కోట్లాది భక్తుల ఆరాధ్యదైవం  అయిన శ్రీ వేంకటేశ్వరుడి క్షణకాలం పాటు జరిగే దర్శనం కోసం భక్తులు తపించిపోతారు. ఎన్నో వ్యయ ప్రయాసలు ఓర్చి స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. అయితే ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో రెండు రోజుల పాటూ కొన్ని గంటలపాటూ శ్రీవారి దర్శనాలు నిలుపదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. అక్టోబర్ 25, నవంబర్ 8వ తేదీన తిరుమలకు వచ్చే భక్తులు తప్పని సరిగా తెలుసుకోవాలి..


అక్టోబరు 25, నవంబరు 8న ఎందుకంటే ఆ రెండు రోజులు గ్రహణం ఉంది. సాధారణంగా గ్రహణ కాలం అంటేనే సకల దేవతామూర్తుల శక్తులు తగ్గుతాయని విశ్వసిస్తారు. అందుకే ఆ సమయంలో తినే ఆహారం కూడా రాక్షసభోజనంగా పరిగణిస్తారు. కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉంటారు. ఎంత ముఖ్యమైన పనులున్నా ఆ సమయంలో ఇంటినుంచి బయటకు అడుగుపెట్టనివారూ ఉన్నారు. గ్రహణం సమయం ముగిసిన తర్వాత తలకు స్నానం చేసి ఇల్లంతా కడిగేసే సంప్రదాయాన్ని కూడా ఇప్పటికీ పాటిస్తున్నారు కూడా.  గ్రహణం ఉన్న ఘడియల్ని అంత పవర్ ఫుల్ గా భావిస్తారు. అందుకే ఆ సమయంలో ఆలయాలు కూడా కొన్ని గంటల పాటూ మూసివేస్తారు. తిరిగి ప్రక్షాళన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. 


Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!


గ్రహణాలు ఎప్పుడంటే
అక్టోబర్ 25న ఆదివారం సూర్య గ్రహణం
సాయంత్రం 5.11 నుంచి  6:27 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఆ రోజు ఉదయం 8 గంటల నుంచీ రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. సుప్ర‌భాతం, శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోప‌ల పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హిస్తారు. అనంత‌రం మొద‌టి అర్చ‌న‌, మొద‌టి గంట‌, బ‌లి శాత్తుమొర‌, రెండో అర్చ‌న, రెండో గంట త‌దిత‌రాల‌ను ఏకాంతంగా చేప‌డ‌తారు. శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.


నవంబరు 8 చంద్ర గ్రహణం
నవంబరు 8న చంద్రగ్రహణం మధ్యాహ్న సమయంలో ఉంది. ఈ కారణంగా ఆ రోజు కూడా స్వామివారి ఆలయాన్ని  ఉదయం 8:40 నుంచి రాత్రి 7:20 గంటల వరకు మూసివేస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల  మధ్య సుప్ర‌భాతం, శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోప‌ల పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హిస్తారు. అనంత‌రం అర్చ‌న‌, గంట‌, బ‌లి శాత్తుమొర‌, రెండో అర్చ‌న, గంట త‌దిత‌రాల‌ను ఏకాంతంగా చేప‌డ‌తారు.రాత్రి 9 గంటల అనంతరం శ్రీవారి సర్వ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. 


Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం


గ్రహణం కాలంలో టీటీడీ రద్దు చేసిన సేవలివే
అక్టోబర్ 25, నవంబర్ 8 వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఉంజల్ సేవ,ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీప అలంకరణ సేవలు రద్దు చేసింది టీటీడీ.
వయో వృద్దులు వికలాంగులు, చిన్న పిల్లల తల్లి తండ్రులు, ఎన్ఆర్ఐ, ఆర్మీ,డిఫెన్స్ ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది. 
ఈ రెండు రోజుల్లో కేవలం సర్వదర్శనంకు వచ్చిన భక్తులకు మాత్రమే అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు
గ్ర‌హ‌ణం స‌మ‌యంలో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ సైతం నిలుపుదల చేసింది టీటీడీ


ఇవన్నీ గమనించి భక్తులు తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని సూచించారు టీటీడీ అధికారులు...