారు కేరళ ప్రజలు. కేరళ సంస్కృతి,సంప్రదాయాలు ప్రతిబింబించే ఓనంకు 1961 లో  జాతీయ పండగగా గుర్తింపు లభించింది. ఈ ఏడాది ఆగస్టు 30  అతమ్  సెప్టెంబరు 8 న తిరు ఓనమ్..అంటే ఆఖరి రోజన్నమాట.


ఎందుకు జరుపుకుంటారు
మహా బలిని ఆహ్వానిస్తూ పది రోజుల పాటూ జరుపుకునే పండుగ ఇది. చరిత్ర ప్రకారం మహాబలి పాలించిన సమయం మళయాలీలకు స్వర్ణ యుగంతో సమానం.  బలిచక్రవర్తి పాలనలో రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్థిల్లారని చెబుతారు. అందుకే రాక్షస రాజు అయినప్పటికీ బలిచక్రవర్తిని గౌరవించేవారు. బలిచక్రవర్తితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పదిరోజుల పాటూ మహాబలిని పాతళలోకం నుంచి భూమ్మీదకు అహ్వానిస్తూ జరుపుకునే పండుగే ఓనం. ఇదే వేడుగను కొన్ని రాష్ట్రాల్లో వామన జయంతిగా జరుపుకుంటారు. 


Also Read: అక్టోబరు, నవంబరులో ఈ రోజుల్లో తిరుమల శ్రీవారి దర్శనం రద్దు


ఎవరీ 'మహాబలి'
ఇంతకీ మహాబలి అంటే ఎవరోకాదు మీకు తెలిసిన బలిచక్రవర్తి. శ్రీ మహావిష్ణువు మహా భక్తుడైన ప్రహ్లాదుడి మనవడే బలిచక్రవర్తి. ప్రహ్లాదుడి0 ఒడిలో విద్యాబుద్ధులు నేర్చుకున్న మహాబలి కూడా గొప్ప విష్ణుభక్తుడిగా పెరిగాడు. బలిచక్రవర్తి విశ్వజిత్ యాగము చేసి దానధర్మాలు చేసి అత్యంత శక్తివంతుడై ఇంద్రుడిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలువరించడం ఎవరి తరమూ కాలేదు. దేవతలంతా చెల్లాచెదురైపోయారు. తమను రక్షించమంటూ వెళ్లి ఆ విష్ణుమూర్తినే శరణువేడారు. అంతట విష్ణుమూర్తి తాను అదితి అనే రుషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన వామనుడిగా జన్మించిన విష్ణుమూర్తి..బలి దగ్గరకు వెళతాడు. 


Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం


భూమ్మీదకు బలి చక్రవర్తి 
అతిథి మర్యాదలు చేసిన బలి..ఏం కావాలని అడుగుతాడు. మూడు అడుగుల స్థలం వామనుడు మూడు అడుగుల స్థలం కోరతాడు. అందులోని అంతార్థం తెలియక ఇస్తానంటాడు బలిచక్రవర్తి. వామనుడు భూమి మీద ఒక అడుగు, ఆకాశం మీద ఒక అడుగు పెట్టి మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అంటాడు. ఆ మూడవ అడుగు తన తల మీద పెట్టమంటాడు బలిచక్రవర్తి. అలా బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేస్తాడు వామనుడు. అయితే బలి దాన గుణానికి సంతోషించిన మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్టు వరమిస్తాడు. బలిని భూమ్మీదకు ఆహ్వానిస్తూ జరుపుకునేదే కేరళలో ఓనం పండుగ.


మహాబలిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు రంగురంగుల పూలతో రంగవల్లులు తీర్చిదిద్దుతారు. తిరుఓనం రోజు మహాబలి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుని వారి ఆనందాన్ని స్వయంగా చూస్తాడని అక్కడి వారి విశ్వాసం. ఓనం సందర్భంగా విందు భోజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఓనం సందర్భంగా నిర్వహించే పడవల పందేం, సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటాయి.