Kamika Ekadashi 2024 Date:  ఆషాఢం పౌర్ణమి తర్వాత అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని  కామిక ఏకాదశి అంటారు. పేరుకు తగ్గట్టే మనసులో కోర్కెలు తీర్చే శక్తి ఈ ఏకాదశికి ఉందని భావిస్తారు, శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన తర్వాత మొదటగా వచ్చే ఏకాదశి కావడంతో దీనిని అత్యంత విశేషంగా పరిగణిస్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం, తులసీదళాలతో పూజ చేయడం అత్యంత ప్రత్యేకం. 


కామిక ఏకాదశి మహత్యం 


ధర్మవర్తనుడైన ధర్మరాజు..శ్రీ కృష్ణుడిని అడిగి తెలుసుకున్న వ్రతం ఇది. " ఏటా ఆషాఢ మాసములో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి మహిమ  గురించి వివరించమని" కోరగా...సంతోషించిన వాసుదేవుడు ఇలా చెప్పాడు. ఓసారి నారదుడు...బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు.  ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి, ఆ రోజుకు అధిదేవత ఎవరు, వ్రతాన్ని ఎలా ఆచరించాలి, విధి విధానాలేంటని అడిగాడు.దానికి బదులిచ్చిన బ్రహ్మదేవుడు...మానవాళి సంక్షేమం కోసం నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నాడు. 


Also Read: శ్రావణమాసంలో ఈ రాశులవారిపై శివుడి అనుగ్రహం - సెప్టెంబరు 03 వరకూ మీకు తిరుగులేదు!


కామిక ఏకాదశి పుణ్యఫలం


ఆషాఢ అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి  నియమాలు పాటించినా, ఏకాదశి కథ విన్నా కానీ అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. కామిక ఏకాదశి రోజ భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగలో స్నానమాచరించిన దానికన్నా , కేథారేశ్వరుడి దర్శన కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానం ఆచరించడం కన్నా...సమస్త భూ మండలాన్ని దానం చేసినదానికన్నా...పుణ్యనదుల్లో స్నానమాచించేదానికన్నా పదిరెట్లు పుణ్యం ఫలం. కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడను గ్రాసంతో కలపి దానం చేస్తే సమస్త దేవతల  ఆశీర్వాదం పొందుతారు. గతంలో చేసిన పాపాలకు భయపడేవారు, పాతభీతితో ఉండేవారు ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు. 
 
తులసి ఆరాధన ప్రత్యేకం


కామిక ఏకాదశి రోజు తులసి ఆకులతో విష్ణువును ఆరాధిస్తే సకలపాపాల నుంచి విముక్తి పొందుతారు. తామరాకును నీటిబొట్టు అంటనట్టే వారిని ఏపాపము అంటుకోదు. ఒక్క తులసి ఆకుతో విష్ణువును పూజించినా చాలు..బంగారం, వెండి దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ రోజున తులసి మొక్కను ఆరాధించినా పాపాలు తొలగిపోతాయి. ఈ రోజు తులసిమొక్క దగ్గర నువ్వుల నూనెతో కానీ, నేతితో కానీ దీపం వెలిగిస్తే   శాశ్వతంగా సూర్యలోకంలో నివసించే అర్హత సాధిస్తారట. ఈ రోజు ఏకాదశి నియమాలు పాటించి, ఉపవాసం ఉండి , శ్రీహరిని పూజించేవారికి బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుందని...బ్రహ్మదేవుడు నారదుడితో చెప్పినట్టు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పారు.  


Also Read: రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, నాగపంచమి సహా 2024 ఆగష్టు నెలలో వచ్చే పండుగలివే..!


కామిక ఏకాదశి వ్రతకథ 


పూర్వం ఓ గ్రామాధికారికి శ్రీ మహావిష్ణువు అంటే అత్యంత భక్తి. కానీ తనంత బలవంతుడు, శక్తివంతుడు లేడనే గర్వం అధికం.  ఓ రోజు ఏదో పనిపై బయటకు వెళ్లిన ఆ గ్రామాధికారి దారిలో ఓ బ్రాహ్మణుడితో గొడవపడ్డాడు. వివాదం ముదిరి తనపై దాడిచేయడంతో ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే మరణించాడు. అది చూసిన ఆ గ్రామాధికారి చలించిపోయాడు. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు. ఈ విషయం గ్రామంలో వ్యాపించడంతో..గ్రామస్తులకు క్షణాపణలు చెప్పి తన చేతిలో మరణించిన బ్రాహ్మణుని అంత్యక్రియలు స్వయంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చాడు. అయితే పండితులంతా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నిరాకరించారు. అప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా కామికా ఏకాదశి వ్రతం ఆచరించమని చెప్పారు. అలా ఈ వ్రతాన్ని ఆచరించి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందాడు ఆ గ్రామాధికారి.


ఏకాదశి ఉపవాసం చేసేవారు సాత్వికాహారం తీసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, నేలపైనే నిద్రించాలి. ద్వాదశి రోజు ఉపవాసం విరమించిన తర్వాత పూజ, దానధర్మాలు చేసి..ఆహారం తీసుకోవాలి.  
Also Read: శ్రావణమాసం ఎప్పటి నుంచి ప్రారంభం - వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది!