Chhattisgarh News: మంచి పదవిలో ఉన్నాడు. ఆఫీసర్ గా పని చేస్తూ.. అందరికీ సాయంగా నిలవాల్సిన అతను చేసిన ఓ పనికి తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. ఇటీవలే రిజర్వాయర్ సందర్శనకు వెళ్లగా.. సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆయన ఫోన్ ప్రమాదవశాత్తు రిజర్వాయర్ లో పడిపోయింది. లక్ష రూపాయల విలువ చేసే ఫోన్ అనుకుంటూ.. రిజర్వాయర్ లోని నీటిని తోడేయించాడా ఆఫీసర్. ముందుగా గజ ఈతగాళ్లను రంగంలోకి దింపించి వెతికించగా దొరకలేదు. దీంతో ఈ పని చేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న పై అధికారులు అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే వృథా చేసిన నీటికి అతడి జీతం నుంచి డబ్బులు వసూలు చేసేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. 


అసలేం జరిగిందంటే?


ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో.. రాజేశ్ విశ్వాస్ అనే వ్యక్తి ఫుడ్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. అతడు ఇటీవలే స్థానికంగా ఉన్న ఖేర్ కట్టా డ్యామ్ సంద్రశనకు వచ్చాడు. ఈక్రమంలోనే సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడి ఓవర్ ఫ్లో ట్యాంక్ నీటిలో ఆయన ఫోన్ పడిపోయింది. లక్ష రూపాయల విలువ చేసే ఫోన్ కావడం, అందులో అధికారిక సమాచారం ఉందని తెలపడంతో దాన్ని కనిపెట్టేందుకు తొలుగ స్థానిక గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. వాళ్లు చాలా సేపు వెతికినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ విషయంపై జన వనరుల విభాగం అధికారికి మౌఖఇకంగా సమాచారం ఇచ్చాడు రాజేశ్ విశ్వాస్. నీళ్లను తోడైనా సరే తన ఫోన్ తనకు ఇవ్వాలని కోరాడు. ఇందుకు అంగీకరించిన జనవనరుల శాఖ అధికారులు.. భారీ మోటార్లతో నీళ్లను ఖాళీ చేయించడం ప్రారంభించారు. సోమవారం నుంచి గురువారం వరకు అంటే మూడ్రోజుల పాటు దాదాపు 41 లక్షల లీటర్ల నీళ్లను బయటకు తోడేశారు. ఫోన్ ను అధికారికి అప్పగించారు. 






అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రజలు నీటి వృథాపై తీవ్ర విమర్శలు చేశారు. ఫోన్ కోసం ఇన్ని నీళ్లు పాడు చేయడం దారుణం అంటూ ట్రోల్స్ చేశారు. తోడేసిన నీటితో 1500 ఎకరాల సాగునీటి అవసరాలు తీరుతాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రజలంతా నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే... ఈ స్థాయిలో నీళ్లు వృథా చేయడం సరికాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన జలవనరుల శాఖ పై అధికారులు చర్యలు తీసుకున్నారు. విచారణ చేపట్టి మరీ రాజేశ్ విశ్వాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే అతడి వద్ద నుంచి డబ్బు వసూలు చేసే విషయమై ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్... జనవనరుల శాఖ ఎస్డీఓ రాంలాల్ దివర్(నీళ్లు తోడేందుకు అనుమతి ఇచ్చిన అధికారి)కి లేఖ రాశారు. ఆ రిజర్వాయర్ నీరు వ్యవసాయానికి, వేసవిలో ఇతర అవసరాలకు వినియోగిస్తారని చెప్పారు.


రాష్ట్ర ప్రజల అవసరాలకు వాడే ఆ నీటిని వృథా చేసినందుకు... దానికి విలువ కట్టి డబ్బులు వసూలు చేయాలని సూచించారు. అయితే కొంత మేర నీళ్లు తోడేందుకు మాత్రమే తాము అనుమతి ఇవ్వగా పెద్ద మొత్తంలో నీళ్లు తోడారని రాంలాల్ దివర్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. మూడ్రోజుల పాటు కష్టపడి అన్ని నీళ్లో వృథా చేసిన పోన్ తీసినప్పటికీ... అది పూర్తిగా నానిపోవడంతో పని చేయడం లేదని సమాచారం.