Dwadasa Jyotirlinga Temples: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలివే
సోమనాథ్ -గుజరాత్
గుజరాత్ సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న శ్రీకృష్ణుడు తన లీలతో వెలిగించిన దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉండటం ఇక్కడి ప్రత్యేకత అని చెబుతారు. ఆ ఆలయంలో ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. చంద్రుడే స్వయంగా సోమనాథుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ
మల్లికార్జున స్వామి-శ్రీశైలం
పరమేశ్వరుడు గౌరీదేవితో కలిసి శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిసిన క్షేత్రం శ్రీశైలం. భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అనే మాట విని వెళ్లిన కుమారస్వామికి ప్రతిచోటా ముందుగా వినాయకుడే కనిపిస్తాడు. పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పడంతో అలిగిన కుమారస్వామి క్రౌంచ పర్వతంపైకి వెళ్లి కార్తీకేయుడిగా వెలిశాడు. ఇదంతా తన తప్పిదం వల్లే అని తెలుసుకున్న నందీశ్వరుడు శ్రీశైల శిఖరం వద్ద తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లిఖార్జునులుగా వెలిశారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేయి లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన అయిదు లింగాలు ఇక్కడ దర్శించుకోవచ్చు.
Also Read: కలిపురుషుడికి - కార్తీక వనభోజనాలకి - ఉసిరిచెట్టుకి లింకేంటి!
మహాకాళేశ్వర్- ఉజ్జయినీ
మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో శ్రీ మహా కాళేశ్వరాలయం ఉంది. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్రయంత్రం తిరగేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి ప్రాతఃకాలం భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు
ఓంకారేశ్వర్ -మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ లో నర్మదా నది తీరంలో కొలువయ్యాడు ఓంకారేశ్వరుడు. ఇక్కడున్న అమ్మవారు అన్నపూర్ణదేవి. సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర లింగం , అమలేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం.
Also Read: కార్తీక మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు!
వైద్యనాథ్- మహరాష్ట్ర
ఈ జోతిర్లింగం పాట్నా నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కంతిపూర్ దగ్గర శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి బ్యాక్ డ్రాప్ కూడా రావణాసుర కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే సకల వ్యాధులు నయం అవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే అమృతేశ్వరుడు అని పిలుస్తారు.
శ్రీనాగనాథేశ్వర-మహారాష్ట్ర
మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉంది శ్రీనాగనాథేశ్వర ఆలయం. ఇది భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా చెబుతారు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకావనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినపుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్నకాపాలికులు వారిని తరిమికొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి.
రామేశ్వరం- తమిళనాడు
రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులో రామేశ్వరంలో ఉంది. రావణవధ అనంతరం శ్రీరామచంద్రుడు సేతువును దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మ హత్యాపాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమంతుడిని ఆజ్ఞాపిస్తాడు. సుముహూర్త సమయం దాటిపోతుండడంతో సీతాదేవి సముద్రతీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుక లింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి.
Also Read: కార్తీక పూర్ణిమ ఎందుకు ప్రత్యేకం - ఈ రోజు దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే
కేదార్నాథ్ జోతిర్లింగం- ఉత్తరాంచల్
ఎద్దుమూపుర ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. ఈ ఆలయాన్ని ఏడాదికి 6నెలలు మాత్రమే తెరుస్తారు. శ్రీ మహా విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కల్యాణార్థం ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ ప్రచారంలో ఉంది. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి.
త్రయంబకేశ్వర్- మహారాష్ట్ర నాసిక్
మహారాష్ట్ర నాసిక్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వరాలయం ఉంది. ఇక్కడి శివలింగము చిన్న గుంటవలె కనిపిస్తూ అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న లింగాలు కనిపిస్తాయి
భీమశంకరం- మహారాష్ట్ర
మహారాష్ట్ర సహ్యాద్రి పర్వతఘాట్‌లో కృష్ణా ఉపనది భీమ నది ఒడ్డున వెలిసింది భీమశంకరం. త్రిపురాసుర సంహారం తర్వాత శివుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది అని చెబుతారు. ఈ జ్యోతిర్లింగం అర్థనాథేశ్వర రూపంలో భక్తులు కోర్కెలు తీర్చేదిగా ప్రసిద్ది. ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఓ ప్రత్యేకత. శివుని రౌద్రరూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమనదిగా మారిందని స్థల పురాణం.
విశ్వేశర జోతిర్లింగం-వారణాసి
దేవతలు నివసించే పుణ్యక్షేత్రం అని చెప్పే కాశీలో కొలువైంది విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి.
ఘృష్ణేశ్వరం- మహారాష్ట్ర
మహారాష్ట్ర ఔరంగబాద్ లో ఉంది శ్రీ ఘృష్ణేశ్వర జోతిర్లింగం. అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది.
ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకం
సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ |
ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ||
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ |
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ||
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే |
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ||