Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు మనీష్ సిసోడియాపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా పేర్కొంది. అయితే మనీష్ సిసోడియా మాత్రం ఢిల్లీ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. వాస్తవానికి దిగువ కోర్టు నిర్ణయాన్ని ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా సవాలు చేశారు. దానిపై ఢిల్లీ హైకోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసింది. సిసోడియా పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు సాక్ష్యాధారాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో మనీష్ సిసోడియా తీరు సరికాదని ధర్మాసనం పేర్కొంది. వారు సాక్ష్యాలను ప్రభావితం చేే అవకాశం ఉన్నందున బెయిల్ ఇవ్వడం లేదని వివరించింది. 






మనీష్ సిసోడియా మద్యం కుంభకోణం కేసులో నిందితుడుగా ఉన్నాడు. ఫిబ్రవరి నెల నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. జస్టిస్ దినేష్ శర్మ.. సిసోడియా అభ్యర్థనను తిరస్కరిస్తూ, అతను ప్రభావవంతమైన పదవిలో ఉన్నాడని, సాక్ష్యాలను తారుమారు చేయగల అవకాశాలు ఎక్కువగా ఉన్నందున బెయిల్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. గత విచారణలో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయాలనే అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది. ఆ తర్వాత ఈ కేసులో తీర్పును మే 11న కోర్టు రిజర్వ్ చేసింది.