హిందుత్వం ప్రకృతిలోని ప్రతి అంశాన్ని దైవంగా పూజిస్తుంది. సనాతన ధర్మం పంచభూతారాధనను విశ్వసిస్తుంది. నదీ నదాలు, పర్వతాలు, పంటలు, వనాలు అన్నీ కూడా దైవంగా పూజిస్తారు. ముఖ్యంగా నదులు పూజనీయమైనవి. అందుకే మన దేశంలోని ప్రతి నదీ తీరాన తప్పకుండా ఒక పుణ్య క్షేత్రం వెలసింది. అవి అన్నీ మంచి ప్రాశస్థ్యాన్ని కూడా పొందాయి. పుణ్య నదుల్లో ముందుండే నది గంగా నది. గంగ ఒక జీవనది. ఇది పాప విమోచిని గా పేరుగాంచింది. ఒక్కసారి గంగా స్నానం ఆచరించిన వారి సకల పాపాలు హరించిపోతాయని నమ్మకం. గంగా నది కి రకరకాల పేర్లతో ప్రసిద్ధి పొందింది. వాటిలో ముఖ్యమైంది భాగీరథి. భాగీరధుడి పేరుతో ఈ పేరు వచ్చింది. భరత వంశ పూర్వీకుల ఆత్మప్రక్షాళనతో పాటు ఈ నేలను పూనితం చేయడానికి గంగా నదిని భూమి మీదకు రప్పించిన రాజు భగీరథుడు ఆయన పేరుతో గంగా దేవిని భాగీరథీ అని పేరువచ్చింది.


గంగ కేవలం ఒక నది మాత్రమే అనుకుంటే పొరపాటే. గంగా నధి తల్లివంటిది. కేవలం పాపవిమోచన మాత్రమే కాదు తన ప్రవాహం సాగే ప్రతి అణువును సారవంతం చేస్తూ సాగుతుంటుంది. అటువంటి గంగా మాత భూమి మీద అవతరించిన తరుణాన్ని గంగావతరణ లేదా గంగా దసరా అని ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం గంగా దశరా సందర్బంగా భారతావనిని పాండమిక్ నుంచి బయటపడేసి ఆయురారోగ్యాలు ప్రసాధించమని వేడుకుంటున్నారు. గంగా ఆర్తి చూసేందుకు చాలా అందమైన సంప్రదాయం. దీనికి ముందు భారత ప్రభుత్వం నమామి గంగే పేరుతో గంగా ఘాట్ శుభ్రపరిచే ప్రాజెక్ట్ ద్వారా గంగాతీరం మరింత శోభాయమానంగా మారింది. జ్యేష్ట మాసంలోని శుక్లపంలోని పదో రోజు అంటే దశమి రోజున హస్తా నక్షత్రాన గంగా దేవి దివి నుంచి భువికి దిగి వచ్చిందని ప్రతీతి. ఈ సారి ఆరోజు మే 30 తేది మంగళ వారం రోజున వస్తోంది. ఈరోజున గంగాస్నానం చేసి తర్వాత అన్నదానం, వస్త్ర దానం వంటి దానాలు చేసి ఉపవాసం ఉంటే కనీసం 10 రకాల పాపాల నుంచి విముక్తి పొందవచ్చు.


Also read: ఈ విగ్రహాలు ఇంట్లో అలంకరిస్తే అదృష్టం మీ వెంటే


గంగావతరణ వెనుక చరిత్ర


మహారాజ సాగర ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టినపుడు దానికి ఆయన కుమారుడు అన్షుమన్ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దేవరాజు ఇంద్రుడు సాగరుడు మృత్యుంజయుడుగా మారితే తన పదవికి ప్రమాదంగా మారుతుందని భావించి యజ్ఞానికి అంతరాయం కలిగించేందుకు యజ్ఞాశ్వాన్ని దొంగిలించి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడు. ఆరవై వేల మంది సోదరులతో వెతికినా కూడా ఆ అశ్వాన్ని అన్షుమన్ దాని ఆచూకి కనిపెట్ట లేకపోయాడు. పాతాళంలో వెతికే ప్రయత్నం చేస్తున్న సమయంలో కపిల మహర్షి ఆశ్రమంలో ఆయన తపస్సులో ఉండగా యజ్ఞాశ్వం అక్కడే గడ్డి మేస్తూ కనిపించింది. అది చూసిన అన్షుమన్ సోదరులు అందరూ కలిసి తపస్సులో ఉన్న కపిల మహర్షి ఆ యజ్ఞాశ్వాన్ని దొంగిలించాడని భావించి ఆయనను దూషించడం ప్రారంభించారు. ఆయనకు తపోభంగం కలిగి కోపంతో అందరిని తన తపశ్శక్తితో బూడిద చేస్తాడు. తన మిగిలిన సంతానం గురించి కనుక్కొని రమ్మని అన్షుమన్ ను కూడా పంపుతాడు.


కపిల మహర్షి ఆశ్రమంలో జరిగిన విషయం తెలుసుకుని తన శాపగ్రస్తులై మరణించిన తన  సోదరుల భస్మం ఇప్పటికి ఇంకా నదీ నిమజ్జనం జరగలేదు కనుక వారికి ముక్తి లభించలేదని తెలుసుకుని వారికి ముక్తి లభించాలంటే సత్యలోకంలోని గంగలో ఆ భస్మ నిమజ్జనం జరగాలని తెలుసుకుని  సాగర మహారాజు, అన్షుమన్, దిలీపుడు గంగను భువికి రప్పించేందుకు చేసిన తపస్సు ఫలించలేదు. దిలీపుడి కుమారుడు భాగీరథుడు తన పూర్వీకులకు మోక్షం అందించేందుకు గంగను భువికి రప్పించేందుకు తపస్సు చేసి బ్రహ్మ కమండలం నుంచి గంగను వదిలేందుకు తాను అంగీకరిస్తాడు కానీ గంగ శక్తిని భూమి భరించలేదని హెచ్చరిస్తాడు. అప్పుడు తిరిగి శివ తపస్సు ప్రారంభించి శివుడిని ప్రసన్నం చేసుకుని ఆ గంగను భరించాలని కోరతాడు. శివుడు తన జటాజూటాలలో గంగను బంధించి కొద్ది మొత్తంలో గంగను భూమి మీదకు తన పూర్వీకుల భస్మం మీదుగా ప్రవహింప జేసి వారికి ముక్తిని ప్రసాధించాలని గంగాదేవిని కోరుకున్నాడు. ఆమె అతడి కోరికను మన్నించి పూర్వీకులకు మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా తాను ఆచంద్ర తారార్కం భాగీరథిగా ప్రసిద్ధికెక్కుతాను వరం ప్రసాధించింది.


జేష్ట మాస శుక్లపక్ష దశమి భూమి మీదకు గంగా వతరణ జరిగిన రోజు. ఈ రోజునే గంగా దసరా గా జరుపుతారు. గంగా స్నానానకి ఈ రోజు చాలా పవిత్రత ఉంటుంది. ఈ నెల 29 నుంచి 5 రోజుల వరకు హరిద్వార్ లో మేళా జరుగుతుంది. పాండమిక్ ఉండడం వల్ల ఇక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.