Mahabharat: స్నేహాన్ని మించిన బంధం ఏముంది అంటారు. ఎంత కష్టం వచ్చినా మంచి స్నేహితుడు పక్కనుంటే చాలు ఇట్టే బయటపడొచ్చని చెబుతారు. అందుకే స్నేహం చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అలాంటి స్నేహాన్ని ఎలా ఎంచుకోవాలి అన్నది మహాభారతం సూచిస్తోంది. మహభారతంలో స్నేహాన్ని 3 రకాలుగా చెప్పారు. అవి విఫలస్నేహం, సఫలస్నేహం, సుఫలస్నేహం. విఫలస్నేహం అంటే విఫలం అయిన స్నేహం అని, సఫలస్నేహం అంటే ఫలించిన స్నేహం లేదా బలమైన స్నేహం అని, సుఫలస్నేహం అంటే మంచి ఫలితాన్ని ఇచ్చిన స్నేహం. మహాభారతంలో ఈ మూడు కోవలకు చెందిన స్నేహితులు ఎవరో చూద్దాం..
Also Read: మహాభారత యుద్ధంలో ఏరోజు ఎంతమంది చనిపోతారో ముందు రోజు రాత్రే క్లారిటీ ఇచ్చేసిన కృష్ణుడు
విఫలస్నేహం (ద్రోణాచార్యుడు ద్రుపదుడు)
కౌరవులు పాండవుల గురువు అయిన ద్రోణాచార్యుడు, ద్రౌపది తండ్రి అయిన ద్రుపదుడు ఇద్దరు భారద్వాజ మహర్షి దగ్గర సకల విద్యలు అభ్యసించారు. ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు.ఆ సమయంలో ద్రుపదుడు... ద్రోణాచార్యుడితో ఇలా అన్నాడు "మిత్రమా ద్రోణా! నేను నా రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడిని అయినప్పుడు, నా సగం రాజ్యాన్ని నీకు ఇస్తాను." అని మాట ఇస్తాడు ద్రుపదుడు. ఆ మాటకి సంతోషించాడు ద్రోణుడు. కొంతకాలం తర్వాత విద్యను పూర్తిచేసుకుని ఎవరికి దారిన వాళ్లు వెళ్లిపోయారు.
ద్రుపదుడు తన రాజ్యం అయిన పాంచాల రాజ్యాన్ని పాలిస్తున్నాడు. కానీ ద్రోణాచార్యుడు పేదరికంలో ఉంటాడు. ఆ సమయంలో స్నేహితుడు ద్రుపదుడు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి తన దగ్గరకు వెళ్లి రెండు ఆవులు ఇవ్వమని కోరుతాడు. అప్పుడు ద్రుపదుడు చాలా కోపంగా "ఓరి బ్రాహ్మణా! ఎవరు నువ్వు? నీతో నాకు స్నేహం ఏంటి. రాజులకు ఎప్పుడు రాజులతోనే స్నేహం ఉంటుంది. బ్రాహ్మణులతో కాదు." అని అవమానించి బయటికి పంపించేస్తాడు. ఆ అవమానానికి ప్రతీకారంగా...కౌరవులు పాండవులకు శిక్షణ ఇచ్చి గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తీసుకురమ్మని చెప్తాడు. ద్రుపదుడు కూడా తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం కోసం ఒక యజ్ఞం చేసి పుత్రుడిని కోరగా ద్రుష్టద్యుమ్నుడు పుడతాడు. అర్జునుడిని అల్లుడిగా చేసుకునేందుకు పుత్రికను కోరగా...ద్రౌపది ఉద్భవించింది.
కురుక్షేత్రం జరగడానికి కారణం ఒక రకంగా వీళ్ళ స్నేహమే అని చెప్పుకోవచ్చు. ఇదే విఫలం అయిన స్నేహం. ఆ రోజు ద్రోణాచార్యుడు అడిగిన రెండు ఆవులు ఇచ్చి ఉంటే ఒక మహాసంగ్రామం జరిగి ఉండేది కాదేమో. అందుకే సంతోషంగా ఉన్నప్పుడు స్నేహితులకు మాట ఇవ్వకూడదు..ఇచ్చినా మర్చిపోకూడదు.. అలాగే కోపంలో, బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
సఫలస్నేహం (దుర్యోధనుడు-కర్ణుడు)
మహాభారతంలో మెయిన్ విలన్ అనగానే గుర్తుకువచ్చే పాత్ర దుర్యోధనుడే. కానీ దుర్యోధనుడిని ద్వేషించినంతగా తన స్నేహితుడు కర్ణుడిని ఎవరు ద్వేషించలేరు. అయినా వారిద్దరికీ స్నేహం ఎలా కుదిరిందంటే...ఇదంతా కౌరవులు పాండవులకు వారి విద్యాభ్యాసం తరువాత జరిగిన ప్రదర్శన పోటిలో కర్ణుడు పొందిన అవమానమే కారణం. విలువిద్యలో అర్జునుడికి సరిసమానంగా నలిచిన కర్ణుడు సూత పుత్రుడు(రథ నడిపేవాడి కొడుకు) కాబట్టి పోటిలో పాల్గొనే అర్హత లేదు అని వెళ్ళిపోమని ద్రోణాచార్యుడు చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని తన మిత్రుడిగా చేసుకుని వెంటనే అంగ రాజ్యానికి రాజును చేశాడు. అందుకే కర్ణుడు దుర్యోధనుడి కోసం తన ప్రాణాన్ని అయిన ఇవ్వడానికి సిద్ధపడ్డాడు.
దుర్యోధనుడు కేవలం అర్జునుడిని ఎదిరించేందుకే కర్ణుడితో స్నేహం చేశాడనే చర్చ జరిగినా... వారి స్నేహం ఎంత గొప్పదో చెప్పడానికి ఒక సంఘటన ఉంది. అది తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
స్నేహితుల మధ్య అపార్థాలకు తావుండకూడదు అనేందుకు నిదర్శనం వీరిద్దరు. అయితే వీరిది సఫల స్నేహం అంటే ఫలించిన స్నేహమే కానీ మంచి స్నేహం కాదు..ఎందుకంటే కర్ణుడి అండ చూసుకునే దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యాడు
సుఫలస్నేహం (కృష్ణుడు - అర్జునుడు)
వీరిద్దరూ బావ బావమరిది అయినప్పటికీ బంధానికి మించిన స్నేహం వీరిమధ్య ఉందని చెప్పుకోవచ్చు. వారి స్నేహానికి ఫలితం, మనం ఈ రోజు ఎంతో పవిత్రంగా భావిస్తోన్న భగవద్గీత. అర్జునుడికి విజయానికి దారి చూపించాడు కృష్ణుడు. స్నేహితుడి విజయమే తన లక్షంగా చేసుకుని అనుక్షణం వెన్నంటే ఉండి నడిపించాడు. కృష్ణుడి స్వచ్ఛమైన స్నేహం ఇచ్చిన ధైర్యమే కురుక్షేత్రంలో విజయం సాధించేలా చేసింది. అంటే మంచి ఫలితాలనిచ్చిన స్నేహం కనుకే వీరిది సుఫల స్నేహం.
జీవితంలో వివిధ దశల్లో ఎంతో మంది స్నేహితులు ఏర్పడతారు. వారిలో ఎవరు ఏంటి అన్నది తెలుసుకోవడమే విజ్ఞత. స్నేహం అంటే ఓ అడుగు ముందుకేసేలా ప్రోత్సహించాలి,కష్టం నుంచి బయటపడేలా మార్గనిర్దేశకత్వం చేసేలా ఉండాలి.