నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల పరిధిలోని చెముడుగుంట నక్కల కాలనీలో బాలికపై యాసిడ్ దాడి చేసిన నిందితుడు నాగరాజుని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి దాడికి ఉపయోగించిన కత్తి, యాసిడ్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి సంఘటన బాధాకరం అని చెప్పారు ఎస్పీ విజయరావు. వెంటనే పోలీసులు స్పందించి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారని చెప్పారు, నిందితుడిని పట్టుకోవడంలో వారి కృషిని అభినందించారు.


నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ ఘటనకు సంబంధంచిన పూర్తి వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ విజయరావు. బాలిక తండ్రికి చెల్లెలు కుమారుడు నెల్లూరు నాగరాజు. వరుసకు బావ అవుతాడు. అతని వయసు 34 ఏళ్లు. నాగరాజు ఆటో నడుపుకుని జీవనం సాగించేవాడు, బాలిక ఇంటికి సమీపంలోనే ఇతని కుటుంబం కూడా నివాసం ఉండేది. ఈనెల 5వతేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు నిందితుడు నాగరాజు బాలిక నివాసానికి వెళ్లాడు. అంతకు ముందే అతను ఆ ఇంటికి వెళ్లి కూర కావాలని అడిగి గిన్నెలో తెచ్చుకున్నాడు. ఆ సమయంలో ఆ బాలిక ఒంటరిగా ఉండటాన్ని గుర్తించాడు నాగరాజు. ఆ గిన్నె తిరిగిచ్చే నెపంతో మరోసారి ఇంటికి వెళ్లాడు. కానీ ఈసారి గిన్నెలో యాసిడ్ తీసుకుని వెళ్లాడు. ఆమెను బెదరించి ఒంటిపై బంగారం, ఇంట్లోని నగదు తీసుకుని వెళ్లాలని ప్లాన్ వేశాడు. 




నాగరాజు బెదిరింపులకు భయపడిన బాలిక తన చెవి కమ్మ తీసి ఇచ్చేసింది. మరో కమ్మ రాకపోవడంతో ఆమె ప్రయత్నించేలోగా నాగరాజు తనతో తెచ్చుకున్న యాసిడ్ లో గుడ్డను ముంచి ఆమె మొహంపై పెట్టాడు. దీంతో ఆమెకు కాలిన గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా చాకు తీసుకొచ్చి ఆమె గొంతు కోయడానికి ప్రయత్నించాడు. బాలిక మెడకు గాయమైంది. దానికంటే ఎక్కువగా యాసిడ్ పోయడంవల్ల ఆమె ఎక్కువగా ఇబ్బంది పడింది. ఆ తర్వాత నిందితుడు పారిపోయాడు. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన ఆ బాలిక పొరుగింటివారి వద్దకు వెళ్లి విషయం చెప్పింది. వారు తండ్రికి ఫోన్ చేసి సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం రావడంతో.. వారు ఆ బాలికను నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమెను చెన్నైకి తరలించారు. 




సొంత బావ మైనర్ బాలికపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు ఎస్పీ విజయరావు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కఠినమైన సెక్షన్లు పెట్టామన్నారు. ఐపీసీ 326, 380, 448, 307, 386, 342, 354, 509తోపాటు రాబరీ కేసు, ఫోక్సో యాక్ట్ కింద కూడా కేసులు పెట్టామన్నారు. 


ప్రస్తుతం ఆ బాలికకు ప్రాణాపాయం లేదని, ఆమె చెన్నైలో కోలుకుంటుందని తెలిపారు ఎస్పీ. అయితే దాడి జరిగిన రోజు రేప్ అటెంప్ట్ అనే వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత ఆమెపై అత్యాచార యత్నం జరగలేదని పోలీసులు ధృవీకరించారు. కేవలం దొంగతనం కోసం వచ్చిన బావ, యాసిడ్ తో దాడి చేశాడని చెప్పారు. 7 రోజుల్లో ఛార్జి షీట్ వేసి నిందితుడికి శిక్ష పడేలా న్యాయ నిపుణులతో కలిసి పనిచేస్తామన్నారు ఎస్పీ. 


మరోవైపు బాలికకు న్యాయం జరగాలంటూ నెల్లూరు నగరంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. విద్యార్థినులపై దాడులు జరగడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యార్థినికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తూ నగరంలో రాస్తారోకో నిర్వహించారు.