APSRTC Employees: ఏపీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆనాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పేగానే ఉద్యోగులు చాలా సంతోషించారు. కానీ నేడు విలీన ఫలాలు దక్కక, సరైన సమయానికి జీతాలు పెరగక నానా ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. మీ సమస్యలన్నీ తీరుస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సాంకేతిక సమస్యల పేరిట ప్రభుత్వం నాన్చుడు ధోరణి అలంభిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి తుది గడువు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు.. తమ సమస్యల సాధనలో భాగంగా ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం అవుతున్నాయి. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. 2020 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారు. నాటి నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న విధంగానే ఆర్టీసీ ఉద్యోగులకూ జీతాలు చెల్లించాల్సి ఉంది. 


వేతనాలు పెరిగినా ఆర్టీసీ వాళ్లకు అమలు కావట్లేదు.. 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు పెరిగాయి. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు ఎందుకోగానీ అమలు చేయడం లేదు. సిబ్బంది ఆందోళనతో జూన్ 6వ తేదీన ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు చ్చింది. జూలై నుంచి పెంచిన వేతనాలు అందుతాయని ఆశపడ్డారు. మళ్లీ నిరాశే ఎదురైంది. ఇప్పటికీ పాత జీతాలే ఇస్తున్నారు. ఉత్తర్వులు ఇచ్చి నెలలు గడుస్తున్నా సాంకేతిక సమస్యల పేరిట అధికారులు తాత్సారం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


సాంకేతిక సమస్యల పేరిట.. 
ఆర్టీసీలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఎన్నో ఏళ్లుగా ఒరాకిల్ సాఫ్ట్ వేర్ ను వాడుతున్నారు. ప్రభుత్వంలో మాత్రం సీఎఫ్ఎంఎస్ ద్వారా  అందిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఉద్యోగులను సీఎంఎఫ్ఎస్ లో చేర్చలేదు. సాఫ్ట్ వేర్ లను లింక్ చేయాలంటూ జూన్ 6వ తేదీన, 26వ తేదీన రెండు సార్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ఆర్టీసీ ఎండీ లేఖ రాశారు. అయినప్పటికీ దాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. దీంతో జూన్ 29వ తేదీన సీఎంఎఫ్ఎశ్ సీఈఓకు లేఖ రాశారు. అయినా ఫలితం దక్కకపోవడంతో జులై 1వ తేదీన ఉద్యోగులు పాత వేతనాలే తీసుకున్నారు. 


పదే పదే అడిగినా ఫలితం లేకుండా పోతోంది.. 
ఈ తర్వాత తీరిగ్గా రెండు సాఫ్ట్ వేర్ లను లింక్ చేయడం కుదరదని, ఆర్టీసీ ఉద్యోగులు సీఎంఎఫ్ఎస్ లోకే రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దీనికోసం డీడీఓలు ఏర్పాటు చేయాలని తేల్చింది. ఈ మార్పు కోసం అన్నీ సిద్ధం చేసినా ఆర్థిక శాఖ పదే పదే కొర్రీలు వేయడం వల్ల ఆగస్టు 1వ తేదీన కూడా ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు రాలేదు. మొత్తం 48 మందికి స్టేట్ కేడర్ పదోన్నతులు ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ పీఆర్సీ ఆర్థిక శాఖ మరోసారి ఆపేయడంతో సెప్టెంబర్ 1వ తేదీన పాత జీతాలే అందుకోక తప్పలేదు.