Telangana News: తెలంగాణలో రుణమాఫీకి చర్యలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 15 నాటి కల్లా రుణమాఫీ చేయాల్సిందేనంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీని కోసం స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వ్యవసాయ, సహకార శాఖాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన... రుణమాఫీ అంశంపై ఎక్కువ చర్చించారు. 


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో రుణమాపీ కీలక పాత్ర పోషించింది. అందుకే ఆ హామీ అమలుపై సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ దీనిపై రాజకీయ దుమారం రేగింది. ఎన్నికల ముందు చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడితే... ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తామంటూ ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. అప్పటి లోపు చేయకుంటే రాజీనామాలకు సిద్ధపడాలని బీఆర్‌ఎస్‌ సవాల్ చేసింది. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి... సవాల్ స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. అందుకే ఎలాగైనా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. 


ఎన్నికల్లో విజయం సాధిస్తే రెండు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామంటు అసెంబ్లీ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ ప్రచారం చేసింది. అందుకే 2 లక్షల రుణం తీసుకున్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. బ్యాంకర్ల నుంచి వివరాలు తీసుకొని అర్హులను గుర్తించాలన్నారు. బ్యాంకుల్లోనే కాకుండా పీఎఏసీఎస్‌ల నుంచి కూడా రుణాలు తీసుకున్న రైతుల సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాలని సూచించారు. 


వివరాలు వచ్చిన తర్వాత రుణామాఫీ విధివిధానాలు, అర్హతలు, పంపిణీ వివరాలు అన్నింటిపై స్పష్టమైన సమాచారంతో మరోసారి సమావేశం కావాలని సూచించారు రేవంత్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరాల్సిందేనంటూ స్పష్టం చేశారు. ఒకేసారి అందరికీ రుణమాఫీ కష్టమవుతుందని అధికారులు చెప్పడంతో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూడాలని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఎంత మంది అర్హులు ఉంటారు... ఎంత రుణాలు తీసుకొని ఉంటారనే సమాచారం ఇంకా బ్యాంకుల నుంచి రాలేదని అధికారులు వివరించారు. వీలైనంత త్వరగా సమాచారాన్ని తెప్పించి ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు.