₹2000 Note deposited in SBI: 2000 రూపాయల నోట్లను చలామణీ నుంచి వెనక్కు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ నెల 23 నుంచి పింక్‌ కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, మార్చుకోవడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు సమీపంలోని బ్యాంక్‌ బ్రాంచ్‌లకు వెళ్లి పెద్ద నోట్లను చిన్న నోట్లలోకి మార్చుకుంటున్నారు లేదా తమ బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తున్నారు. 


దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ రుణదాత అయిన స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), రూ. 2 వేల నోట్ల డిపాజిట్లు గురించి ఒక ప్రకటన చేసింది. ఈ నెల 23 నుంచి, ఈ ఏడు రోజుల్లో ఎంత విలువైన 2000 రూపాయల నోట్లను ప్రజలు డిపాజిట్‌ చేశారన్న వివరాలను బ్యాంకు వెల్లడించింది.


రూ.14 వేల కోట్ల విలువైన నోట్లు జమ
ఎస్‌బీఐకి చెందిన అన్ని శాఖలు, డిపాజిట్ మెషీన్‌ల ద్వారా, ఇప్పటి వరకు, 14 వేల కోట్ల (1,40,00,00,00,000) రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లు జమ అయ్యాయి. వీటిని విలువలో కాకుండా నంబర్‌లో రూపంలో చెప్పుకుంటే, ఇప్పటి వరకు 7 కోట్ల (7,00,00,000) నోట్లను ప్రజలు డిపాజిట్‌ చేశారు. స్టేట్‌ బ్యాంక్‌ చైర్మన్ దినేష్ కుమార ఖరా ఈ విషయాన్ని వెల్లడించారు. 


రూ. 3 వేల కోట్ల విలువైన నోట్లు మార్పిడి
కేవలం నోట్ల మార్పిడి వరకే చూసుకుంటే, ఈ ఏడు రోజుల్లో, అన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ల ద్వారా దాదాపు రూ. 3000 కోట్ల విలువైన నోట్లను ప్రజలు మార్చుకున్నారు. దీనిని కూడా నంబర్‌ రూపంలో చెప్పుకుంటే, ఇప్పటి వరకు ఒక కోటి 50 లక్షల పెద్ద నోట్లను (1,50,00,000) చిన్న నోట్ల రూపంలోకి మార్పిడి చేసుకున్నారు. మార్కెట్‌లో చలమణీలో ఉన్న మొత్తం రూ. 2000 నోట్లలో 20 శాతం నోట్లు స్టేట్‌ బ్యాంక్‌ వద్దకు వచ్చాయని ఖరా వెల్లడించారు.


రూ. 2 వేల నోట్లు లీగర్‌ టెండర్‌గా ఉంటాయి
రూ. 2,000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఈ నెల 19వ తేదీన రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ప్రజలు దాచుకున్న నోట్లను మార్చుకోవడానికి లేదా బ్యాంక్‌ ఖాతాల్లో డిపాజిట్‌ చేయడానికి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఒక లావాదేవీలో గరిష్టంగా 10 పెద్ద నోట్లు లేదా రూ. 20,000 వరకు మార్చుకోవడానికి వీలుంటుంది. నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫారం నింపాల్సిన పని లేదు, గుర్తింపు కార్డు చూపాల్సిన అవసరం లేదు. నోట్లు మార్చుకోవడానికి ఎన్నిసార్లయినా క్యూలో వెళ్లవచ్చు. నోట్లు మార్చుకోవడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. తమ ఖాతాల్లో రూ. 2000 నోట్లను జమ చేయడానికి ఎటువంటి పరిమితిని RBI విధించలేదు. ఆ ఖాతాపై ప్రస్తుతం అమల్లో ఉన్న KYC నిబంధనలే రూ, 2000 నోట్ల జమకూ వర్తిస్తాయి.


పింక్‌ కరెన్సీ నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఉపసంహరించుకుంది తప్ప రద్దు చేయలేదు. కాబట్టి, ఇప్పటికీ రూ. 2000 నోట్లు చట్టబద్ధమైన కరెన్సీగానే కొనసాగుతాయి. వాటిని బ్యాంక్‌ల్లో డిపాజిట్‌ చేయడంతో పాటు, అన్ని రకాల లావాదేవీల కోసం ప్రజలు ఉపయోగించవచ్చు. రూ. 2 వేల నోట్ల ద్వారా కొనుగోళ్లు, అమ్మకాలు, చెల్లింపులు చేయవచ్చు. రూ. 2000 నోట్లను ఇకపై జారీ చేయవద్దని అన్ని బ్యాంకులను సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది.


పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన రూ. 2000 నోట్లు
2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, మార్కెట్‌లో ఒక్కసారిగా తలెత్తిన కరెన్సీ నోట్ల లోటు భర్తీ చేయడానికి రూ. 2000 నోటును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదే సమయంలో రూ. 2000 నోట్లతో పాటు రూ. 500, రూ. 200 నోట్లను కూడా విడుదల చేసింది.


మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: కన్సాలిడేషన్‌ గోడను బద్ధలు కొట్టిన PSU స్టాక్స్‌, మల్టీబ్యాగర్స్‌గా మారే ఛాన్స్‌!