Interesting Facts about  Ashwatthama:  ద్వాపర యుగం నుంచి దశావతారం అయిన కల్కి కోసం ఎదురుచూస్తున్నా..ద్రోణుడి తనయుడిని..నా పేరు అశ్వత్థామ అంటూ కల్కి 2898 ADలో నుదుట మణితో కనిపించాడు బిగ్ బీ అమితాబ్. ఇందులో ఓ శివలింగానికి పూజలు చేస్తుంటే...ఓ కుర్రాడు మీరెవరు? ఆ గాయాలేంటి అని అడుగుతాడు...ఇంతలో శివలింగంపై పడే నీటి చుక్కలు ఆగిపోతాయి..అది చూసిన వెంటనే లేచి నిల్చున్న అశ్వత్థామ నా సమయం ఆసన్నమైంది నా అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైందంటాడు.


ఇంతకీ ఎవరీ అశ్వత్థామ?


అశ్వత్థామ నుదుట మెరుస్తున్న ఆ మణి ఏంటి?


ద్వాపర యుగం నుంచి ఇంకా బతికే ఎందుకున్నాడు?


అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉండడం వరమా? శాపమా?


ప్రస్తుతం అశ్వత్థామ ఎక్కడున్నాడు? ఎవరైనా చూశారా?


ఈ ప్రశ్నలన్నింటింకీ సమాధానమే ఈ కథనం...


ఎవరీ అశ్వత్థామ!


ద్రోణాచార్యుడు-కృపి దంపతులకు ఎన్నేళ్లైనా సంతానం కలగలేదు. ఎన్నో పూజలు చేసిన ద్రోణాచార్యులు చివరకు హిమాలయాలు చేరుకున్నాడు. అక్కడ స్వయంభుగా వెలసిన శివలింగాన్ని పూజించి ఏళ్ల తరబడి తీవ్రమైన తపస్సు చేశాడు. శివుడి శక్తితో సమానమైన పుత్రుడు జన్మించాలని కోరుకున్నాడు. అలా శివుడి అంశతో ద్రోణుడు-కృపి దంపతులకు జన్మించాడు అశ్వత్థామ. బాలుడు పుట్టిన వెంటనే వినిపించిన ఏడుపు గుర్రం అరుపులా ఉండడంతో...అశ్వత్థామ అని పేరుపెట్టారు. అశ్వత్థామ పుట్టిన తర్వాత ద్రోణుడు చాలా దుర్భరమైన జీవితం గడిపాడు. తనవల్ల కుమారుడికి కూడా కష్టాలు తప్పడం లేదని భావించిన ద్రోణుడు..తనకు గోవుని దానంగా ఇవ్వమని ఎంతమందిని అడిగినా ఫలితం లేకపోయింది. అలా ఎన్నో కష్టాలు అనుభవించి చివరకు హస్తినాపురానికి చేరుకుని పాండవులు, కౌరవులకు అస్త్ర విద్యలు నేర్పించే గురువుగా బాధ్యతలు స్వీకరించాడు.అలా పాండవులు, కౌరవులతో పాటూ అశ్వత్థామ కూడా సకల విద్యలు నేర్చుకున్నాడు...


Also Read: కల్కి ఎంట్రీతో కలియుగం అంతమైపోతుందా - కల్కి ఎప్పుడు వస్తాడు!


అశ్వత్థామ నుదుట మెరుస్తున్న ఆ మణి ఏంటి?


అశ్వత్థామ నుదుట మణితోనే జన్మించాడు. ఆ మణి నుదుటిపై ఉన్నంతవరకూ  ఏ ఆయుధం వలన కానీ, దేవతల వలన కానీ, నాగులు వల్ల కానీ ప్రాణభయం ఉండదు...పైగా ఆకలి దప్పులు కూడా ఉండవు.  కల్కి 2898 ADలో అశ్వత్థామ గా నటిస్తోన్న అమితాబ్ నుదుటిమీద కనిపించిన  మణి ఇదే. 


అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడున్నాడంటే?


యుగ యుగాలుగా ఇప్పటికీ భూమ్మీద నివసిస్తున్న వారు ఏడుగురు ఉన్నారు. వారినే సప్త చిరంజీవులు అంటారు. వారే హనుమంతుడు, విభీషణుడు, వ్యాసుడు, పరశురాముడు, అశ్వత్థామ, బలిచక్రవర్తి, కృపాచార్యులు. ఇప్పటికీ జీవించి ఉన్న సప్త చిరంజీవుల్లో ఒకడైన అశ్వత్థామ  ఇప్పటికీ బతికే ఉన్నాడని ఉత్తరాదిన నమ్ముతారు. అప్పుడప్పుడు బయటకు వచ్చి కారుతున్న రక్తానికి నూనె, పసుపు అడుగుతాడని అక్కడి వారు చెబుతుంటారు. అసిర్గత్  అనే ప్రాంతంలో ఉన్న శివలింగానికి రోజూ సాయంత్రం వచ్చి పూజలు చేస్తాడని చెబుతారు. అందుకే నిత్యం సూర్యాస్తమయ సమయానికి ఆ కోటని మూసివేస్తారు..కేవలం దివ్య శక్తులు ఉన్నవారే అందులోకి ప్రవేశించగలరని..అశ్వత్థామ నిత్యం అక్కడ శివలింగానికి అభిషేకం చేస్తాడని చెబుతారు.  కల్కి 2898 AD ట్రైలర్లో అమితాబ్ శివలింగాన్ని పూజిస్తున్నట్టు చూపించారు కదా...ఈ కథనాన్ని ఆధారంగా చేసుకునే ఆ సన్నివేశాలు తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. 


ఇప్పటికీ బతికి ఉండడం అశ్వత్థామకి వరమా - శాపమా?


మహాభారత యుత్ధంలో కౌరవుల తరపున పోరాడాడు అశ్వత్థామ. తను చేసిన తప్పుల వల్లే కలియుగాంతం వరకూ ప్రాణాలతో ఉంటాడనే శాపం పొందాడు. అసలేం జరిగిందంటే...మహాభారత యుద్ధంలో యోధులంతా శత్రువులను చీల్చిచెండారారు. రాజ్యం కోసం కౌరవులు - పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో ద్రోణుడు - అశ్వత్థామ సింహాసనాన్ని గౌరవించి కౌరవుల పక్షాన నిలబడ్డారు. ఘటోత్కచుడు కౌరవ సేనని చీల్చి చెండాడుతుంటే ఎదురొడ్డి నిల్చున్నది అశ్వత్థామ ఒక్కడే. పైగా ద్రోణుడు, అశ్వత్థామ ఉన్నంతవరకూ కౌరవ సన్యాన్ని నిలువరించడం అంత సులభం కాదని భావించిన శ్రీ కృష్ణుడు యుక్తితో యుద్ధం గెలవాలని భావించాడు.  అందుకే ధర్మరాజుతో ‘అశ్వత్థామ హతః..’ అని గట్టిగా చెప్పి.. ‘కుంజరః’ అని నెమ్మదిగా చెప్పించాడు. తన కుమారుడే మరణించాడనుకుని ద్రోణుడు తన మాట ప్రకారం అస్త్ర సన్యాసం చేశాడు. ఇదే అదనుగా దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి తల నరికేస్తాడు.  


Also Read: కలియుగం ఇంకా ఎన్నేళ్లుంది - కల్కి అవతరించేది అప్పుడేనా!



అశ్వత్థామకి శ్రీ కృష్ణుడి శాపం!


