Annavaram Satyanarayana swamy:  ఇంట్లో ఎన్ని శుభకార్యాలు నిర్వహించినా అన్నవరం క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనే ఆలోచన ప్రతి భక్తుడిలో ఉంటుంది. కొత్తగా పెళ్లైన జంట ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కలకాలం సుఖసంతోషాలతో వర్థిల్లుతారని విశ్వాసం. ఈ క్షేత్రం ఎలా వెలిసింది? ఎందుకింత మహిమాన్వితం అయింది? 
 
అన్నవరం ఎలా వెలిసింది?


పురాణ కథనం ప్రకారం..మేరుపర్వతం ఆయన భార్య ఇద్దరూ శ్రీ మహావిష్ణువు భక్తులే. స్వామికోసం తపస్సుచేయగా ఇద్దరు సంతానం కలిగారు. వారే భద్రుడుు, రత్నాకరుడు. వీరిద్దరూ కూడా నిత్యం స్వామివారి సేవలోనే ఉండేవారు. కరుణించిన విష్ణువు...త్రేతాయుగంలో శ్రీరాముడిగా నీ కొండపై కొలువై ఉంటాననే వరమిచ్చాడు. రత్నగిరిగా మారిన రత్నాకరుడిపై త్రిమూర్తులు కొలువయ్యారు. అయితే శతాబ్దాలుగా స్వామివారు  అక్కడ కొలువైనట్టు బయట ప్రపంచానికి తెలియలేదు. ఇక బయటకు రావాలని భావించిన నారాయణుడు ఆ ప్రదేశంలో ఉన్న సంస్థాన జమిందారుకి, మరో విష్ణుభక్తుడికి కలలో కనిపించి తన ఉనికి గురించి చెప్పారు. అలా 1891 ఆగష్టు 6న స్వామివారిని వెతుక్కుంటూ వెళ్లారు. ఆ కొండల్లో ఎంత వెతికినా కనిపించలేదు. అప్పుడు అమ్మవారు వృద్ధురాలి రూపంలో వచ్చి ఓ చెట్టుకిందున్న పుట్టలో వెతకండి అని చెప్పి మాయమైంది. అలా ఆ రూపాన్ని బయటకు తీసుకొచ్చారు..


Also Read:  అశ్వత్థామ శాపం , ఎగిరే గుర్రం ప్లేస్ లో కారు, చిలుక స్థానంలో బుజ్జి..మొత్తం సేమ్ టు సేమ్ దించేసిన నాగ్ అశ్విన్!


యంత్ర ప్రతిష్టాపన తర్వాతే విగ్రహ ప్రతిష్ట


సాధారణంగా ఏ ఆలయంలో అయినా గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించేముందు యంత్ర ప్రతిష్ట చేస్తారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే స్వామివారు స్వయంగా కాశీలో ఉన్న ఓ సిద్ధుడితో తన యంత్రాన్ని గీయించుకుని తెప్పించుకున్నారు. ఆ యంత్రం రత్నగిరికి చేరిన తర్వాతే స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అన్నవరాలు ఇచ్చే స్వామి కాబట్టే అన్నవరం అని పిలుస్తారని చెబుతారు. 


అన్నవరం ఆలయం కింద అంతస్తులో ఏముంది?
 
అన్నవరం ఆలయం రెండు అంతస్తుల్లో ఉంటుంది. పై అంతస్తులో ఓవైపు శివుడు, మరోవైపు అమ్మవారు ఉంటారు. మధ్యలో మీసాలతో సత్యనారాయణుడు ధీరుడిలా కనిపిస్తారు. కింద అంతస్తులో ఉండే పీఠం కిందనే...కాశీ నుంచి సిద్ధుడు తీసుకొచ్చి ఇచ్చిన యంత్రాన్ని ప్రతిష్టించారు. అక్కడ లింగాకారం కనిపిస్తూనే పైన స్వామి స్వరూపం ఉంటుంది. అంటే కిందున్న పీఠభాగం బ్రహ్మదేవుడు, లింగాకారం శివుడు, పైన ఉన్న మూర్తి రూపం విష్ణువు..ఇలా త్రిమూర్తులు కలసి స్వరూపం కింద అంతస్తులో ఉంటుంది. పీఠానికి ఆగ్నేయం వైపు గణపతి,  నైరతి వైపు సూర్యుడు, ఈశాన్యం వైపు పరమేశ్వరుడు , వాయువ్యం వైపు అమ్మవారు...మధ్యలో నారాయణుడు ఉంటారు. అందుకే ఇక్కడ సత్యనారాయణుడిని పంచాయతన మూర్తి అంటారు. 


Also Read: అశ్వత్థామ మంచివాడా - చెడ్డవాడా..అత్యంత శక్తిమంతుడైన బ్రాహ్మణ పుత్రుడికి ఎందుకీ శాపం!


అన్నవరంలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు


1. ఘాట్ రోడ్ ఎక్కుతూ ఉండగా నేరెళ్లమ్మ అనే గ్రామదేవత ఆలయం దర్శించుకోవచ్చు. ఒకప్పుడు పిఠాపురంలో ఉండే అమ్మవారు .. స్వామివారు ఇక్కడకు వచ్చిన తర్వాత ఇక్కడకు వచ్చి వెలిశారని స్థలపురాణం. 


2. మెట్లదారి దగ్గర కనకదుర్గ ఆలయం దర్శించుకోవచ్చు


3. అన్నవరం కొండపైకి వెల్లేముందు మార్గ మధ్యలో వనదుర్గ అమ్మవారి ఆలయం ఉంది.. ఇక్కడ రాత్రి వేళ అమ్మవారు సంచరిస్తుంటారని అక్కడుండే కొందరు ఉపాసకులు చెబుతారు.
 
4. కొండపై స్వామి ఆలయం పక్కన సీతారామచంద్రులు ఉన్నారు. భద్రగిరిపై వెలిసిన సీతారాములు రత్నగిరిపై వెలసిన స్వామికి  క్షేత్రపాలకులు


5.సన్ డయల్ అని ఉంటుంది...పిడవర్తి కృష్ణమూర్తి శాస్త్రి, స్థానిక జమిందారు కలసి రూపొందించారు. దానిపై చిన్న రాతిగోడలాంటిది సూర్యుడి నీడ ఆధారంగా సమయాన్నిసూచిస్తుంది. 


Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!


ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణం ఇక్కడ వైభవంగా జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు అన్నవరంలో జరిగే గిరిప్రదక్షిణలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం తర్వాత అన్నవరం ప్రసాదం ప్రత్యేకం. విశాఖ ఏజెన్సీ నుంచి నెలకు దాదాపు 20 లక్షల ఆకులు తెప్పించి వాటిలో ప్రసాదం కట్టి ఇస్తారు. ఇక్కడున్న జంట కొండల మధ్య రహస్య స్థావరం ఉందని..అల్లూరి సీతారామరాజు ఉద్యమ సమయంలో ఆ రహస్యమార్గాన్ని వినియోగించేవారని చెబుతారు.