Siddaramaiah: కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణలు చేసింది. ఎన్నడూ లేని విధంగా కర్ణాటక సర్కారులోని పెద్దలు కుంభకోణాలకు పాల్పడ్డారని, కోట్లాది రూపాయల కన్నడ ప్రజల సంపదను దోచుకున్నారని కాంగ్రెస్ నాయకులు బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. 40 శాతం కమీషన్ ఇస్తే పనులు ఈజీగా జరుగుతాయని ఎన్నికల అస్త్రంగా వాడిన కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలోకి వచ్చింది. వాళ్లు చెప్పినట్లుగానే కర్ణాటకలో బీజేపీ అవినీతి ఆరోపణలపై విచారణ చేయిస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారు. అందులో భాగంగానే తాజాగా కర్ణాటకలోకి కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 


బీజేపీ ప్రభుత్వ హయాంలో కళ్యాణ కర్ణాటక రీజియన్ డెవలప్‌మెంట్ బోర్డు(KKRDB) అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ నేత, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చేసిన ఫిర్యాదు మేరకు సిద్ధరామయ్య దర్యాప్తుకు ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఖర్గే తెలిపారు. 






'కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కళ్యాణ కర్ణాటక రీజియన్ డెవలప్‌మెంట్ బోర్డు నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశించారు. బీజేపీ రహస్య అజెండాను నెరవేర్చడానికి అలాగే వారి సొంత ఎమ్మెల్యేల కోసం కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేశారు. గతంలో హామీ ఇచ్చినట్లుగా, కేకేఆర్డీబీ పై సమగ్ర విచారణ జరిపి దోషులపై కేసులు నమోదు చేస్తాం' అని ప్రియాంక్ ఖర్గే తెలిపారు.






'కళ్యాణ కర్ణాటక(KKRDB)లోనే కాదు ఇంకా చాలా మోసాలు జరిగాయి. న్యాయం జరిగాలంటే అన్ని స్కామ్ లపై విచారణ జరగాలి' అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. 


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఇంటిలిజెన్స్‌ విభాగమూ సిద్దరామయ్యకే కేటాయించారు. ఇక ముఖ్యమంత్రి రేసులో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించిన జి పరమేశ్వరకు మంచి పదవే కట్టబెట్టారు. హోం మంత్రి బాధ్యతలు అప్పగించారు. డిప్యుటీ సీఎం డీకే శివ కుమార్‌కి భారీ, మధ్య తరహా నీటిపారుదల శాఖను కేటాయించారు. దీంతో పాటు బెంగళూరు సిటీ డెవలప్‌మెంట్ బాధ్యతలూ ఇచ్చారు. హెచ్‌కే పాటిల్‌ లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాలు, దినేశ్ గుండు రావ్‌కి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కృష్ణ బైరె గౌడకు రెవెన్యూ శాఖలు కేటాయించారు. కర్ణాటక ప్రభుత్వంలో మొత్తం 34 మంది మంత్రులు ఉంటారు. గత వారమే 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లిస్ట్‌ని ఫైనలైజ్ చేసే ముందు సిద్దరామయ్య, డీకే శివ కుమార్‌ హైకమాండ్‌తో విస్తృత చర్చలు జరిపారు.