ప్రకృతినే పరమాత్మగా భావించి పూజిచే సంస్కృతి మనది. అందుకే చెట్టును, పుట్టను, జీవులను పూజిస్తుంటాం. వేదాల్లో నాగపూజ అంటూ ప్రత్యేకించి లేకున్నా నాగదేవత పూజ సంహితాల్లో, బ్రాహ్మణుల్లో విశేషించి చెప్పారు. నాగుల చవితి, నాగుల పంచమి తిథుల్లో నాగ దేవతారాధన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.


దీపావళి తర్వాత వచ్చే శుద్ధ చవితిని నాగుల చవితి అంటాం. వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ట నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటాం. ఈ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే తిథే కార్తీక శుద్ధ చవితి. అదే నాగుల చవితి. 


తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ రోజున తెల్లవారగానే లేచి, తలస్నానం చేసి, నాగదేవతారాధన చేస్తారు. మరికొందరు పుట్ట వద్దకు వెళ్లి ఆవుపాలు పుట్టలో పోసి, నాగపూజను నిర్వహించి చలిమిడి, చిమ్మిలి, అరటిపండ్లు నైవేద్యంగా పుట్టవద్ద సమర్పిస్తారు. పుట్ట చుట్టూ ప్రదక్షణ చేస్తారు. ఈరోజంతా ఉపవాసం ఉంటారు. పురాణాల ప్రకారం మనకు నాగదేవతలు అనేకం ఉన్నా వారిలో 9 మందిని మాత్రమే నాగుల చవితి పూజా సమయంలో పూజిస్తారు. అనంతం, వాసుకీం, శేషం, పద్మనాభం, కంబలం, శంఖపాలం, ధ్రుతరాష్ట్రం, తకక్షం, కాలీయం అనే తొమ్మిది మంది నాగదేవతలను పూజించాలి. వారిని ఒకసారైనా స్మరించుకోవాలి.


నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే ఎలాంటి నాగదోషాలున్నా సమసిపోతాయని పురాణ వచనం.


‘‘కర్కోటకస్య నాగస్య దయమంత్యా నలస్య చ


ఋతుపర్ణస్య రాజర్షే: కీర్తనం  కలినాశనమ్’’


పై శ్లోకాన్ని పూజసమయంలో చెబుతూ ప్రదక్షణలు చేయాలి... అదేవిధంగా ‘‘నాగేంద్రా! మేము మా వంశములోవారము నిన్ను ఆరాధిస్తున్నాం. పొరపాటున తోకతొక్కితే తొలగిపో. నడుంతొక్కితే నా వాడనుకో! పడగ త్రొక్కితే పగవాడనుకోకు తండ్రీ’’ అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేస్తుంటారు. ‘‘పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకుని మూకలు మాకివ్వు తండ్రీ’’ అని నూకను చల్లి పుట్టమన్ను చెవులకి పెట్టుకుంటారు. ఇలా నాగుల పుట్టకు పూజను నిర్వహిస్తారు.


ఇక ఈ రోజున ప్రధానంగా భూమిని తవ్వడం చేయకూడదు. రైతులు, భూమిని దున్నడం వంటి పనులు అసలు చేయోద్దు. నాగపూజ అంటే సాక్షాత్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధననే అని చెప్పవచ్చు కాబట్టి ఈరోజున ఎవరైతే సర్పపూజను చేస్తారో వారికి సర్పసంబంధ దోషాలు అంటే కుజదోషం, కాలసర్పదోషం, కళత్ర దోషం లాంటివి తొలిగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయడం చాలా మంచిది.


సంతానప్రాప్తి కోసం ఈరోజున పాముకు అభిషేకం, నాగపూజ చేసుకుని, వెండి నాగుపామును పుట్టలో వేసి, బ్రహ్మచారిని పిలిచి వారిని సర్పదేవతగా భావించి బట్టలు పెట్టి, దక్షిణ తాంబూలాదులతో సత్కరిస్తే తొందరగా సంతానం కలుగుతుంది. ఇక చెవి బాధలు, కంటిబాధలు ఉన్నవాళ్లకు చవితి ఉపవాసం మంచిది. ఆ పుట్టమన్ను తీసుకుని చెవిపైనా కంటిపైనా రాసుకుంటే ఆ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. ఇక కొత్త బట్టలు తీసుకువెళ్లి నాగుల పుట్టమీద పెట్టి తీసి ధరిస్తే మనోరథాలు తీరుతాయని చెబుతారు.


సాధారణంగా పాములు భూమిలోపల జీవించే జీవులు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ, పంటకు ఎలాంటి నష్టం రాకుండా రైతులకు పరోక్షంగా లాభం చేకూరుస్తాయి. అలా అవి మనకు సహాయపడుతుంటాయి. ఇక ఈరోజున పుట్టలో పాలు పోయడం అంటే ఏదో సామాన్యమైన విషయం అని అనుకోవచ్చు, కానీ పుట్టలో ఉన్నటువంటి పాముకి కూడా పాలు పోసి, తన పట్ల మిత్రత్వం ఉన్నదని చెప్పడం అన్నమాట. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలో మిత్రత్వాన్ని కలిగి ఉండాలనే భావనని చాటిచెప్పడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం.


Also Read: బెడ్ రూమ్‌లో అద్దం అక్కడ ఉందా? జాగ్రత్త, అది మీకే నష్టం!