పంచభూతాల్లో  ఒకటైన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షీ భూతం అని పురాణాలు చెబుతున్నాయి . అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. అందుకే ఆయన సాక్షిగా శ్రీరాముడు మైత్రి చేసుకున్నాడు. అగ్ని పునీత అయిన సీతాదేవిని అయోధ్యకి తీసుకొచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. దేవతలకు అగ్ని పురోహితుడని చెబుతారు. అసలు అగ్నిని సాక్షిగా ఎందుకు పెడతాం.. ముఖ్యంగా వివాహ సమయంలో అగ్ని సాక్షి అని ఎందుకు అంటాం అనే విషయం రుగ్వేదంలో ఇలా ఉంది. 


“సోమః ప్రధమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః
తృతీయాగ్నిష్టే పతిః తురీయప్తే మనుష్యచౌః”


అని వివాహ సమయంలో వరుడు... వధువుతో అంటాడు. అంటే నీ బాధ్యతని  ప్రారంభ కాలంలో సోముడు, ఆ తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్ని తీసుకున్నారు. నాలుగోవాడిగా నేను నీ బాధ్యతలు స్వీకరిస్తున్నానని అర్థం. 


ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆలనా పాలనా సోముడు (చంద్రుడు) చూస్తాడట. చంద్రుడు చల్లనివాడు,  చక్కనివాడు..అందుకే చిన్నపిల్లల్లో అవే  లక్షణాలు కనిపిస్తాయి.  నిండు చంద్రుణ్ణి ఎంత చూసినా తనివి తీరనట్టే..చిన్నారులను చూసినప్పుడు కూడా మనసంతా ప్రశాంతంగా , ఆ నవ్వు వెన్నెలని తలపిస్తుంది.  కొంత వయసు వచ్చాక ఆమె బాధ్యతని గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళ్ళిపోతాడు. చంద్రుని సాక్షిగా, గంధర్వుడు స్వీకరించాడన్నమాట . “లావణ్యవాన్ గంధర్వః” అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశ పెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కాబట్టి అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందచందాలు, గుణగణాలు ఇచ్చి ఇక నా పని అయింది నీ వంతు అని చెప్పి అగ్నికి అప్పగిస్తాడు. అంటే గంధర్వుడి సాక్షిగా అగ్ని స్వీకరిస్తాడు. “అగ్నిర్వై కామ కారకః” అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని ప్రవేశ పెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది. ఇహ ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక పెళ్లి సమయంలో అగ్ని సాక్షిగా కన్యని వరుడికి అప్పగిస్తారు. చంద్రసాక్షిగా గంధర్వుడూ, గంధర్వసాక్షిగా అగ్నిఈమెను రక్షించగా, అగ్నిసాక్షిగా వరుడు గ్రహిస్తాడు. 


ఋగ్వేదంలోని ప్రథమ మండలంలో ప్రథమసూక్తం అగ్నిసూక్తం. అగ్నిమీళేపురోహితం అనేది ప్రథమ మంత్రం.  నిరాకార బ్రహ్మ జ్యోతి (అగ్ని) స్వరూపం. ఆ బ్రహ్మం సాకారమయితే ఆ సాకార దేవతారూపాలు అగ్నిరూపాలే. సృష్ఠిలో మనకు ఏదైనా గోచరం కావలనంటే దానికి కావాల్సిన రూపం ఇచ్చేది అగ్ని. మన దేహంలో జఠరాగ్ని, కంటిలో ప్రకాశం, శరీరంలో ఉష్ణత్వం, సూర్యుడు, నక్షత్రాలు, జ్ఞానాగ్ని, వనాగ్ని అంటూ సమస్తం అగ్నిమయం. క్రోధాగ్ని, కామగ్ని, తపోగ్ని... ఇలా సర్వం అగ్నిమయం జగత్. ఈశ్వరుని బ్రహ్మజ్యోతి స్వరూపంచ అని అన్నారు. మహోన్నతమయి సర్వత్రా నిండిన జ్యోతి (అగ్ని) స్వరూపుడన్నది స్పష్టమవుతోంది కదా. అందుకే అగ్నికి అంత పవిత్రత.