తండ్రి మరణం, స్నేహితులైన కౌరవులు వెనక్కు తగ్గడం సహించలేకపోయిన అశ్వత్థామ పాండవులపై పగతో రగిలిపోయాడు. పాండవులను అంతం చేసి ప్రభువైన దుర్యోధనుడి రుణం తీర్చుకోవాలని అనుకున్నాడు. అందుకే పాండవులు నిద్రిస్తున్న శిబిరంపై దాడి చేశాడు కానీ అప్పటికే శ్రీ కష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పించేస్తాడు....ఆగ్రహంతో ఊగిపోయిన అశ్వత్థామ అక్కడ నిద్రిస్తున్న ఉపపాండవుల (ప్రతివింధ్యుడు, శ్రుతసోముడు, శ్రుతకర్ముడు, శతానీకుడు, శ్రుతసేనుడు) తలలు నరికి దుర్యోధునుడి దగ్గర పడేస్తాడు.ఇది తెలుసుకున్న అర్జునుడు తనని వెంబడిస్తాడు. అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగిస్తే...అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు.  భూమండలాన్ని నాశనం చేసే ఆ అస్త్రాలను ఉపసంహరించుకోవాలని దేవతలంతా అడిగితే అర్జునుడు ఉపసంహరించుకుంటాడు. అయితే బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వెనక్కు తీసుకునే అవకాశం లేకపోవడంతో ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితుడిపై ప్రయోగిస్తారు..ఆ గర్భం  విచ్ఛిన్నమవుతుంది.  అశ్వత్థామ కుటిల బుద్ధి చూసి ఆగ్రహం చెందిన కృష్ణుడు...అశ్వత్థామ తలపై ఉన్న మణిని తీసుకుని ‘ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో, ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో కలియుగాంతం వరకూ ఈ భూమ్మీదే తిరుగు’ అని శపిస్తాడు. బ్రహ్మాశిరోనామకాస్త్ర ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువును కృష్ణుడు తన యోగమాయతో మళ్లీ బతికిస్తాడు. బ్రాహ్మణుడు, సకల విద్యల్లో ఆరితేరిన అశ్వత్థామ...క్రోధం, మూర్ఖత్వం కారణంగా శాపగ్రస్తుడయ్యాడు.  


ఇప్పుడు కల్కి 2898 AD సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ నటించడంతో ...అందరకీ ఈ క్యారెక్టర్ ఏంటా అనే ఆసక్తి నెలకొంది. 


Also Read: 'నాస్తికో వేదనిందకః'- కలియుగంలో ఇంతేనా, సనాతనధర్మంపై వివాదం ఈ కోవకే చెందుతుందా!


కల్కికి - అశ్వత్థామకి లింకేంటి!


ఇక ‘కల్కి’లో అమితాబ్‌ అశ్వత్థామగా కనిపిస్తుండటంతో ఆ పాత్రపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ద్వాపరయుగం నుంచి ఎదురచూస్తున్న అశ్వత్థామకి శాపవిమోచనం ఎప్పుడు? ఇంతకీ కల్కికి అశ్వత్థామకి లింకేంటి? అనే చర్చ జరుగుతోంది. అయితే భూమ్మీద ఇప్పటికీ జీవించి ఉన్నవారు ఏడుగురు అని చెప్పుకున్నాం కదా...ఈ సప్తచిరంజీవుల్లో పరశురాముడు, కృపాచార్యులు, వ్యాసుడు, అశ్వత్థామ..ఈ నలుగురు కల్కి జన్మించనున్న శంబల ( హిమాలయాల్లో ఉన్న దేవతల నగరం - శమంతక మణి కూడా ఇక్కడే ఉందని ప్రచారం)లో అడుగుపెట్టనున్నారని కల్కి పురాణం చెబుతోంది. వీరిలో పరశురాముడే స్వయంగా కల్కికి గురువుగా మారి విద్యలు నేర్పిస్తాడని ఉంది. వీళ్లు నలుగురు కలసి ధర్మ సంస్థాపనలో కల్కికి సహాయం చేస్తారని అంటారు. 


ఇంతకీ శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో చివరిది అయిన కల్కి వచ్చేదెప్పుడు?.. కల్కి ఆగమనానికి ముందు సూచనలేంటి? మరో కథనంలో చెప్పుకుందాం...