Maha Shivratri jagran 2024:  మహాశివరాత్రి రోజు భక్తులంతా జాగరణ, ఉపవాసం చేస్తారు. అయితే జాగరణ అంటే మేల్కొని ఉంటే చాలనుకుంటారు. కానీ జాగరణ అంటే మేల్కొని ఉండడం కాదు...భగవంతుడి అస్తిత్వంలో మనసు లగ్నమై ఉండటం. అంటే నిరంతరం భగవంతుడిని తలుచుకుంటూ మేల్కొని ఉండాలి కానీ భౌతికంగా మేల్కొని ఉంటూ ఏవేవో కాలక్షేపం చేయడం కాదు. అర్థరాత్రి సమయంలో శివుడు లింగోద్భవం చెందాడు...పగలంతా ఆయన రాకకోసం వేచిచూస్తూ..పరమేశ్వరుడు ఆవిర్భవించగానే భక్తితో అర్చించేదుకే ఉపవాసం, జాగరణ చేస్తారు. 


Also Read: పార్వతీ దేవికి నిజంగా సమాధానం తెలియకే శివుడిని ప్రశ్నించిందా!


జాగరణ, ఉపవాసం చేసేవారు ఈ నియమాలు పాటించాలి


సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే ఫలితం ఉండదు
మహాశివరాత్రి జాగరణ, ఉపవాసం చేయాలి అనుకుంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సూర్యోదయం తర్వాత నిద్రలేచిన వారు చేసే జాగరణ ఫలితాన్నివ్వదు.  వేకువజామునే స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో శివుడిని పూజించాలి. పూజ సమయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి


Also Read:  'ఏకబిల్వం శివార్పణం' - మారేడు దళాలు శివ పూజకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!


పంచాక్షరి మంత్రం జపించాలి


జాగరణ అంటే భౌతికంగా మేల్కొని ఉండాలన్న ఆలోచనతో ఏదో టైమ్ పాస్ చేయడం కాదు. రోజంతా ఓ నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. శివరాత్రి రోజున శివ లింగం దగ్గర నేతి దీపం వెలిగించడం శుభప్రదం


ఉపవాసం


శివరాత్రి ఉపవాసం ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే మర్నాడు చతుర్థశి తిథి ముగిసేలోగా ఉపవాసం విరమించాలి. వాస్తవానికి చతుర్థశి రోజు మహా శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండేవారు త్రయోదశి నుంచే నియమాలు పాటించాలి. మర్నాడు చతుర్ధశి తిథి ముగిసేలోగా ఉపవాసం విరమించాలి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఒక్కపూట భోజనం చేసి శివనామస్మరణలో గడిపినా మంచిదే. శివరాత్రి ఉపవాసం ఉండేవారు పాలు, పండ్లు లాంటి సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి


Also Read: శివనిందను భరించలేక సతీదేవి ప్రాణత్యాగం, అమ్మవారి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు ఇవే!


మహాశివరాత్రి ఇలాంటి పనులు చేయొద్దు


చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే మహాశివరాత్రి రోజు మాత్రం మంసాహారానికి దూరంగా ఉండాలి. మాంసాహారం మాత్రమే కాదు తామస గుణాన్ని కలిగించే ఉల్లి, వెల్లుల్లిని కూడా ఆహారంలో భాగం చేసుకోరాదు. శివారాధన చేసేవారు పొగాకు, మద్యానికి ఈరోజు దూరంగా ఉండాలి. శివారాధనలో పొరపాటున కూడా తులసిని ఉపయోగించకూడదు.  శివుడికి సమర్పించే బిల్వ పత్రాలు, శమీ పత్రాల తొడిమె మొదటి భాగాన్ని తీయకుండా సమర్పించరాదు. ప్యాకెట్ పాలతో కాకుండా ఆవుపాలను రాగి పాత్రలోకి తీసుకుని అభిషేకం చేయడం మంచిది. పూజ మధ్యలో లేవడం, మధ్యలో మాట్లాడడం,  ఆవేశానికి లోనవడం, కోప్పడడం చేయరాదు. ఇక జాగరణ చేసేవారు కాసేపు నడుం వాలుద్దాంలే అనుకోవడం కూడా సరికాదు.  కాసేపు నడుం వాల్చినా రెప్పపడుతుంది..అది జాగరణ ఫలితాన్నివ్వదు.  ముఖ్యంగా శివరాత్రి రోజు నల్లని దుస్తులు అస్సలు ధరించకూడదు.


Also Read: మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో చెప్పేయండి!


 శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రి పూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే, భగవంతుడి మీద సాధకులకు, మోక్షమార్గంలో ప్రయత్నించేవారికి ఇది విశేష సమయం. గృహస్థులకు ఆయురారోగ్యపరంగా పుణ్యార్చన పరంగా, శుభఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.