Telangana Election News: సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నె శిరీష అలియస్ బర్రెలక్కకు మద్దతు పెరుగుతోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శిరీష పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఎన్నికల ప్రచారం కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు శనివారం రూ.లక్ష విరాళం పంపించారు. ఈ సందర్భంగా ఆమెకు తన అభినందనలు తెలిపారు. 






కులమతాలకు అతీతంగా యువత ఎన్నికల్లో పోటీ చేయాలని, డబ్బు, కానుకల ప్రభావం లేకుండా గెలవాలని ఆకాంక్షించారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువత సహకారంతో ఆమెను గెలిపించాలని కోరారు. ఫలితం ఎలా వచ్చినా.. నిరుత్సాహపడొద్దని, బీఈడీ వంటి కోర్సులు చదువుకోవాలని, పోటీ పరీక్షలకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే శిరీషకు తాను అండగా ఉంటానన్నారు. సోషల్‌ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే శిరీష అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీకాం డిగ్రీ చేసింది. చదువుకున్నా ఉద్యోగం రాకపోవడంతో గేదెలు కాస్తుండటంతో బర్రెలక్కగా పేరుపొందింది.  


రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో వైరల్
బర్నె శిరీష అలియాస్ బర్రెలక్క రెండేళ్ల కిందట సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యారు. డిగ్రీ చదివి తాను బర్రెలు కాసుకుంటున్నానంటూ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ‘హాయ్ ఫ్రెండ్స్.. నేను మీ బర్రెలక్కను డిగ్రీ చేశాను. ఫ్రెండ్స్ ఉద్యోగ నోటిఫికేషన్ లేక మా అమ్మను అడగి బర్రెలు కొన్నాను ఫ్రెండ్స్. ఎన్ని డిగ్రీలు చేసిన సర్టిఫికేట్లు వస్తున్నాయి తప్ప ఉద్యోగాలు వస్తలేవు ఫ్రెండ్స్.. బై బై ఫ్రెండ్స్’ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ తరువాత ఆమె సామాజిక మాధ్యమాల్లో బర్రెలక్కగా పేరుపొందింది. 






తాజా ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వత్రంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ మేరకు కొల్లాపూర్(నాగర్‌ కర్నూల్‌) నియోజకవర్గం నుంచి నామినేషన్‌ వేశారు. నిరుద్యోగుల తరపున పోరాడటం కోసమే తాను పోటీ చేస్తున్నానని ఈ సందర్భంగా శిరీష ప్రకటించారు. ప్రజలకు ఇవ్వడానికి తన దగ్గర డబ్బు లేదని ప్రచారం చేయడానికి అంత సమయం లేదని అందరిని కలవకపోవచ్చని, తనను గెలిపించాలంటూ సోషల్ మీడియాలో వీడియోలో కోరారు. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే  పుద్దుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు శనివారం రూ.లక్ష విరాళం అందించారు. 


గుర్తు కేటాయించిన ఈసీ
సోషల్ మీడియాలో వైరల్ అయ్యి పోటీ చేసిన శిరీషకు ఎన్నికల కమిషన్ గుర్తు కేటాయించింది. ఈల గుర్తు శిరీష కోసం కేటాయించింది. ఈ సందర్భంగా శిరీష సోషల్ మీడియా ద్వారా గుర్తు గురించి వివరించారు. ఎన్నికల కమిషన్ గుర్తు కేటాయించిందని, విజిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. తన నామినేషన్ ఉపసంహరణకు ఎంతో వత్తిడి తెచ్చారని, కానీ వాటికి లొంగకుండా బరిలో నిలిచినట్లు చెప్పారు. విజిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.