Ramagundam Police: గణేష్ నిమజ్జన శోభాయాత్ర పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ (ఐజీ) స్పష్టం చేశారు. ప్రజలందరు ఆనందంగా శోభయాత్రలో పాల్గొనడానికి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఏలాంటి పుకార్లను నమ్మరాదని, ఏవైనా సమస్యలు వస్తే.. దగ్గరలోని సిబ్బందికి గాని పోలీస్ స్టేషన్ కి గాని సమాచారం అందించాలని తెలిపారు. సామాజిక మాధ్యమంల్లో వచ్చే ఎలాంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. శోభయాత్ర జరిగే ప్రాంతాలలో యాత్ర జరిగేటప్పుడు ట్రాఫిక్ డైవెర్షన్లు ఉంటాయని తెలిపారు. కాబట్టి ప్రజలు దానికి అనుకూలంగా సిద్ధం కావాలని, మద్యం తాగి వాహనాలను నడుపరాదని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే డీజేలకు అనుమతి లేదని.. టపాకాయలు కూడా కాల్చడానికి వీల్లేదని చెప్పారు. మంచి కండీషన్ లో ఉన్న వాహనాలను మాత్రమే గణేష్ శోభాయాత్రకు వినియోగించాలని సూచించారు. ఆధ్యాత్మిక వాతావరణం చక్కగా కనిపించే విధంగా చూడాలని, మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనవద్దని వివరించారు.


చిన్నారులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దు..


నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని అయితే మండపాల నిర్వాహకులు చిన్నారులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకు రావద్దని పోలీసులు చెబుతున్నారు. నిర్దేశించిన విధంగా క్రమపద్ధతిలో శోభాయాత్రలో పాల్గొనాలని రెడ్డిపల్లి  పోలీస్ శాఖ సూచనలు పాటించాలని కోరారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో శోభా యాత్ర బందోబస్తు నిర్వహిస్తున్నామని వివరించారు. రెవెన్యూ, మున్సిపల్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారులు, ఇరిగేషన్ అధికారులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి ఘనటలు చోటు చేసుకోకుండా గణేష్ నిమజ్జనోత్సవాలు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు.


మద్యం దుకాణాలు తెరిస్తే.. ఇక అంతే పరిస్థితులు!


పెద్దపల్లి, మంచిర్యాల జోన్ లలో ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. శోభయాత్ర సందర్భంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని అన్ని వైన్ షాపులను మూసి వేయిస్తున్నామని.. ఎవరైనా నిబంధనలు పాటించకుండా తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శోభయాత్ర మార్గంలో వాహనం నుండి ఎటువంటి రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయరాదన్నారు. నిమజ్జనం లేదా ఊరేగింపు కోసం గణేష్ విగ్రహాన్ని తీసుకువెళ్లే వాహనం దారిలో లేదా ఏదైనా ప్రార్థనా స్థలం దగ్గర ఆపకూడదని, కుంకుమ, రంగులు లేదా గులాల్ బాటసారులపై, ప్రజలపై చల్లరాదని తెలిపారు. ఇతర మతాల ప్రజల మనోభావాలను దెబ్బతీసే  చర్యలు చేస్తే.. చట్ట పరమైన చర్యలు తప్పవని వివరించారు. 


నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు..


రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో శోభా యాత్ర ప్రశాంతంగా నిర్వహించుకునేలా ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉత్సవ కమిటీల సభ్యులు, శాంతి సంఘం సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని మతాల పెద్దలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ప్రజలందరికీ ఇప్పటికే తగిన సూచనలు చేశామని శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదని పేర్కొన్నారు. సమస్యలు సృష్టించే ప్రయత్నం ఎవరు చేసినా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా, నిభంధనలు అతిక్రమించినా సంబంధిత వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పదే పదే చెప్పారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.