Wife Murdered Husband: వారిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. మతాలు వేరైనా గత ఏడు సంవత్సరాలుగా కలిసి కాపురం చేస్తున్నారు. కానీ అనుమాన విష బీజం వాళ్ల మధ్య గొడవలకు కారణమైంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆటోనగర్ కు చెందిన అజీమ్ ఖాన్ ను కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య శ్రావణి, అత్త నర్మద గొంతు నులిమి చంపేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సంఘటనా స్థలాన్ని ఎన్టీపీసీ పోలీసులు పరిశీలిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాల్లోకి వెళితే...
అత్త, భార్యలు కలిసి గొంతు నలిమి చంపారు.
మతాలు వేరు కావడంతో సర్దిచెప్పే వాళ్లు లేక..
ఎన్టీపీసీ ఆటోనగర్ కు చెందిన అజీమ్ ఖాన్ సెంట్రింగ్ పనులు చేసుకునేవాడు. అదే కాలనీకి చెందిన శ్రావణి అనే యువతిని దాదాపుగా 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. సాఫీగా సాగిపోయే ఆ కుటుంబంలో వారికి హమాన్, హర్మాన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. స్థానిక పాఠశాలలోనే వారిద్దరు చదువుతున్నారు. అజీమ్ ఖాన్ కూలీ పనిచేసి సంపాదించిన డబ్బుతో కుటుంబం గడిచేందుకు కష్టంగా ఉండేదని... ఆర్థిక ఇబ్బందులతో తరచు దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. వారి మతాలు వేరు కావడంతో ఇద్దరికీ సర్ది చెప్పేవారు లేక గొడవలు ఎక్కువయ్యాయి. భార్య భర్తల మధ్య ఇటీవల కాలంలో గొడవలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇబ్బందులు భరించలేని శ్రావణి షాపింగ్ మాల్ లో సేల్స్ గర్ల్ గా పని చేస్తోంది. అయినప్పటికీ వివాదాలు తగ్గడం లేదు. మంగళవారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భర్త అజీం ఖాన్ పై దాడి చేసి గొంతు నులిమి చంపేసినట్లు స్థానికులు చెప్పారు. శ్రావణితో పాటు ఆమె తల్లి నర్మద కూడా దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎన్టీపీసీ ఎస్సై జీవన్ పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. విభిన్న కోణాలలో సంఘటనను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
అనుమానంతో మొదలైన గొడవలు...
పెళ్లయిన మొదట్లో బాగానే ఉన్నారు ఈ దంపతులు. అయితే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని, ఇదే క్రమంలో తన అక్క శ్రావణిని గతంలో బావ కత్తితో చంపే ప్రయత్నం చేశాడని మృతుని మరదలు చెప్పింది. కొద్ది రోజులుగా అనుమానం పెంచుకున్న అజీమ్ ఖాన్ ఎప్పుడు తన అక్క వెంబడి పడుతూ వేధింపులకు గురి చేయడంతో ఎక్కడ ప్రాణాలు తీస్తాడో అనే భయంతోనే ఎదురుదాడికి దిగాల్సి వచ్చిందని వారు అంటున్నారు. శ్రావణి సొంత కాళ్లపై నిలబడడం ఇష్టం లేని అజీమ్ ఖాన్ ఉద్యోగం మానేయాలంటూ పలుమార్లు హెచ్చరించాడని ఆమె తరపు బంధువులు వివరిస్తున్నారు. అయితే ఆర్థిక సమస్యలు, అదృష్టం, కుటుంబ పోషణ కోసం తాను ఉద్యోగం చేయక తప్పదని శ్రావణి పలుమార్లు అర్థమయ్యేలా చెప్పిందని... కానీ అతను వినకపోవడంతోనే సమస్య ఇక్కడ వరకు వచ్చిందని అంటున్నారు. తండ్రి మృతి చెందడం తల్లి నిందితురాలుగా మారడంతో ఆ పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.