ksheerabdi dwadasi 2023 Date and Time:  కార్తీకమాసంలో నెలంతా అత్యంత పవిత్రమైనదే... మరీ ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ ఈ ఐదు రోజులు మరింత విశేషమైనవి అని చెబుతారు పండితులు.  కార్తీక శుద్ద ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్రనుంచి మేల్కొంటాడు..అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఆ మర్నాడు వచ్చే ద్వాదశిని చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ రోజు శ్రీ మహాలక్ష్మితో కలసి భూలోకానికి వస్తాడట. అందుకే శ్రీ మహావిష్ణువు కొలువైన ఉసిరికి...శ్రీ మహాలక్ష్మి ఉండే తులసికి కళ్యాణం జరిపిస్తారు. 


శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వివాహం
వాసుకుని తాడుగానూ, మందర పర్వతాన్ని కవ్వంగానూ చేసుకుని ఈరోజునే రాక్షసులు, దేవతలు కలిసి క్షీరసాగరాన్ని చిలికారు. కాబట్టి చిలుకు ద్వాదశి అని పిలుస్తుంటారు. అలాకే క్షీరసాగరానికి గుర్తుగా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా  అంటారు. పాలకడలి నుంచి వచ్చిన శ్రీమహాలక్ష్మి ఈ రోజు శ్రీ మహా విష్ణువును వివాహం చేసుకుంటుంది. అందుకే లక్ష్మీదేవిని క్షీరాబ్ది కన్యక అంటారు. అందుకు గుర్తుగా కూడా ఈరోజును క్షీరాబ్ది ద్వాదశి అని చెబుతాం. ఆషాఢ శుద్ద ఏకాదశి రోజున ప్రారంభించి కార్తీక శుద్ద ద్వాదశి రోజు వరకు చాతుర్మాస్య దీక్షను చేస్తారు. ఈరోజున దీక్ష విరమిస్తారు కాబట్టి ఈ పవిత్ర తిథిని యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు.


Also Read: కార్తీకమాసంలో పాటించే ఈ నియమం శారీరక, మానసిక ఔషధం!


క్షీరాబ్ధి ద్వాదశి విశిష్టత గురించి భాగవతంలో అంబరీషుడి కథతో పాటూ కార్తీకపురాణంలో ప్రస్తావన ఉంది. 


అంబరీషుడి కథ
భక్త ప్రహ్లాదుడిలాగానే అంబరీషుడు కూడా శ్రీమహా విష్ణుకి ప్రియమైన భక్తుడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన నభగ మహారాజు కుమారుడు. నిత్యం హరినామస్మరణలో మునిగితేలే అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. ద్వాదశి వ్రతం అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి ఘడియలు దాటిపోయే లోగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాము తినాలి. ఇలా ఓ సారి ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న అంబరీషుడు భోజనం చేసే సమయానికి దూర్వాస మహర్షి అక్కడకు వస్తాడు. భోజన సమయానికి వచ్చిన మహర్షులను విడిచిపెట్టి తాను భుజించడం సరికాదని తెలిసి ఆయన్ని భోజనానికి ఆహ్వానిస్తాడు. అయితే తాను వచ్చేవరకూ వేచి ఉండమని చెప్పి నదికి స్నానమాచరించేందుకు వెళ్లిపోతాడు దూర్వాసుడు.  ద్వాదశ ఘడియలు ముగిసిపోతున్నా దూర్వాసుడు తిరిగి రాడు..ఆయన్ని విడిచిపెట్టి భోజనం చేస్తే ఆగ్రహానికి గురికాక తప్పదు..ద్వాదశి ముగిసిపోయాక భోజనం చేస్తే ఉపవాస ఫలితం దక్కదు. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో అంబరీషుడు తన కులగురువైన వశిష్టుడి సలహామేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసీ నీళ్లు తాగి దీక్ష విరిమిస్తాడు.


Also Read: అయ్యప్ప మండల దీక్ష తర్వాత మాలధారుల్లో రావాల్సిన మార్పులివే!


అంబరీషుడి శాపాన్ని తీసుకున్న శ్రీ మహావిష్ణువు
అప్పుడే స్నానమాచరించి వచ్చిన దూర్వాసుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహిస్తాడు. పదిరకాల జన్మలనెత్తమని  అంబరీషుడిని శపిస్తాడు.  అప్పటికప్పుడే ఒక రాక్షసుడిని సృష్టించి అంబరీషుడిని సంహరించమంటాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా మారి అంబరీషుడి ఎదుట నిలవగానే  భయంతో శ్రీహరిని ప్రార్థిస్తాడు.అంబరీషుడిని కరుణించిన శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు. రాక్షసుడిని సంహరించిన అనంతరం ఆ సుదర్శన చక్రం దూర్వాసుడిని వెంబడిస్తుంది. ఆ చక్రం బారినుంచి కాపాడుకునేందుకు అన్ని లోకాలకు వెళ్లిన దూర్వాసుడు మహా విష్ణువుని కూడా శరణువేడతాడు. కానీ ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బందీ కాబట్టి ఏమీ చేయలేనని అంబరీషుడినే శరణువేడుకోమంటాడు. చివరికి దుర్వాసుడు వెళ్లి అంబరీషుడిని శరణు వేడుతాడు. దాంతో ఆయన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని, ఆ దివ్య చక్రాన్ని స్తుతిస్తూ వేడుకుంటాడు. ఇలా దుర్వాసుడిని రక్షిస్తాడు అంబరీషుడు. అలాగే దుర్వాసుడు ఇచ్చిన శాపాన్ని, అవసరం వచ్చినప్పుడు పది అవతారాలుగా లోకరక్షణకోసం తాను అనుభవిస్తానని శ్రీమహావిష్ణువు. దీనివల్ల భక్తులకు పరమాత్మ ఎప్పుడూ బంధీనే అనే అంశం మనకు స్పష్టమవుతుంది. ఇలా ఎవరైతే ఈ ద్వాదశి రోజున ఈ కథను విన్నా, లేక చదివినా అనేక పాపాలు నశించి, పుణ్యఫలం కలుగుతుందని కార్తీక పురాణంలో ఉంది. 


Also Read: ఈ 6 రాశులవారు ఏ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే!