స్థంభేశ్వరనాథ్ దేవాలయం


మన దేశంలో ఆలయాలకు, ప్రార్థనా మందిరాలకు కొదవే లేదు. అయితే కొన్ని ఆలయాలను చూస్తే అద్భుతం అనిపిస్తే, మరికొన్ని ఆలయాల్లో మిస్టరీలను ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంకొన్ని దేవాలయాల్లో ఇది కదా దేవుడి మహిమ అనేలా ఉంటాయి. ఏం జరుగుతోంది అనేది కళ్లముందు కనిపిస్తున్నా..ఎందుకలా అన్నది వందల,వేల సంవత్సరాలు నిగూఢ రహస్యాలుగానే మిగిలిపోతుంటాయి. ఈ కోవకు చెందినదే  గుజరాత్ లో  అరేబియా సముద్రంలో ఉన్న స్థంభేశ్వరనాథ్ దేవాలయం (Stambheshwar Mahadev Temple). అహ్మదాబాద్ కు దగ్గర్లోని భవ్ నగర్ కు సమీపంలో ఉన్న కవికాంబోయి గ్రామానికి అత్యంత సమీపంలో అరేబియా సముద్రంలో ఈ దేవాలయం ఉంటుంది. సముద్రపు ఒడ్డు నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీర్ల దూరంలో కాలి నడకన వెలితే ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు.


Also Read: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోకుంటే ఏమవుతుంది


ఈ దేవాలయ సందర్శన సాహసయాత్రే: నిత్యం సముద్రంలో మునిగి తేలే ఈ దేవాలయ సందర్శన ఒక రకంగా సాహస యాత్రగా చెప్పొచ్చు. స్థానిక వాతావరణ పరిస్థితులు కొంచెం అదుపు తప్పినా భక్తులు ప్రాణాలు కోల్పోక తప్పదు. అందుకే ఆ పరమశివుడిని దర్శనార్థం  70 ఏళ్లు పై బడిన వారికి 10 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి ఉండదు. సముద్రఅలల తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో మాత్రమే ఈ దేవాలయంలోని అనుమతి లభిస్తుంది. ఇందు కోసం ఒడ్డున ఉన్న దేవాలయానికి చెందిన ఆశ్రమ నిర్వాహకులు భక్తులకు సూచనలు ఇస్తుంటారు. దూరం నుంచి కేవలం ఆలయం ధ్వజస్థంభం మాత్రమే కనిపిస్తుంది. తీరం నుంచి దేవాలయం వరకూ కట్టిన తాడును పట్టకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆలయంలో పూజారులు ఎవరూ ఉండరు. భక్తులే నేరుగా పూజలు చేస్తారు. తీసుకువెళ్లిన పూలను శివ లింగం పై పెట్టి... ఆశ్రమ నిర్వాహకులు చీటీలో సూచించిన సమయంలోపు ఒడ్డును చేరుకుంటారు. అలల తాకిడికి భక్తులు లింగంపై పెట్టిన పూలు ఒడ్డుకు వచ్చిన తర్వాత వాటిని ప్రసాదంగా భావించి తీసుకెళతారు. ఈ పూలు ఇంట్లో ఉంచుకుంటే అన్నీ శుభాలే కలుగుతాయని భక్తుల విశ్వాసం.  సాధారణంగా మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుంది. సాయంత్రం 6.30 గంటల్లోపు ఒడ్డును చేరుకోవాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ప్రాణాలు కోల్పోక తప్పదు. 


అలల తాకిడికి దెబ్బతినని ఆలయం: పౌర్ణమి రోజు ఇక్కడి లింగం ఒక ద్విగుణీకృతమైన కాంతితో మెరుస్తుందని చెబుతారు. పున్నమి రోజున ఈ దేవాలయ దర్శనం కొంత రిస్కుతో కూడుకున్నది అయినా చాలా మంది అదే రోజు శివుడిని దర్శించుకుంటారు. శివభక్తుడైన తారకాసురడనే రాక్షసుడిని వధించిన తర్వాత కుమారస్వామి ఈ లింగాన్ని ఇక్కడ స్థాపించి పూజించాడని స్కంధపురాణం చెబుతోంది. ఈ శివలింగ దర్శనం ద్వారా సకల పాపాలు తొలిగి పోతాయని భక్తులు నమ్ముతుంటారు. మరో కథనం ప్రకారం కురుక్షేత్రం తర్వాత అన్నదమ్ములను చంపిన పాపం నుంచి విముక్తి పొందడానికి పాండవులు ఇక్కడ ఐదు లింగాలను ప్రతిష్టించి పూజించారని అయితే అవి ఎప్పుడో ఒకసారి మాత్రమే దర్శనమిస్తాయని చెబుతారు. ఆస్తికలను ఇక్కడి నీటిలో కలపడం ద్వారా చనిపోయిన  వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుందని బలంగా నమ్ముతారు. ఆలయం గోపురంపై సూచికగా ఎగిరే జెండాను  ఏడాదికి ఓసారి మాత్రమే మారుస్తారు. అలల తాకిడి వల్ల కానీ తుపాన్ల వల్ల కానీ ఆ జెండా దెబ్బతిన్న దాఖలాలు కూడా ఉండవు. 


Also Read: మీ నక్షత్రం ప్రకారం ఇంటి ఆవరణలో పెంచాల్సినవి .. ఆవరణలో ఉండకూడని చెట్లు ఇవే..
 వెన్నెల వెలుగుల్లో సముద్రంలో కలిసిపోయే ఆలయం: ఈ ఆలయం మునిగి పోవడం, తిరిగి పైకి తేలడం వంటి రెండు ఘట్టాలు చూడాలంటే ఒక రోజు మొత్తం సముద్రం ఒడ్డున గడపాల్సిందే.  ఉదయాన్నే వెళితే అక్కడ ఆలయం కనిపించదు.. మధ్యాహ్నం నుంచి సముద్రం మెల్లమెల్లగా వెనక్కి వెళుతూ ఆలయం వెలుగుచూస్తుంటుంది. అలా సముద్రం వెనక్కు వెళ్లిన తర్వాత తాడు సహాయంతో నడుచుకుంటూ వెళ్లొచ్చు.  ఈ దేవాలయంలో శిల్ప సంపద ఉండకపోయినా వందల ఏళ్లు గడిచినా నీటిలో నిత్యం మునిగితేలుతున్నా ఆలయం చెక్కుచెదరకుండా ఉండడం అంతా శివయ్య లీల అంటారు. ఏదేమైనా చంద్రుడి వెన్నెల వెలుగుల్లో సముద్రం ముందుకు వచ్చి మెల్లగా ఆలయాన్ని తనలోకి తీసుకెళ్లిపోయే దృశ్యం అద్భుతంగా ఉంటుందంటారు భక్తులు.