Sravana Masam 2024:  చాంద్రమానాన్ని అనుసరించి ఉన్న 12 నెలల్లో ఐదోది, అత్యంత పవిత్రమైనది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణం నక్షత్రంలో సంచరిసంచడం వల్ల శ్రావణం అనే పేరొచ్చింది. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణమాసం పూజలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలతో నెలమొత్తం భక్తితో నిండిపోతుంది. ఆషాఢంలో మొదలయ్యే శక్తి పూజకు కొనసాగింపుగా శ్రావణంలో మరో రూపంలో అమ్మను ఆరాధిస్తారు. పైగా శ్రీ కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడి జన్మ నక్షత్రం శ్రవణం..అందుకే ఈ మాసం అత్యంత విశిష్టమైనది అని భావిస్తారు. ఈ నెలలో చేసే చిన్న కార్యం అయినా అనంతమైన ఫలితాన్నిస్తుందంటారు పెద్దలు. 



  • 2024 శ్రావణమాసం ప్రారంభ తేదీ - ఆగష్టు 05 సోమవారం

  • మొదటి శ్రావణ మంగళవారం - ఆగష్టు 06

  • మొదటి శ్రావణ శుక్రవారం - ఆగష్టు 09

  • రెండో శ్రావణ మంగళవారం - ఆగష్టు 13

  • రెండో శ్రావణ శుక్రవారం , వరలక్ష్మీ వ్రతం - ఆగష్టు 16

  • మూడో శ్రావణ మంగళవారం -ఆగష్టు 20

  • మూడో శ్రావణ శుక్రవారం - ఆగష్టు 23

  • నాలుగో శ్రావణ మంగళవారం -ఆగష్టు 27

  • ఆఖరి శ్రావణ శుక్రవారం - ఆగష్టు 30

  • సెప్టెంబరు 03 మంగళవారం శ్రావణమాసం ఆఖరి రోజు...అమావాస్య..

  • సెప్టెంబరు 04 బుధవారం నుంచి బాధ్రపదమాసం ప్రారంభం....


శ్రావణ సోమవారాలు


దక్షిణాయనంలో అత్యంత ఫలప్రదమైన నెలల్లో శ్రావణం ఒకటి.  శివ, కేశవుల బేధం లేకుండా పూజించే మాసం ఇది. ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైమనవి. సాధారణంగా శివయ్యకు సోమవారాలు ప్రత్యేకం...కార్తీకమాసం, శ్రావణంలో వచ్చే సోమవారాలు మరింత ప్రత్యేకం. ఈనెలలో సోమవారం రోజు రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తే అత్యంత శుభప్రదం అంటారు పండితులు.  ఈ మాసం లో వచ్చే సోమవారాలలో  పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదోతనం కలకాలం నిలుస్తుందని విశ్వసిస్తారు.


Also Read: అన్నవరం ఆలయం కింద అంతస్తులో ఏముంది - ఈ క్షేత్రం గురించి మీకు తెలియని విషయాలివే!


శ్రావణ మంగళవారాలు


శ్రావణ మంగళవారాలు వివాహితులకు అత్యంత ప్రత్యేకం. కొత్తగా పెళ్లైన అమ్మాయిలు ఈ నెలలో మంగళగౌరీ వ్రతం చేసుకుంటే దాంపత్యంలో సుఖసంతోషాలుంటాయని , తామెప్పుడు సుమంగళిగా ఉంటామని విశ్వసిస్తారు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల రోజుల్లో ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తారు.  శ్రీ కృష్ణుడు ద్రౌపదీకి...నారదుడు సావిత్రీదేవికి ఉపదేశించిన వ్రతం ఇది. కొన్ని ప్రాంతాల్లో పెళ్లికాని పిల్లలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 


శ్రావణ శుక్రవారం


శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు. శ్రావణశుక్రవారం రోజు సిరులతల్లిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, భోగభాగ్యాలు కలుగుతాయని, సుమంగళియోగం కలుగుతుందని నమ్మకం. డబ్బు,  భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, సంతోషం, శాంతి, బలం...వీటిని అష్ట శక్తులని అష్టలక్ష్ములుగా పూజిస్తారు.  ఈ శక్తులన్నీ సక్రమంగా ఉన్నప్పుడే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి.  శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన శుక్వారం పూజిస్తే..ఇవన్నీ చేకూరుతాయని శ్రీసూక్తంలో ఉంది. అష్టలక్ష్ములలో ప్రత్యేకమైన వరలక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం రోజు ఆరాధిస్తారు..ప్రాంతాలను బట్టి ఆరాధించే పద్ధతులు మారినా...సకల శుభకరం వరలక్ష్మీ వ్రతం.  


శ్రావణ శనివారం


శ్రీనివాసుడి జన్మ నక్షత్రం శ్రవణం కావడంతో...ఈ నెలలో వచ్చే శనివారాలు శ్రీ వేంకటేశ్వరుడికి మరింత ప్రీతిపాత్రం. ఈ రోజుల్లో వేంకటేశ్వరుడి ఆరాధన ఎంతో పుణ్యప్రదం. మీ ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. శ్రావణ శనివారాలలో ఉపవాసం ఉండి శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన, దేవాలయ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.


Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!