నెల్లూరు జిల్లాలో రెండు హృదయ విదారక సన్నివేశాలు జరిగాయి. అర్థాంతరంగా రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రమాదం కాదు, అలాగని అనారోగ్యమూ కారణం కాదు. కానీ వారికి అంతవరకే జీవితం ఉంది కాబోలు, అప్పటి వరకూ అందరితో కలసి మెలసి ఉన్నారు. హాయిగా నవ్వుకున్నారు, ఆనందంగా గడిపారు. కానీ ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్పకూలారు. అంతే ఒక్క క్షణం కూడా వారి ప్రాణం వారి వద్ద లేదు. రెండు ప్రాణాలు ఆగిపోయాయి. ఇద్దరూ చనిపోయారు. ఈ రెండు చావులకి సంబంధం లేకపోయినా, రెండూ ఒకేరోజు, ఒకే జిల్లాలో జరగడం మాత్రం విచిత్రం. ఇద్దరూ అర్థాంతరంగా చనిపోవడం విధి విలాసం.
నెల్లూరు జిల్లా వింజమూరు బాలికోన్నత పాఠశాలలో ఏడో తరగది విద్యార్థిని షేక్ సాజిదా తరగతి గదిలోనే గుండెపోటుతో కుప్పకూలింది. ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రశ్నలు అడుగుతుండగా.. సాజిదా ఒక్కసారిగా కూలబడిపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గుండెపోటుతో ఆమె అప్పటికే చనిపోయినట్టు నిర్థారించారు వైద్యులు. అప్పటి వరకు తమతోపాటు ఆడుతూ పాడుతూ ఉన్న స్నేహితురాలు అకస్మాత్తుగా చనిపోయే సరికి తోటి విద్యార్థులు షాకయ్యారు. చిన్నపాటి అనారోగ్యం కూడా లేని తమ కుమార్తె ఒక్కసారిగా ప్రాణాలు వదలడం ఏంటని.. తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఉపాధ్యాయులు కూడా ఈ ఘటనతో షాకయ్యారు.
నెల్లూరు జిల్లా సంగం వద్ద విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ చెంచయ్య కూడా ఇలాగే ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించారు. జిల్లాలోని సంగం గురుకుల పాఠశాల వద్ద సీఎం జగన్ పర్యటనకోసం హెలిపాడ్ సిద్ధం చేశారు. జగన్ పర్యటన ముగిసిన తర్వాత ఈరోజు హెలిపాడ్ వద్దకు స్థానిక పోలీసులు వచ్చారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ చెంచయ్య అక్కడే మంచినీరు తాగుతూ కుప్పకూలిపోయినట్టు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. ఆయన్ను వెంటనే స్థానికుల సహాయంతో ఆటోలో సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు వైద్యశాలకు తరలించారు. చెంచయ్య గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్సై నాగార్జున రెడ్డి, సిబ్బంది ఆయనకు నివాళలర్పించారు.
కార్డియాక్ అరెస్ట్..
నెల్లూరు జిల్లాలో ఒకేరోజు జరిగిన ఈ రెండు సంఘటనలకు కార్డియాక్ అరెస్ట్ కారణం అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతుంటాయి. కానీ ఒకేసారి ఒకేరోజు నెల్లూరులో రెండు ప్రాణాలు ఇలా పోవడం మాత్రం విచారకరమైన విషయం. అక్కడ ఏడో తరగతి బాలిక, ఇక్కడ ఆరోగ్యంగా ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్.. సడన్ గా ఇద్దరూ ప్రాణాలు వదిలారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వీరికి గుండెపోటు వచ్చిందని, కార్డియాక్ అరెస్ట్ కావడంతో వైద్యం అందించేలోపే వీరు ప్రాణాలు వదిలారని అంటున్నారు. ప్రాథమిక చికిత్స చేసినా కూడా వారిద్దరూ వైద్యానికి స్పందించలేదని రెండు సంఘటనల్లో వైద్యులు చెబుతున్నారు. వింజమూరులో బాలిక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఇటు సంగంలో హెడ్ కానిస్టేబుల్ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.